జన సాంద్రత ఎక్కువగా వున్నా, వైరస్ వ్యాప్తి చెందడానికి అవకాశాలు ఎక్కువగా వున్నా కేరళ ఈ మహమ్మారిని సమర్ధవంతంగా కట్టడి చేయగలిగింది. మొదటి, రెండో వేవ్‌ల్లోనూ పరిస్థితిని అదుపు దాటిపోకుండా చూసింది. వృద్ధులు ఎక్కువగా వున్నందువల్ల వారికి కోవిడ్ ముప్పు ఎక్కువగా వుంటుంది. అయినప్పటికీ ప్రభుత్వం వేలాది మందిని కాపాడగలిగింది. ప్రవాసులు ఎక్కువగా వుండడం వల్ల విదేశాల నుండి వివిధ వైరస్ వేరియంట్లు దిగుమతి కావడానికి ఎక్కువ అవకాశాలు వుంటాయి. కానీ నిరంతర అప్రమత్తత వల్ల కేరళ ఆ సవాళ్ళన్నింటినీ సమర్ధవంతంగా ఎదుర్కొనగలిగింది.
గత కొద్ది వారాలుగా కేరళ నిరంతరంగా వార్తల్లో నిలుస్తోంది. కొత్తగా కరోనా కేసులు బాగా పెరుగుతున్నాయి. దేశవ్యాప్త కేసుల్లో దాదాపు సగం ఇక్కడే నమోదవుతున్నాయి. అన్ని రాష్ట్రాల్లోకెల్లా కేరళ ఈ మహమ్మారిని అత్యంత సమర్ధవంతమైన రీతిలో ఎదుర్కొనగలిగిందన్నది వాస్తవం. అయితే, ప్రస్తుత సమస్య లేదా పరిస్థితులు దాని పర్యవసానంగానే వున్నాయి. ఈ పరిస్థితుల్లో కేంద్ర బృందం రాష్ట్రంలో పర్యటించింది. ఇక్కడి వాస్తవాలను ఆ బృందం అర్ధం చేసుకుందని ఆశిద్దాం. ఈ సమస్యకు కీలక పరిష్కారమైన వ్యాక్సిన్ డోసులను అందచేసి సహాయపడుతుందని భావిద్దాం.
కరోనా మహమ్మారిని ఎదుర్కొనడంలో ఇతర రాష్ట్రాల కన్నా కేరళ విజయవంతమైన రీతిలో వ్యవహరించిందని రుజువు చేయడానికి ఐదు అంశాలు వున్నాయి. కోవిడ్ మరణాలు తక్కువగా నమోదు కావడంలో గల అవకతవకలను మీడియా గుర్తించింది. శ్మశానవాటికల్లో కోవిడ్ జాగ్రత్తలు తీసుకుని పెద్ద సంఖ్యలో మృత దేహాలకు అంతిమ సంస్కారాలు చేసిన దృశ్యాలు నమోదయ్యాయి. ఉత్తర భారతంలో గంగా నదిలో రోజూ వందలాది మృతదేహాలు కొట్టుకు పోవడాన్ని మొత్తం ప్రపంచమంతా చూసింది. దీనికి భిన్నంగా, కేరళలో ఇలా నమోదు కాని కోవిడ్ మరణాల సంఖ్య ఇతర రాష్ట్రాలతో పోలిస్తే చాలా తక్కువగా వుందనేది వాస్తవం. