ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా ప్రకటించినట్లు ప్రజా ప్రయోజనాల విషయంలో నిర్ణయాలు తీసుకోవటంలో ఆలస్యం అయితే అది నేరపూరిత నిర్లక్ష్యం అవుతుంది. మరి కరోనా విషయంలో ఆయన చూపిన వైఖరిని ఏమని పిలవాలి? తాను చెప్పిన సూత్రం తనకు వర్తించదా? ఢిల్లీలో పాజిటివిటీ రేటు 3 నుంచి 30 శాతానికి పెరిగిన నేటి తరుణంలో వందలాది కార్మికులను బస్సులలో తీసుకు వస్తూ ప్రజారోగ్య అవసరాలను పట్టించుకోకుండా 'సెంట్రల్ విస్టా' పనులు కొనసాగించటం కేవలం నేరపూరిత నిర్లక్ష్యమేనా? లేక మద్రాసు హైకోర్టు అన్నట్లు హత్య కేసు నమోదుకు అర్హులా అనేది ఆలోచించాలి.
కోవిడ్-19 కట్టడి విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం కావడంతో ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘం రాష్ట్ర హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేసింది. ఈ వ్యాజ్యంలో కోర్టు ప్రభుత్వానికి అనేక సూచనలు సైతం చేసింది. అసలు ప్రభుత్వాలు కరోనా నివారణకు ముందు జాగ్రత్తలు తీసుకోకపోవడం నిర్లక్ష్యం అవుతుందా? ఆ నిర్లక్ష్యం ఎప్పుడు నేరపూరితం అవుతుంది? ఈ విషయమై అనేకమార్లు సుద్దులు చెప్పిన బిజెపి స్వయంగా తనే నేరపూరిత నిర్లక్ష్యానికి పాల్పడడమేమిటి?
నేరపూరిత నిర్లక్ష్యం అంటే...?
చట్టం ప్రకారం నిర్లక్ష్యం అంటే జాగ్రత్త తీసుకోవాల్సిన బాధ్యత ఉండి కూడా ఆ బాధ్యతను ఉల్లంఘించడం. ఈ క్రమంలో ఆ వ్యక్తి తాను తీసుకోవాల్సిన హేతుబద్ధమైన జాగ్రత్తను తీసుకోవటంలో విఫలమవుతాడు. ఫలితంగా ఎదుటివారికి నష్టం లేదా ప్రమాదం జరుగుతుంది. ఆ నిర్లక్ష్యం నిందించదగినదై, ఎక్కువ మోతాదులో నిర్లక్ష్యం ఉంటే దాన్ని నేరపూరిత నిర్లక్ష్యం అంటారని కోర్టులు తీర్పులు చెప్పాయి. అంటే తాను తీసుకునే నిర్ణయం ప్రమాదానికి కారణమవుతుందని తెలిసినా ఆ ప్రమాదం గురించి పట్టించుకోకపోవటం నేరపూరిత నిర్లక్ష్యానికి దారితీస్తుంది.
కేంద్ర ప్రభుత్వ నేరపూరిత నిర్లక్ష్యం
మొదటిసారి కరోనా వచ్చినప్పుడు దానిమీద అవగాహన రావటానికి కొంత సమయం పట్టింది. కాని రెండవసారి కోవిడ్ మహమ్మారి విరుచుకుపడుతుందన్న విషయమై ప్రపంచం దగ్గర కావాల్సినంత సమాచారం ఉంది. అనేక దేశాల అనుభవం ఉంది. శాస్త్రవేత్తల సూచనలు, హెచ్చరికలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం తాను స్వయంగా సుప్రీంకోర్టుకు సమర్పించిన నివేదిక ప్రకారం డిసెంబరు 4వ తేదీ, 2020 నుంచి రెండవ వేవ్ గురించి నిరంతరం రాష్ట్రాలకు లేఖలు రాస్తున్నామని, రాబోయే కాలంలో కేసుల అంచనా-తీసుకోవాల్సిన వైద్య సదుపాయాల విషయమై ఆదేశాలు చేశామని తెలిపింది. అలాగే ఆసుపత్రులలో పడకల సామర్ధ్యం గురించి, ఐ.సి.