లోగడ రైల్వే ప్రమాదాలు సంభవించినప్పుడు తనకు ప్రత్యక్షంగా సంబంధం లేకపోయినా రైల్వే శాఖ పక్షాన నైతిక బాధ్యత వహిస్తూ లాల్ బహదూర్ శాస్త్రి రాజీనామా చేశారు. జనవరి 2020 నుండి ఇప్పటివరకు దాదాపు అన్ని సందర్భాల లోనూ మోడీ ప్రభుత్వం సకాలంలో సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వలననే ప్రస్తుత పరిస్థితి దాపురించింది. దీనికితోడు ఇటీవల కాలంలో ఎన్నికలు, కుంభమేళాలు పరిస్థితిని మరింత దిగజార్చాయి. దాదాపు 2 లక్షల మంది పైగా ప్రజలు కరోనా మహమ్మారికి బలి కావటంలో తన బాధ్యతను అంగీకరించి ప్రధాని మోడీ రాజీనామా చేయటం సమంజసమని పలువురు భావిస్తున్నారు.
ఒక రోజులో మూడు లక్షలకు పైగా కొత్త కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. రెండు వేల మందికి పైగా కరోనా రోగులు మృత్యువాత పడుతున్నారు. బెడ్ల కొరత, ఆక్సిజన్ కొరత, రెమ్‌డెసివిర్ బ్లాక్ మార్కెట్ వంటి సమస్యలతో అనేక రాష్ట్రాలలో కరోనా బాధితులు కష్టనష్టాలకు గురవుతున్నారు. కరోనా వ్యాప్తిని నిరోధించే ందుకు అవసరమైన వ్యాక్సిన్ల కొరత కూడా నెలకొంది. ఇందుకు ప్రధాన కారణం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముందుచూపు ప్రణాళికతో, సరైన సమయంలో, సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం. తీసుకున్న నిర్ణయాలు అమలు కాకపోవడం. అంతేకాక దేశ ప్రజల ప్రాణాలను కాపాడవలసిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పైన ఉందన్న విషయాన్ని మరిచిపోయి, ప్రతిదాన్ని వ్యాపార కోణంలో చూడడం, మానవతా దృష్టి లోపించడంతో ప్రస్తుత పరిస్థితికి దారితీసింది.
ఇప్పుడు దేశంలో వ్యాప్తిలో వున్నది బి1.162 కొత్త కరోనా స్ట్రెయిన్‌గా శాస్త్రజ్ఞులు అక్టోబర్ 2020 లోనే గుర్తించారు. దీనిపైన వెంటనే జినోమ్ సీక్వెన్సింగ్ పరిశోధనలు జరిపి, కట్టడికి అవసరమైన మందుల గురించి పరిశోధనలు చేసేందుకు జనవరి 2021లో రూ.115 కోట్ల ఖర్చు చెయ్యా లని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయినప్పటికీ, బయో టెక్నాలజీ డిపార్ట్‌మెంట్ (డిబిటి)కు ఒక్క రూపాయి కూడా విడుదల చేయ్యలేదు. చిట్టచివరలో డిబిటి తన అంత ర్గత వన రుల నుండి రూ.80 కోట్లు ఖర్చు చెయ్యాలని నిర్ణయిం చింది.
కరోనా వ్యాప్తిని నిరోధించడానికి కరోనా వ్యాక్సిన్లు రెండు డోస్‌లు ఇవ్వాల్సి వుంటుంది. ఇప్పటికి సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా 'కోవిషీల్డ్ (ఆస్ట్రాజనికా), భారత్ బయోటెక్ 'కో-వ్యాక్సిన్'ను ఉత్పత్తి చేస్తున్నాయి. ఒకవైపు మన దేశంలో వ్యాక్సిన్ల కొరత వుండగా విదేశాలకు ఉచితంగా 1.06 కోట్ల డోసులు, అంతర్జాతీయ కో-వ్యాక్స్ ఒప్పందం కింద 1.96 కోట్ల డోసులు ఎగుమతి చేయడంతోపాటు, 3.58 కోట్ల వ్యాక్సిన్ డోసులు వాణిజ్యపరంగా విదేశాలకు విక్రయించ బడ్డాయి. జనవరి 21, 2021 దరిమిలా ఇప్పటివరకు 6.6 కోట్లకు పైగా డోసులు విదేశాలకు ఎగుమతి అయ్యాయి.