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ, చాలా రాష్ట్రాల ఆరోగ్య మంత్రిత్వ శాఖలు చూపించిన కోవిడ్ మరణాల లెక్కల్లో చాలా అవకతవకలు, లోపాలు, లొసుగులు వున్నాయి. వీటిల్లో కొన్ని ఆరోగ్య నిర్వహణా వ్యవస్థలోని లోపాల వల్ల జరిగినవైతే మరికొన్ని పరువు దక్కించుకునే ప్రయత్నాల్లో భాగంగా చేసినవి కావడం గమనార్హం. కోవిడ్ మహమ్మారి తలెత్తినప్పటి నుండి ఇప్పటివరకు భారత్‌లో కేవలం నాలుగు లక్షల మందే మరణించారని భారత ప్రభుత్వం చెబుతోంది. ప్రపంచవ్యాప్తంగా నమోదైన కేసులు, మరణాల నిష్పత్తి పరంగా చూసినట్లైతే భారత్ లోనే ఈ నిష్పత్తి చాలా తక్కువగా వుందని చెప్పుకుంటోంది. కానీ ఈ మరణాల సంఖ్య దాదాపు పది రెట్లు వుండవచ్చని అంటే 30 నుండి 40 లక్షల వరకు వుండవచ్చని స్వతంత్ర దర్యాప్తులు పేర్కొంటున్నాయి. పరీక్షలు చేసి పాజిటివ్ వచ్చిన తర్వాత కోలుకోవడమో లేదా మరణించడమో వరకు అన్నీ డాక్యుమెంట్ల పరంగా నమోదై వుంటే ఆ డేటా వాస్తవికంగానే వుంటుంది. అవేవీ జరగనపుడు వున్న సమాచారం కూడా సమగ్రమని చెప్పలేం. సివిల్ రిజిస్ట్రీ డేటా ఈ తీరు లోనే వుంది.
డాక్యుమెంట్ చేయబడిన కోవిడ్ మరణాలు, సివిల్ రిజిస్ట్రేషన్‌లో సర్టిఫై చేయబడిన అధిక మరణాల మధ్య వ్యత్యాసం చాలా తక్కువగా వున్నందున రాష్ట్రంలో మరణాలు, కేసుల గణన సంపూర్ణంగా వున్నట్లవుతుంది. కేరళలో ఈ వ్యత్యాసం చాలా తక్కువగా వుందంటే అధిక సంఖ్యలో కేసులను, మరణాలను నమోదు చేశారన్నది స్పష్టమవుతోంది. ఇది ఇక్కడ కీలకాంశం.
ఇక రెండవది, కేరళ చాలా అప్రమత్తంగా వ్యవహరించడం. పైగా కాంటాక్ట్ ట్రేసింగ్ నైపుణ్యాలను కూడా అద్భుతంగా ప్రదర్శించిన ఫలితంగా, భారత్ లోకి ప్రవేశించిన మూడు వైరస్ రకాలను వెంటనే కనుగొనగలిగింది. సెకండరీ ట్రాన్స్‌మిషన్ (సెకండరీ సంక్రమణ)ను నివారించగలిగింది. గతేడాది మే 3వ తేదీన 60.46 లక్షల ఇన్ఫెక్షన్లు నమోదయ్యాయని మొట్టమొదటి ఐసిఎంఆర్ సీరో సర్వే అంచనా వేసింది. అంటే చాలా ఇతర రాష్ట్రాలు ఆ ఏడాది మార్చిలో దేశంలోకి దిగుమతైన ఇన్ఫెక్షన్లను గుర్తించడంలో విఫలమయ్యాయని స్పష్టంగా అర్ధమవుతోంది. అందువల్లే తొలి రెండు మాసాల్లోనే ఇంత పెద్ద సంఖ్యలో కేసులు పెరిగాయన్నది వాస్తవం.
మూడవది, దేశంలోనే అత్యంత అధికంగా కేరళలో పరీక్షలు నిర్వహించారు. ప్రతి లక్ష మందికి 78 వేల మందికి పరీక్షలు చేశారు. ఈ విషయంలో జాతీయ సగటు 33 వేలుగానే వుంది (రాష్ట్రాల్లో అయితే 30 వేల నుండి 60 వేల మధ్య వరకు వుంది). అధికంగా పరీక్షలు నిర్వహించడమంటే మరిన్ని ఇన్ఫెక్షన్లు కనుగొనడమే.
