ప్రపంచ వ్యాప్తంగా లైంగిక అసమానతలను గణనీయంగా పెంచడంలో కోవిడ్-19 ప్రధానమైన పాత్రను పోషించింది. అలాంటి అసాధారణ అసమానతలు తీవ్రంగా పెరిగిన దేశాల్లో భారతదేశం ఒకటి. కరోనా మహమ్మారి, దాని కారణంగా విధించిన వరుస లాక్‌డౌన్లు సృష్టించిన ఉపాధి సంక్షోభానికి మహిళలు ముఖ్యంగా యువతులు బాధితులయ్యారు. పనిలో మహిళల భాగస్వామ్య రేటు ఊహించని రీతిలో చాలా దిగువ స్థాయికి (అంటే 10 శాతం పైగా) కుదించుకుపోయింది. లాక్‌డౌన్ కాలంలో మహిళలు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో అసమానంగా తమ ఉపాధిని కోల్పోయారు. లాక్‌డౌన్ ఎత్తివేసిన తరువాత కూడా మహిళల ఉపాధి కోలుకోక పోగా తగ్గడం కొనసాగుతున్నది. లాక్‌డౌన్ కాలంలో మార్కెట్లు మూసివేయడం వలన స్వయం ఉపాధి కార్మిక మహిళలకు తమ ఉత్పత్తులను అమ్మడం సాధ్యం కాలేదు. అంతేకాక మైక్రోఫైనాన్స్ సంస్థలు ఆ కాలంలో చెల్లించాల్సిన మొత్తాన్ని చెల్లించాలని ఒత్తిడి చేయడం వల్ల ఆ ప్రభావం మహిళలపై పడింది. లేబర్ మార్కెట్లో దళితులు, మహిళలు, ముస్లిం కార్మికులపై తీవ్రమైన ప్రభావం పడిందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అజీం ప్రేమ్‌జీ యూనివర్సిటీ వారు దేశ వ్యాప్తంగా 5 వేల మంది అసంఘటిత రంగ కార్మికులపై చేసిన అధ్యయనంలో, గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే మహిళా కార్మికులు 71 శాతం మంది తమ ఉపాధిని కోల్పోయారని తేలింది.
లాక్‌డౌన్ కాలంలో భారతీయ మహిళా రైతులకు గుర్తింపు లేకుండా పోయింది. సొంత రవాణా వున్న కొద్దిమంది మహిళా రైతులు, తమ ఉత్పత్తులను రవాణా చేయడానికి అవసరమైన అనుమతి పాసులను పొందలేక పోయారని సెల్ఫ్ ఎంప్లార్డు విమెన్స్ అసోసియేషన్ చేసిన సర్వేలో వెల్లడైంది. అంటే వారు పెద్ద మార్కెట్లో తమ ఉత్పత్తులను అమ్ముకోలేక పోయారు. అందువల్ల పురుష రైతులు లాభానికి అమ్ముకున్న విధంగా మహిళా రైతులు తమ ఉత్పత్తులను అమ్ముకోలేని పరిస్థితి ఏర్పడింది. మార్కెట్లకు వెళ్లే అవకాశాలు సన్నగిల్లడం వల్ల కొద్దిపాటి భూమి మాత్రమే ఉన్న మహిళా రైతులు తాము బతకడానికి అవసరమైన పంటల సాగుకే పరిమితమయ్యారు.
భారతదేశంలో దాదాపు చెల్లింపులు లేని పనులనే మహిళలు ఎక్కువగా చేస్తున్నారు. కరోనా మహమ్మారి మహిళలు చేసే చెల్లింపులు లేని పనిని బాగా పెంచింది. లాక్‌డౌన్ కాలంలో పురుషులు ఇంటి వద్దనే ఉండడంతో, మహిళలు చేసే ఇంటిపని భారం పెరిగింది. ఆ కాలంలో ప్రస్తుతం పిల్లలు, వృద్ధులను కనిపెట్టుకొని ఉండే బాధ్యత మహిళలది. ఆ పని కూడా లాక్‌డౌన్ కాలంలో బాగా పెరిగిపోయింది. పైగా ఆహార వస్తువుల కోసం రేషన్ షాపుల దగ్గర భౌతిక దూరాన్ని పాటిస్తూ క్యూలో నిలబడడానికి ఎక్కువ సమయాన్ని కేటాయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ పనులు చేయడంలో మహిళలకు కుటుంబ సభ్యులు ఎటువంటి సహకారం అందించలేదు.
