May 21,2021 07:09

కోవిడ్‌-19 మహమ్మారి మహా ప్రళయం సృష్టిస్తోంది. దీని నుండి బయట పడాలంటే ప్రతి ఒక్కరూ తమ వంతు కర్తవ్యంగా ఎంతో కొంత ఏదో ఒక విధంగా సాటి మనిషికి సహాయపడాలి. తోటి వానికి తోడుగా ఉండాలి. అంతేకానీ భయపడి పారిపోకూడదు.
ఇదొక సామాజిక సంక్షోభం. సమాజం మొత్తం కలిసి ఈ వైరస్‌ని ఓడించాలి. పదిమంది కలిసి నడిస్తే కొత్త బాట ఏర్పడుతుంది. పది చేతులు కలిస్తే ఎంత భారాన్నైనా ఎత్తిపడేయవచ్చు. అది సమిష్టి బలం, సమాజ సహజ గుణం కూడా. అది కావాలి ఇప్పడు మన అందరికి. వ్యక్తి చుట్టూ అల్లుకున్న సిద్ధాంతాలతోనూ, ఆవు పేడ, గో మూత్రం, కొబ్బరి నూనె, తాయత్తులు, పూజలు, ఆరాధనలు, మంత్రాలు, భజనలు ...ఇవేవీ ఈ సంక్షోభాన్ని నివారించలేవని ఆచరణలో తేలింది.
   మనం ఈ కరోనా వైరస్‌కి భయపడి వెనకడుగు వేస్తే అది మనల్ని తరుముకుంటూ మన వెంట పడుతుంది. తల్లి నుండి బిడ్డను వేరు చేస్తుంది. బిడ్డను తల్లికి దూరం చేస్తుంది. ఆలుమగలను విడదీస్తుంది. బంధాలను బంధుత్వాలను బలహీనపరుస్తుంది. కళ్ళ ముందే పేగు బంధం శవమై వెళ్ళిపోతున్నా నిస్సహాయంగా నిలబడి చూస్తుండిపో తున్నాం. కరోనా టెస్టులకు క్యూ. వ్యాక్సిన్లకు క్యూ. రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్లకు క్యూ. ఆఖరికి శ్మశానాల ముందు కూడా క్యూ. ఈ పరిస్థితి అత్యంత దారుణం. దీనిని ఎదిరించి నిలబడటమే మన ముందున్న మార్గం. ఆనాడు సుందరయ్య చేసి చూపించిన మార్గం. కూరగాయలను కావిడిపై మోసుకొచ్చి కూలీలకు చౌకగా అందించడం, పట్టణంలో సరుకులు కొని గ్రామానికి తీసుకొచ్చి చౌకగా దళిత వాడలకు అందచేయడం. ఉన్నత కులాల వారు తమ బావులలో కింది కులాల వారిని నీళ్ళు తోడనివ్వకపోతే అంటరానితనం నేరమని చెప్పి అగ్రకులాలను ఎదిరించి కింది కులాల వారికి నీళ్ళు అందించడం. ప్రజలను సమీకరించి జనం చేత బందరు కాలువ పూడిక తీయించడం. బెంగాల్‌ కరువు వచ్చినప్పుడు మన రాష్ట్రం నుండి వైద్య బృందాలను పంపి ప్రజలకు వైద్య సేవలను అందించడం దివి సీమ ఉప్పెన వచ్చినప్పడు ఆ కల్లోల పరిస్థితులలో యుద ్ధప్రాతిపదికన వాలంటీర్లను ఏర్పాటు చేసి శవాల తొల గింపుతో అంటురోగాలు ప్రబలకుండా ప్రజలను అప్ర మత్తం చేశారు. ఇలా అనేక సందర్భాలలో కష్టాలలో వున్న ప్రజలకు సేవ చేయడమే పరమావధిగా భావించిన సుందరయ్య ఆ సేవా మార్గాన్ని మనకందించారు. ఆ మార్గంలో మనమంతా పయనించి....కార్మిక, కర్షక సంఘటిత, అసంఘటిత అన్ని రంగా లలో ఉన్న వారంతా ఒక్క తాటిపై ఏకమై...ఒక ఉద్యంగా ఉరికి, ఆ కరోనాని కట్టడి చేయాలి. దానిని మట్టుపెట్టాలి.
   ఆ పని చేయాల్సిన మన పాలకులు తల వంచుకు నిలబడ్డారు. ప్రజలను రక్షించాల్సిన కేంద్ర రాష్ట్ర ప్రభు త్వాలు నిమ్మకు నీరెత్తినట్టు చేష్టలుడిగి చేతులెత్తేశాయి. ప్రగల్భాలు పలికిన వ్యక్తులు, వాగాడంబర వ్యవస్థలు ఈ సంక్షోభ సమయంలో ఏమైపోయినట్లు? అవి ఎక్కడ ఉన్నట్లు? ఆక్సిజన్‌ అందక మరణించిన వారందరిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలసి హత్య చేసినట్లుగా భావించాలి. మరణించిన వారి కుటుంబాలకు ఆర్థిక సాయం అందించాలని...ఈ కరోనా కల్లోలంలో మన దేశంలో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మిగిలిపోయిన 80 వేల మంది పిల్లల బాధ్యత ప్రభుత్వాలు తీసుకోవాలని... ముందున్న కరోనా మూడవ దశ పిల్లలపై ప్రభావం ఎక్కువన్న నిపుణుల హెచ్చరికలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుండే తగు ఏర్పాట్లతో సమర్థవంతంగా ఎదుర్కొనేలా వ్యవహరించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరదాం. మనం సైతం సేవా దృక్పథంతో ముందుకొద్దాం. తెలుగు రాష్ట్రాల ప్రజలకు ధైర్యం చెప్పి...గ్రామాలలో పట్ట ణాలలో వాలంటీర్ల బృందాలుగా ఏర్పడి... ప్రజలకు అవసరమైన సహాయ సహకారాన్ని అందిస్తూ...తగు జాగ్రత్తలు తీసుకొంటూ కరోనా ని తరిమికొడదాం. ప్రజల కోసం పని చేసి, ప్రజల కనీస అవసరాలను తీర్చమని కేంద్ర, రాష్ట్ర పాలకులను అడుగుదాం. మనమంతా ఒక్కటై ప్రజా సేవే పరమా వధిగా మనకు మార్గం చూపిన కా|| పుచ్చలపల్లి సుందరయ్య అడుగుజాడల్లో నడుద్దాం.
 

/ వ్యాసకర్త సిపి(ఐ)ఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు/