Feb 04,2022 15:36

లక్నో : కోవిడ్‌ నిబంధనలను ఉల్లంఘించారన్న ఆరోపణలపై సమాజ్‌వాదీ పార్టీ చీఫ్‌ అఖిలేష్‌ యాదవ్‌, రాష్ట్రీయ లోక్‌ దళ్‌ అధ్యక్షుడు జయంత్‌ చౌధరిపై ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలోని దాద్రి పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. వీరితో పాటు మరో 400 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల నేపథ్యంలో గురువారం రాత్రి యుపిలోని ఇరు ప్రతిపక్షనేతలు .. కోవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించి గ్రేటర్‌ నోయిడాలో తమ పార్టీ కార్యకర్తలతో పెద్ద సంఖ్యలో గుమిగూడారని అభియోగాలు మోపారు. కాగా, జనవరిలో కోవిడ్‌ ఉధృతి దృష్ట్యా కేంద్ర ఎన్నికల కమిషన్‌ గత ఆంక్షలను పొడిగించింది. ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో ఈనెల 11 వరకు అన్ని ర్యాలీలపై నిషేధం విధించింది. వ్యక్తిగత సమావేశాలకు వెయ్యి మందికి అనుమతినిచ్చిన సంగతి విదితమే. యుపిలో ఫిబ్రవరి 10 నుండి మార్చి 7 వరకు ఏడు దశల్లో ఎన్నికలు జరుగుతున్నాయి.