నాల్గవది, అన్ని రాష్ట్రాల్లోకెల్లా కేరళలో అత్యంత తక్కువ యాంటీబాడీలు (44 శాతం) వుండడం. ఇటీవల నిర్వహించిన సీరో సర్వేలో ఈ విషయం స్పష్టమైంది. అంటే, 2020, 2021 వేవ్‌లు (జూన్ 2021 వరకు) రెండింటి లోనూ లక్షలాది ఇన్ఫెక్షన్లను నివారించడంలో కేరళ విజయం సాధించిందనేది దీనితో స్పష్టమైంది. నాలుగు ఐసిఎంఆర్ సీరో సర్వేల్లోనూ కేరళ ప్రాతినిధ్యం తక్కువగా వుంది. అయితే, ప్రతీసారీ ఒకే జిల్లా నుండి నమూనాలు తీసుకుంటున్నారు. దీనివల్ల పోల్చి చూడడానికి కూడా సరిపోదు. ప్రతి సీరో సర్వే లోనూ కేరళలో అత్యంత తక్కువ యాంటీబాడీలు వున్నాయనేది వెల్లడైంది.
ఐదవ అంశం, ఏ సమయంలోనూ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థపై పెనుభారం పడలేదు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాలను చక్కగా సమన్వయపరిచారు. ఆక్సిజన్ లేకపోవడం, బెడ్‌లు అందుబాటులో లేకపోవడం వంటి సమస్యలను ఎదుర్కొనలేదు. భారత్‌లో కెల్లా కోవిడ్ మరణాల విషయంలో కేరళది అత్యంత విశ్వసనీయమైన డేటా. ఈ మరణాల రేటు 0.5 శాతం ఎన్నడూ దాటలేదు. జాతీయ సగటు 1.3 శాతంగా వుందని చెబుతున్నారు. బహుశా అంతకంటే ఎక్కువే వుండవచ్చు. మూడు ప్రతికూల అంశాలు-అధిక జన సాంద్రత, సుదీర్ఘమైన ఆయు ప్రమాణం, ప్రవాసులు అత్యధికంగా కలిగిన ప్రాంతాల్లో ఒకటి అయినప్పటికీ- కేరళలో మరణాల రేటు తక్కువగానే వుంటూ వచ్చిందన్నది గుర్తించాల్సిన వాస్తవం.
జన సాంద్రత ఎక్కువగా వున్నా, వైరస్ వ్యాప్తి చెందడానికి అవకాశాలు ఎక్కువగా వున్నా కేరళ ఈ మహమ్మారిని సమర్ధవంతంగా కట్టడి చేయగలిగింది. మొదటి, రెండో వేవ్‌ల్లోనూ పరిస్థితిని అదుపు దాటిపోకుండా చూసింది. వృద్ధులు ఎక్కువగా వున్నందువల్ల వారికి కోవిడ్ ముప్పు ఎక్కువగా వుంటుంది. అయినప్పటికీ ప్రభుత్వం వేలాది మందిని కాపాడగలిగింది. ప్రవాసులు ఎక్కువగా వుండడంవల్ల విదేశాల నుండి వివిధ వైరస్ వేరియంట్లు దిగుమతి కావడానికి ఎక్కువ అవకాశాలు వుంటాయి. కానీ నిరంతర అప్రమత్తత వల్ల కేరళ ఆ సవాళ్ళన్నింటినీ సమర్ధవంతంగా ఎదుర్కొనగలిగింది.
ప్రస్తుతం డెల్టా వేరియంట్ విజృంభణ వల్ల పెరుగుతున్న ఈ కేసులను అడ్డుకోవాలంటే ప్రజలందరికీ వ్యాక్సిన్లు వేయడం ద్వారానే అడ్డుకోగలం. వ్యాక్సిన్లు తగినంతగా సరఫరా లేకపోవడం వల్లనే ప్రస్తుత సమస్య నెలకొని వుంది. అలాగే ఇప్పటికే సరఫరా చేసిన వ్యాక్సిన్లను కూడా పూర్తిగా వినియోగించుకోకపోవడం మరో కారణంగా వుంది. కానీ కేరళలో వ్యాక్సిన్ వృధా రేటు దేశంలోనే చాలా తక్కువగా వుంది.