కరోనా మహమ్మారి వ్యాప్తి కాలంలో ఆహారాన్ని పొందే అవకాశాలు బాగా సన్నగిల్లాయి. దేశంలో కరోనా మహమ్మారి విజృంభించిన దాదాపు రెండు సంవత్సరాల తరువాత ఆ కాలంలో ఆహార అభద్రతకు గురయ్యామని 'రైట్ టు ఫుడ్ క్యాంపెయిన్ అండ్ సెంటర్ ఫర్ ఈక్విటీ స్టడీస్' నిర్వహించిన సర్వేలో పాల్గొన్న పది కుటుంబాలలో ఎనిమిది కుటుంబాల వారు చెప్పారు. కరోనా మహమ్మారికి ముందు కాలంలో తీసుకున్న పౌష్టికాహారం కన్నా మహమ్మారి తరువాత తీసుకున్న పౌష్టికాహారం నాణ్యత తగ్గిందని ఐదింట రెండొంతులకు పైగా కుటుంబాలు తెలిపాయి. కుటుంబాలలోని మగవారి కంటే మహిళలల్లో ఇది ఎక్కువగా ప్రభావం చూపింది.
లాక్‌డౌన్ కారణంగా 2022 ప్రారంభం వరకు స్కూళ్లు మొత్తం మూసేసిన ఫలితంగా పిల్లల పౌష్టికాహారంపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఇది సుమారు 80 శాతం ప్రాథమిక పాఠశాల విద్యార్థులపై (సుమారు 14.4 కోట్ల మంది) ప్రభావం చూపింది.
'ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్‌మెంట్ స్కీమ్' కింద నిర్వహించబడిన అంగన్వాడీ కేంద్రాల మూసివేత ఆ కాలంలో మరో విపత్తు. ఈ పథకం గర్భిణులకు, పాలిచ్చే తల్లులకు, చిన్న పిల్లలకు ఆహారాన్ని సమకూర్చుతుంది. కానీ అధికారంలో ఉన్న వారు ఇది అవసరమైన చర్యగా భావించలేదు. ఈ కేంద్రాల మూసివేత తల్లీపిల్లలపై దీర్ఘకాలికమైన ప్రభావాన్ని చూపింది. సుమారు 100 మిలియన్ల మంది పాలిచ్చే తల్లులు, గర్భిణులు ఈ పథకంపై ఆధారపడ్డారని నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే అంచనా వేసింది. గతంలో అంగన్వాడీ కేంద్రాల నుండి తమ పిల్లల కోసం పౌష్టికాహారాన్ని తీసుకుని వచ్చేవారు. కానీ లాక్‌డౌన్ కాలంలో, ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండానే ఆ కేంద్రాలను మూసివేయడంతో పౌష్టికాహార లోపాలతో అనేక మంది పిల్లలు చనిపోయారు.