యు, అదనపు ఆసుపత్రులు, అక్కడ క్షేత్ర స్థాయి సౌకర్యాలు, ఆక్సిజన్ ఆధారిత పడకలు, ఆక్సిజన్ సరఫరా తప్పనిసరిగా అందే విధంగా ప్రణాళికలు తయారు చేయమని రాష్ట్రాలను కోరినట్లు తెలిపింది. ఇతర వైద్య సిబ్బంది శిక్షణ, అంబులెన్సు సౌకర్యాలు, పరీక్షలు మొదలైన విషయాలపై కూడా ప్రణాళికలు కోరామని తెలిపింది. అంటే డిసెంబరు నుంచే కేంద్ర ప్రభుత్వానికి సెకండ్ వేవ్ గురించిన అవగాహన ఉన్నది. మరి కేంద్రం చేతిలో ఉన్న ఆక్సిజన్ సరఫరాను, ఉత్పత్తిని ప్రణాళికా బద్ధంగా ఎందుకు చేయలేకపోయింది. ప్రస్తుతం ఆక్సిజన్ అందక అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. రాష్ట్రాలను హెచ్చరించిన కేంద్రం తాను ఎందుకు విఫలమైందో చెప్పలేదు. ఈ విధమైన అవగాహన ఉన్న కేంద్రప్రభుత్వం అనేక దశలలో ఎన్నికలు జరిపి లక్షలాదిమంది ప్రజలను సభలకు పిలిచి కరోనా వ్యాప్తికి కారణమైంది. కుంభమేళాకు, మతపరమైన, రాజకీయ పరమైన భారీ సమావేశాలకు, సభలకు అనుమతులు ఇచ్చి కరోనా సెకండ్ వేవ్ లో కేసుల సంఖ్య వేల నుంచి లక్షలకు పెరగటానికి కారణం కాలేదా? బెంగాల్ లో అనేక దశలలో ఎన్నికలు జరపటం మంచిది కాదని, అది కరోనా వ్యాప్తికి దారి తీయవచ్చని విమర్శలు వచ్చినా ఏప్రిల్ 29 వరకు ఎన్నికలు జరపటం ద్వారా బెంగాల్ లో కొత్త కరోనా వేరియంట్ రావటానికి కారణమయిందన్న విమర్శలకు సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నది. కేంద్రప్రభుత్వం కరోనా విషయంలో తీసుకున్న అనుచిత నిర్లక్ష్య వైఖరి కారణంగానే ఉధృతం అయిందని లాన్సెట్ మరియు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నివేదిక ఇచ్చిన తరుణంలో కేంద్రప్రభుత్వం నేరపూరిత నిర్లక్ష్య వైఖరి కరోనా విషయంలో ప్రదర్శించినట్లు కాదా! సభలు, సమావేశాలు, కుంభమేళాలకు అనుమతిస్తే కరోనా పెరిగే అవకాశం ఉందనే విషయాన్ని ప్రభుత్వం పట్టించుకోకపోవటం ద్వారా లక్షల మంది కరోనా వ్యాధి బారిన పడటానికి, మరణించడానికి దారి తీయలేదా? ఇంత భారీ స్ధాయిలో ప్రమాదం జరగటం...అది ఇంకా కొనసాగుతుండటం నిలువెత్తు నిర్లక్ష్యం కాదా? మార్చి 23న ప్రజా సమూహాల కదలికలపై ఆంక్షలు విధంచమని ఆదేశాలు జారీ చేస్తూ ఏప్రిల్ 29 దాకా అన్ని రకాల రాజకీయ, మతపరమైన కార్యకలాపాలపై ప్రధానమంత్రి పాల్గొంటూ తాను ఇచ్చిన ఆదేశాలు తానే ఉల్లంఘిస్తూ ప్రజల జీవితాలతో చెలగాటమాడటం, లాక్‌డౌన్ విధించే అవకాశాన్ని పరిశీలించమని సుప్రీంకోర్టు చేత సూచన చేయించుకునే పరిస్థితి తీసుకురావటం కేంద్రప్రభుత్వ నేరపూరిత నిర్లక్ష్య వైఖరి కాదా! సంవత్సరం నుంచి కేంద్రప్రభుత్వం ఏం చేసిందని హైకోర్టులు ప్రశ్నించటం దేనికి సంకేతం? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా ప్రకటించినట్లు ప్రజా ప్రయోజనాల విషయంలో నిర్ణయాలు తీసుకోవటంలో ఆలస్యం అయితే అది నేరపూరిత నిర్లక్ష్యం అవుతుంది. మరి కరోనా విషయంలో ఆయన చూపిన వైఖరిని ఏమని పిలవాలి? తాను చెప్పిన సూత్రం తనకు వర్తించదా? ఢిల్లీలో పాజిటివిటీ రేటు 3 నుంచి 30 శాతానికి పెరిగిన నేటి తరుణంలో వందలాది కార్మికులను బస్సులలో తీసుకు వస్తూ ప్రజారోగ్య అవసరాలను పట్టించుకోకుండా 'సెంట్రల్ విస్టా' పనులు కొనసాగించటం కేవలం నేరపూరిత నిర్లక్ష్యమేనా? లేక మద్రాసు హైకోర్టు అన్నట్లు హత్య కేసు నమోదుకు అర్హులా అనేది ఆలోచించాలి.