తన దేశంలో కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తున్న నాలుగు కంపెనీలకు అమెరికా 2020 ఆగస్టు లోనే రూ.44.800 కోట్ల ఆర్థిక సహాయం అందించింది. దీంతో ఉత్పత్తి గణనీయంగా పెరిగి ఆ దేశ జనాభాలో నాల్గవ వంతు మందికి రెండు డోసులు ఇవ్వగలిగాయి. భారత్‌లో ఇటీవల కరోనా రెండవ వేవ్ ఉధృతి పెరిగిన దరిమిలా మాత్రమే ఏప్రిల్ నెలలో సీరం ఇన్‌స్టిట్యూట్‌కు రూ. 3000 కోట్లు, భారత్ బయోటెక్‌కు రూ.1500 కోట్లు ఆర్థిక సహాయం ఇవ్వాలని కేంద్రం నిర్ణయించడం చేతులు కాలాక ఆకులు పట్టిన చందంగా వుంది. ఇప్పటికీ మన దేశ జనాభాలో కేవలం ఒక్క శాతం మందికే రెండు డోసుల వ్యాక్సిన్లు అందాయి.
అమెరికా ఆగస్టు 2020 నాటికే 400 మిలియన్ డోసులకు, యూరోపియన్ యూనియన్ నవంబర్ 2020 నాటికే 800 మిలియన్ డోసులకు ఆర్డర్లు ఇవ్వగా భారత్‌లో కేంద్ర ప్రభుత్వం జనవరి 2021లో 16 మిలియన్ డోసులకు మాత్రమే ఆర్డర్ ఇవ్వడం సిగ్గుచేటు.
మన దేశంలో వ్యాక్సిన్లు తయారు చేసే సామర్థ్యం ఏడు ప్రభుత్వ రంగ సంస్థలకు వున్నప్పటికీ వాటిలో వ్యాక్సిన్ ఉత్పత్తి ప్రారంభించాలన్న నిర్ణయం లోగడనే తీసుకోవలసి వున్నా నిర్లక్ష్యం చేసి ఏప్రిల్ 16న నిర్ణయం తీసుకోవడం దురదృష్టకరం. ఈ నిర్ణయం ఆరు నెలల కిందనే తీసుకుని ఆ సంస్థలకు ఆర్థిక సహాయం అందించి వుంటే ప్రస్తుత భయానక పరిస్థితి వచ్చి ఉండేది కాదు.
అనేక రాష్ట్రాలలో ఆక్సిజన్ సరఫరా లేక పిట్టలు రాలినట్లు కోవిడ్ రోగులు చనిపోతున్నారు. ప్రస్తుతం రోజుకు 8000 మెట్రిక్ టన్నుల మెడికల్ ఆక్సిజన్ అవసరం ఉంటుందని 21, ఏప్రిల్ 2021 ఢిల్లీ హైకోర్టుకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి ఒకరు తెలియపరిచారు. కేంద్రం మినహాయించిన 9 కేటగిరీల పరిశ్రమలకు అవసరమయ్యే ఆక్సిజన్ కూడా కోవిడ్ వైద్యానికి అందచెయ్యాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆక్సిజన్ సరఫరాలో నిల్వ, రవాణా పెద్ద సమస్య. ఇప్పటికిప్పుడు ఇందుకు అవస రమైన క్రయోజనిక్ కంటెయినర్లు, ట్యాంకర్లు, సిలిండర్‌లు ఉత్పత్తి సులభం కాదు. రూ. 201 కోట్ల ఖర్చుతో 162 ప్రభు త్వ జిల్లా హెడ్ క్వార్టర్స్ హాస్పిటళ్లలో పియస్‌ఎ ఆక్సిజన్ ఉత్పా దక యూనిట్లను ఏర్పాటు చేసేందుకు అక్టోబర్ 2020 లోనే టెండర్లు పిలిచారు. జనవరి 5న పి.యం.కేర్స్ ఫండ్ నుంచి నిధులు అందించాలని నిర్ణయించారు. అయితే, ఇప్పటికి మన రాష్ట్రంలో వైజాగ్ కెజిహెచ్ హాస్పిటల్‌తో సహా దేశవ్యాప్తంగా 33 హాస్పిటళ్లలో మాత్రమే ఇవి ఏర్పాటయ్యాయి.
'పి.యం కేర్స్ ఫండ్' నుండి అదనంగా 389 హాస్పిటళ్లలో వీటిని ఏర్పాటు చెయ్యాలని ఏప్రిల్ 26న కేంద్రం నిర్ణయించింది. ఉద్దేశ్యపూర్వక ఎగవేతదారులని బ్యాంకులు పేర్కొన్న 31 కార్పొరేట్ సంస్థలకు రూ.60,000 కోట్ల రుణాలను మాఫీ చేసిన మోడీ ప్రభుత్వం... రూ.2,000 కోట్లు కేటాయించి 1620 హాస్పిటళ్లలో ఈ సదుపాయం కల్పించి వుంటే పరిస్థితి మరోలా వుండేది. రోగులకు 1646 టన్నుల ఆక్సిజన్ అందుబాటులో వుండేది.
దేశంలో ఏడు కంపెనీలు రెమ్‌డెసివిర్ మందును ఉత్పత్తి చేస్తున్నాయి. ఇప్పటికి 11 లక్షల ఇంజక్షన్లు విదేశాలకు ఎగుమతి అయ్యాయి. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల పక్షాన సరైన నియంత్రణ, కఠినమైన ఆంక్షలు, చర్యలు లేకపోవడం వలన బ్లాక్ మార్కెట్లో దాదాపు 10 రెట్లు ఎక్కువ ధరకు ప్రజలు కొనుక్కోవలసిన దుస్థితి ఏర్పడింది.