వీటిన్నింటికి తోడు తక్కువ కాల పరిమితి వుండే లాక్‌డౌన్ లను కఠినంగా అమలు చేయడం, రోజు విడిచి రోజు దుకాణాల మూసివేత, ప్రజా రవాణాను తగ్గించడం వంటి చర్యలను కేరళ ప్రభుత్వం అమలు చేసింది. ప్రజలు ఒకరితో ఒకరు కలవడం తగ్గించడానికే ఈ చర్యలన్నీ ఉద్దేశించబడ్డాయి. కానీ డెల్టా వేరియంట్లు వ్యాప్తి చెందకుండా ఇవి అడ్డుకోలేకపోయాయి. ఇందుకు విరుద్ధంగా ఈ చర్యలు ప్రతికూల ఫలితాలను ఇచ్చాయి. నిత్యావసరాలను తెచ్చుకోవడానికి ఇచ్చే సమయం లేదా ప్రాంతాలపై, ప్రయాణాలపై ఆంక్షలు విధించడంతో కాంటాక్ట్ కాలపరిమితి పెరుగుతుంది. జనాలు గుమిగూడడం పెరుగుతుంది. దాంతో ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందుతుంది. సోషల్ కాంటాక్ట్‌పై ఆంక్షలు విధించడం వెనుక లక్ష్యం మానవ సంక్షేమమే, ఈ మహమ్మారి నుండి కాపాడడమే. కానీ ప్రస్తుతం డెల్టా వేరియంట్ విజృంభిస్తున్న నేపథ్యంలో గతంలో ఫలితాలిచ్చిన చర్యలేవీ ఇప్పుడు పని చేయడం లేదు. గత వేరియంట్ల కన్నా నాలుగు రెట్లు అధికంగా ఈ వేరియంట్ వ్యాప్తి చెందుతోందని అమెరికా సిడిసి పరిశోధనలో తేలింది.
ఈ పరిస్థితుల్లో విస్తృతంగా వ్యాక్సిన్లు వేయడం, రెండు మాస్కులు ధరించడం వల్ల కొంత పరిమిత స్థాయిలోనే అయినా రక్షణ వుంటుందని భావిస్తున్నారు. మహమ్మారికి అడ్డుకట్ట వేయాలంటే వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గం. ప్రస్తుతం రెండు డోసులు వేసుకున్న వారు 18 శాతం వుండగా, ఒక డోసు వేయించుకున్న వారు 42 శాతం వున్నారు. ఓనమ్‌కి ముందు రెండు వారాల్లోగా రెండు డోసులు వేసుకున్న వారి సంఖ్య 30 నుండి 40 శాతంగా వుంటే కేరళ కొంత స్థిమితపడగలదు. ఇక భవిష్యత్‌లో స్కూలుకెళ్లే పిల్లలకు వ్యాక్సిన్లు వేయడం, బూస్టర్ డోసులు ఇవ్వడంపై నిదానంగా నిర్ణయాలు తీసుకోవచ్చు. కానీ ఇప్పటివరకు ఈ మహమ్మారిపై పోరులో కేరళ సాధించిన విజయాలు సుస్థిరపరుచుకోవాలంటే విస్తృత సంఖ్యలో వ్యాక్సిన్ అందించడం వల్లనే సాధ్యమవుతుంది.
/ ప్రొ|| ఎం.ఎస్. శేషాద్రి-ఫెలో, రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజీషియన్స్, ఎడిన్‌బరో.
ప్రొ|| జాకోబ్ జాన్-ఫెలో, ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్స్,
ఫలో, ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ. /
ఎం.ఎస్. శేషాద్రి

టి. జాకబ్ జాన్