ప్రభుత్వ విధానాల్లో, పాలనలో లింగ వివక్ష, నిర్లక్ష్యాల ఫలితంగా మహిళలు ఘోరమైన పరిస్థితులను ఎదుర్కొన్నారు. గర్భం దాల్చిన సమయంలో, బిడ్డకు జన్మనిచ్చే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడానికి అనేక ఇబ్బందులు పడ్డారు. రోజువారీ ఆరోగ్య సేవలు, అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ క్రమంగా లేకపోయిన కారణంగా ఆదాయాలు, ఉపాధిని కోల్పోయిన పేద మహిళలు అనేక కష్టనష్టాలను భరించాల్సి వచ్చింది. లాక్‌డౌన్ ఎత్తివేసిన తరువాత ప్రసవాలకు సంబంధించిన ఆరోగ్య సేవల మార్గదర్శకాలు జారీ చేయడానికి కేంద్ర ప్రభుత్వానికి నెల రోజుల సమయం పట్టింది. ఆ మార్గదర్శకాలు కూడా ఆసుపత్రుల్లో అధికారులను గందరగోళపరిచే విధంగా ఉండడంతో వైద్యం కోసం వచ్చిన మహిళలు తిరిగి వెళ్ళిపోయారు. చివరకు మార్గదర్శకాలు జారీ చేసిన తరువాత, ఆసుపత్రికి వెళ్లాలనుకునే గర్భిణులకు కోవిడ్ పరీక్ష చేయించి, దానిలో వారికి వ్యాధి సోకలేదనే ధ్రువీకరణ పత్రం ఇవ్వాలి. ఆ పరీక్ష చేయించడానికి కనీసం ఒక రోజు సమయం పడుతుంది, పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళలకు అది సాధ్యపడలేదు. ఆ కారణంతో అనేకమంది మహిళలను ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలకు అనుమతించలేదు. లాక్‌డౌన్ విధించిన మూడు నెలల కాలంలో అరవై లక్షల మంది గర్భిణులలో 15 శాతం మందికి ఆరోగ్య సేవలు అందకుండా పోవడం లేదా ఆసుపత్రుల్లో ప్రవేశం పొందడంలో ఇబ్బందులను ఎదుర్కొనడం జరిగిందని అంచనా వేశారు.
జాతీయ లాక్‌డౌన్ నిబంధనల నుంచి మినహాయిస్తూ నిత్యావసర సరుకుల జాబితాను మార్చి 2020 చివర్లో విడుదల చేశారు. ఆ జాబితాలో శానిటరీ ప్యాడ్లు, అంటువ్యాధులను నివారించే పరిశుభ్రమైన ఇతర వస్తువులు పేర్లు లేవు. వీటి సరఫరా నిలిచి పోవడంతో మహిళల్లో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. కర్ణాటక, తెలంగాణ లాంటి రాష్ట్రాలు ఆ వస్తువులను నిత్యావసర సరుకుల జాబితాలో చేర్చారు. స్పష్టమైన మార్గదర్శకాలు కేంద్ర ప్రభుత్వం నుండి లేకపోవడం వల్ల ఆ వస్తువుల ఉత్పత్తి, సరఫరాపై తీవ్రమైన ప్రభావం పడింది. పాఠశాలలు మూతపడడంతో శానిటరీ ప్యాడ్ల పంపిణీ నిలిచిపోవడంతో, పేద కుటుంబాలకు చెందిన బాలికలు ఎక్కువ ధరను వెచ్చించి వాటిని కొనలేని పరిస్థితి ఏర్పడింది. ఇదే కాలంలో కుటుంబ నియంత్రణ సేవలు నిలిచిపోవడంతో సుమారు 30 లక్షల మంది మహిళలు అవాంఛిత గర్భం దాల్చారని, సుమారు ఇరవై లక్షల గర్భస్రావాలు జరిగాయని, కొన్ని వేలమంది తల్లులు చనిపోయారని ఒక అధ్యయనంలో అంచనా వేశారు.