రాష్ట్ర ప్రభుత్వ వైఖరి
రాష్ట్రానికి సెకండ్ వేవ్ గురించి ముందు తెలియదా? ఆంధ్రప్రదేశ్‌లో జనవరి 15 నుంచి మార్చి 15 మధ్యలో సెకండ్ వేవ్ వస్తుందని ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ ముందుగానే ఊహించింది. 2020 డిసెంబరు 12న 'టైమ్స్ ఆఫ్ ఇండియా'లో ప్రచురితమైన కథనం ప్రకారం ఈ సెకండ్ వేవ్ నివారణకు, నియంత్రణకు తీసుకోవాల్సిన సూచనలను జారీ చేసింది. ప్రధానంగా మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతులు శుభ్రంగా కడుక్కోవటం, ఈ అవగాహన కల్పించేందుకు ప్రముఖ వ్యక్తులను ఉపయోగించుకోవటం, ప్రముఖ వ్యక్తులను ఉపయోగించుకోవడం పెద్ద పెద్ద సమావేశాలు, సభలపై ఆంక్షలు విధించడం, వైద్య సదుపాయాలు సిద్ధం చేసుకోవడం మొదలైనవి. వీటిలో ఏ ఒక్కటి కూడా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయలేదు. అలాగే కేంద్రప్రభుత్వ అఫిడవిట్ ప్రకారం రాష్ట్రాలకు చేసిన హెచ్చరికలు, సూచనలు పట్టించుకోలేదు ప్రణాళికలు సిద్ధం చేయలేదు. కేంద్రప్రభుత్వం ఏప్రిల్ 1 నుంచి అమలు చేయమని చెప్పిన ఏ మార్గదర్శకాలను పాటించకుండా ఏప్రిల్ 20 నుంచి జీవోలు జారీ చేయటం, ఆంక్షలు విధించడం నేరపూరిత నిర్లక్ష్య వైఖరి కాదా? ముందుగానే మేల్కొని ఉంటే జరుగుతున్న మరణాలు నివారించబడేవి.
కోవిడ్ సమస్యకు వ్యాక్సిన్ ఒక్కటే పరిష్కారం కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ స్పష్టం చేశారు. ఈ వ్యాధిని అంతం చేసేందుకు ఇంకా చాలా దూరం ప్రయాణం చేయాల్సి ఉన్నందున వ్యాక్సిన్‌తో పాటు ప్రజారోగ్య చర్యల ద్వారా ఈ వ్యాధిని కొన్ని నెలల్లోనే నియంత్రించ వచ్చని తెలిపారు. ప్రమాదం అని తెలిసి కూడా ఆంక్షలు విధించకుండా అన్నిటినీ అనుమతించటం, అనేక మరణాలకు కారణం కావటం ప్రధాని మోడీ చెప్పినట్లు క్రిమినల్ నెగ్లిజన్స్ కాదా? కేరళ లాంటి రాష్ట్రాలు ఆక్సిజన్ విషయంలో స్వయంసమృద్ధి సాధించగా రాష్ట్ర ప్రభుత్వం ముందుగా ఆ విషయంలో ఎటువంటి చర్యలు తీసుకోలేదు. రాష్ట్రంలో అనేక చోట్ల ఆక్సిజన్ కొరవడి మరణాలు సంభవిస్తున్నాయి. కేంద్రం డిసెంబరు నుంచి ఉత్తరాలు రాస్తే ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవటాన్ని ఏమంటారు?
ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యుద్ధ ప్రాతిపదికన కోవిడ్-19 చికిత్సకు, వ్వాప్తి నిరోధానికి సమర్ధవంతమైన, శాస్త్రీయమైన చర్యలు తీసుకోవాలి. లేనట్లయితే ఈ విషయంలో ప్రజలు ఒక నిర్ణయానికి రావాల్సి వస్తుంది.
/ వ్యాసకర్త ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘం ప్రధాన కార్యదర్శి /
పొత్తూరి సురేష్ కుమార్