సీరం ఇన్‌స్టిట్యూట్ నుండి కేంద్ర ప్రభుత్వానికి రూ.150, రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.400, ప్రైవేట్ హాస్పిటల్‌కు రూ.600 చొప్పున ... భారత్ బయోటెక్ కోవ్యాక్సిన్‌ను రాష్ట్ర ప్రభుత్వా లకు రూ.600, ప్రైవేట్ హాస్పిటల్‌కు రూ.1,200 చొప్పున సరఫరా చేస్తామని ప్రకటించడం ఎంతమాత్రం సరికాదు. ''ఒకే దేశం - ఒకే మార్కెట్'' అని పదే పదే వల్లె వేసే నరేంద్ర మోడీ ఈ రెండు కంపెనీలతోపాటు రానున్న రోజులలో దిగుమతి అయ్యే వ్యాక్సిన్లకు కూడా ఒకే ధరను నిర్ణయించాలి. అంతేకాక వాటిని కొని రాష్ట్రాలకు పోలియో వ్యాక్సిన్ వలెనే ఉచితంగా అందచేయాల్సిన బాధ్యత కేంద్రం పైన వుంది. అమెరికా, యూరోపియన్ దేశాలతో సహా అనేక దేశాలలో కరోనా వ్యాక్సిన్‌ను ప్రజలకు ఉచితంగా అందచేయడాన్ని ప్రధాని మోడీ మరవరాదు. మన దేశంలో కూడా 18 సంవత్సరాలు పైబడిన పౌరులందరికి ఉచితంగా కరోనా వ్యాక్సిన్‌ను కేంద్రం అందించాలి. ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటళ్లలో కోవిడ్ వైద్యానికి ప్రజలు లక్షలాది రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోంది. పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల పెంపు ద్వారా కేంద్ర ప్రభుత్వానికి దాదాపు రూ.2.50 లక్షల కోట్లకు పైగా అదనపు ఆదాయం సమకూరినా, దేశ ప్రజానీకం ప్రత్యేకంగా సామాన్య, మధ్యతరహా ప్రజానీకం ఎదుర్కొంటున్న విపత్కర పరిస్థితులను దష్టిలో వుంచుకుని... కేంద్ర ప్రభుత్వం మానవతా దష్టితో వ్యాక్సిన్లను కొని, రాష్ట్రాలకు అందచేయవలసిన బాధ్యతను ప్రధానమంత్రి మోడీ నిర్లక్ష్యం చేస్తే చరిత్రహీనుడిగా మిగిలిపోతారు.
లోగడ రైల్వే ప్రమాదాలు సంభవించినప్పుడు తనకు ప్రత్యక్షంగా సంబంధం లేకపోయినా రైల్వే శాఖ పక్షాన నైతిక బాధ్యత వహిస్తూ లాల్ బహదూర్ శాస్త్రి రాజీనామా చేశారు. జనవరి 2020 నుండి ఇప్పటివరకు దాదాపు అన్ని సందర్భాల లోనూ మోడీ ప్రభుత్వం సకాలంలో సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వలననే ప్రస్తుత పరిస్థితి దాపురించింది. దీనికితోడు ఇటీవల కాలంలో ఎన్నికలు, కుంభమేళాలు పరిస్థితిని మరింత దిగజార్చాయి. దాదాపు 2 లక్షల మంది పైగా ప్రజలు కరోనా మహమ్మారికి బలి కావటంలో తన బాధ్యతను అంగీకరించి ప్రధాని మోడీ రాజీనామా చేయటం సమంజసమని పలువురు భావిస్తున్నారు.
దేశంలో అత్యధిక సంఖ్యలో కోవిడ్ పరీక్షలు చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా ప్రకటిస్తోంది. కానీ పరీక్ష ఫలితాలు వారం రోజులకు గానీ పౌరులకు చేరకపోవటం అత్యంత దురదష్టకరం. దాదాపు రూ.5742 కోట్ల ఖర్చుతో రాష్ట్రంలో ప్రభుత్వ హాస్పిటళ్లలో వెంటిలేటర్లు, ఐసియు సదుపాయం వంటి మౌలిక వసతులను అభివద్ధి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం అక్టోబరు 31, 2020లో ప్రకటించినా ఇప్పటికీ ఆ దిశగా పెద్దగా చర్యలు చేపట్టలేదు. ఇకనైనా కోవిడ్ వైద్య సేవలను రోగులందరికి సకాలంలో అందించేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలి.
/ వ్యాసకర్త మాజీ మంత్రి,
రైతు సంఘాల సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్ /
వడ్డే శోభనాద్రీశ్వరరావు