గృహహింస పెరుగుదల
లాక్‌డౌన్ కాలంలో, ఆ తర్వాత కూడా దేశంలో గృహహింస బాగా పెరిగింది. లాక్‌డౌన్ విధించిన మొదటి మూడు వారాల్లో, తమ భర్తలు వేధిస్తున్నారని మహిళల నుండి అంతకుముందు కాలంలో వచ్చిన ఫోన్ కాల్స్ కన్నా రెట్టింపు కాల్స్ 'నేషనల్ కమిషన్ ఫర్ విమెన్' కు వచ్చాయి. జీవనోపాధిని కోల్పోయిన కుటుంబాల్లోని మగవారు కోపంతో, నిరుత్సాహంతో ఇంటికి పరిమితమై మద్యానికి అలవాటుపడి మహిళలపై హింసకు పాల్పడ్డారు. లాక్‌డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేసిన జిల్లాలలో సైబర్ నేరాలు, గృహహింస కేసులు పెరిగాయని ఒక అధ్యయన గణాంకాలు తెలిపాయి. అదే కాలంలో లైంగిక దాడులు, రేప్ కేసులకు సంబంధించిన ఫిర్యాదులు (ప్రజా రవాణా వ్యవస్థలో, పని ప్రాంతాల్లో లాక్‌డౌన్ నిబంధనల వల్ల) బాగా తగ్గిపోయాయి.
2020 నవంబర్ చివరి నాటికి గృహహింస కేసులు, అంతకు ముందు 12 నెలల కాలంలో నమోదైన కేసుల సంఖ్య కన్నా 60 శాతం ఎక్కువగా నమోదయ్యాయి. భర్త, కుటుంబ సభ్యులు పాల్పడిన హింస గురించి సమాచారం ఇవ్వకుండా ఉండడం సగటు భారతీయ మహిళలకు ఉండే సహజ లక్షణం. 3/4 వంతుల మందికి పైగా మహిళలు, తాము అనుభవించిన భౌతిక, లైంగిక హింసను ఎవ్వరితోనూ చెప్పుకోరని 2015-16 లో జరిగిన నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే-4 తెలిపింది. వివిధ కారణాల వల్ల ఎక్కువ మంది మహిళలు అధికారులను లేదా ఎన్జీవోలను, లేదా బయటి వారిని పిలవడానికి సాహసించరు. సహాయం కోసం చేసే విజ్ఞప్తుల వలన ఎటువంటి రక్షణ చర్యలు తీసుకోలేదు. మామూలుగా మహిళలు, ఆగ్రహంతో ఉన్న భర్తలతోనే (పోలీసు వారి కౌన్సిలింగ్‌తో) ఇంటి వద్దనే ఉండాల్సి వచ్చింది. ''సాధారణంగా మేము మొదటి, రెండవ ఫిర్యాదులతో గృహహింస కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని అదుపులోకి తీసుకోం. ప్రాథమికంగా కౌన్సిలింగ్ ఇస్తాం. వాస్తవానికి బాధితురాలితో పాటు నేరారోపణ చేయబడిన వ్యక్తికి కలిపి రెండు మూడు సార్లు కౌన్సిలింగ్ నిర్వహిస్తాం. పరిస్థితిలో ఏ విధమైన మార్పు కనిపించనప్పుడు మాత్రమే ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తాం'' అని ఉత్తరప్రదేశ్‌లోని మహౌబా, ఎస్పీ చేసిన ప్రకటన అధికారుల ధోరణిని తెలియజేస్తుంది.
జీవనోపాధిని నాశనం చేసి, ఆర్థిక అభద్రతను పెంచిన లాక్‌డౌన్ ప్రతికూల ఫలితాలను ఇచ్చింది. దేశ వ్యాప్తంగా బాల్య వివాహాల సంఖ్య బాగా పెరిగిందని నివేదికలు చెప్తున్నాయి. మొత్తంగా చూస్తే కోవిడ్ మహమ్మారి, సాధారణ మహిళలు అమ్మాయిల పరిస్థితులను మరింత అధ్వానంగా మారిస్తే, పాలక వర్గాల పితృస్వామిక ధోరణులు, అధికారగణం యొక్క నిర్లక్ష్య వైఖరి వారి జీవితాలను మరింత దుర్భరం చేశాయి.
జయతి ఘోష్ ('న్యూస్ క్లిక్' సౌజన్యంతో)










