May 12,2021 07:40

   కనీసం ముందు నుంచీ ప్లాను చేసి ఆక్సిజన్‌ కొరతనైనా నివారించి వుండొచ్చు. కాని మరీ అన్యాయంగా టాస్క్‌ఫోర్స్‌ ఈ పని కూడా చేయడంలో విఫలమైంది. కీలక సమయంలో ఒక కర్తవ్యం మీద కేంద్రీకరించి పని జరిగేటట్టు చూడడానికి టాస్క్‌ఫోర్స్‌ ను ఏర్పాటు చేస్తారు. కాని మోడీ హయాంలో ఆ పదం అర్ధమే మారిపోయింది. ఒక టాస్క్‌ (పని) జరగకుండా చూడడానికి ఏర్పాటు చేసిన ఫోర్స్‌ గా ఈ జాతీయ టాస్క్‌ఫోర్స్‌ ఆన్‌ కోవిడ్‌-19 పేరు తెచ్చుకుంది !
   కోవిడ్‌-19 ముంచుకొస్తున్నప్పుడు మార్చి 2020లో కేంద్ర ప్రభుత్వం ఒక జాతీయ టాస్క్‌ఫోర్స్‌ ను ఏర్పాటు చేసింది. ఇందులో 21 మందిని సభ్యులు గా నియమించింది. బలరాం భార్గవ (డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హెల్త్‌ రిసెర్చ్‌ కార్యదర్శి), వినోద్‌ పాల్‌ (నీతి ఆయోగ్‌ ఆరోగ్యం విభాగం), రాజేష్‌ భూషణ్‌ (కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి) - ఈ ముగ్గురి పేర్లు మాత్రమే బైటపెట్టారు. తక్కిన 18 మంది ఎవరో తెలియకుండా గోప్యంగా ఉంచారు. పారదర్శకంగా సమాచారం అందుబాటులో ఉంచడం మోడీ ప్రభుత్వానికి అలవాటు లేని పని కదా.
   కేంద్ర ప్రభుత్వం హఠాత్తుగా లాక్‌డౌన్‌ ప్రకటించింది. ఆ విషయంలో టాస్క్‌ఫోర్స్‌ ను సంప్రదించలేదు. అప్పటికి దేశం మొత్తం మీద కేసులు సుమారు 500 మాత్రమే ఉన్నాయి. కేసులు వస్తున్న ప్రాంతాలను గుర్తించి ఎక్కువగా కేసులు ఉన్న ప్రాంతాలకు లాక్‌డౌన్‌ ను పరిమితం చేసి వుండాల్సింది. కాని తమకు వేరే అభిప్రాయాలున్నా, టాస్క్‌ఫోర్స్‌ సభ్యులు మారు మాట్లాడకుండా లాక్‌డౌన్‌ ను బలపరిచారు.
   మే 2020లో సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ డిపార్టుమెంట్‌ కోవిడ్‌ ఏవిధంగా విస్తరించబోతున్నదో అంచనా కట్టే గణిత శాస్త్ర నమూనాను రూపొందించడానికి ఒక జాతీయ సూపర్‌ మోడల్‌ కమిటీ ని నియమించింది. ప్రభుత్వం ఏయే చర్యలు తీసుకుందో అవన్నీ సరైనవే అని, సకాలంలో తీసుకున్నవని సమర్ధించడానికే ఈ సూపర్‌ మోడల్‌ కమిటీ పని చేసింది. ఆ కమిటీ నివేదికను అక్టోబర్‌ 2020లో ఇండియన్‌ జర్నల్‌ ఆఫ్‌ మెడికల్‌ రిసెర్చి లో ప్రచురించారు. లాక్‌డౌన్‌ ను గనుక అప్పుడు ప్రకటించకపోయినట్టైతే భారత దేశంలో 26 లక్షల మరణాలు సంభవించి వుండేవని ఆ నివేదిక పేర్కొంది. ఫిబ్రవరి 2021 నాటికి కరోనా అంతం అవనుందని ఆ నివేదిక చెప్పింది. ఇటువంటి అవాస్తవిక అంచనాలనే అమెరికా కు చెందిన బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌ కూడా చెప్పింది. ఈ నివేదికలనే మోడీ ప్రభుత్వం పదే పదే ఉటంకిస్తూ తన నిష్క్రియాపరత్వాన్ని సమర్ధించుకుంటూ వచ్చింది.
   ఈ ఏడాది జనవరిలో కేంద్రం కోవ్యాక్సిన్‌ వాడకానికి అత్యవసరంగా అనుమతులిచ్చింది. అప్పటికి ఆ వ్యాక్సిన్‌ ఇంకా క్లినికల్‌ ప్రయోగాల దశ లోనే ఉంది. మూడవ దశ ప్రయోగాల ఫలితాలు అప్పటికి ఇంకా రాలేదు. అయినా అనుమతులిచ్చారు. ఈ విధంగా అనుమతివ్వడం వైద్య పరంగా అనైతికం. అయినా టాస్క్‌ ఫోర్స్‌ నోరెత్తలేదు. వ్యాక్సినేషన్‌ ప్రారంభించాక ఎక్కడైనా ప్రతికూల ఫలితాలు గనుక వస్తే వాటి సమాచారాన్ని అందరికీ అందుబాటులో ఉంచాలి. అటువంటి సలహాను టాస్క్‌ ఫోర్స్‌ ఇవ్వలేదు.
   రెండోసారి కరోనా ఉధృతంగా వ్యాపించింది. టాస్క్‌ ఫోర్స్‌కు ప్రపంచంలో ఇతర దేశాలలో కరోనా రెండో దశ మొదలైన సమాచారం తెలుసు. మొదటి దశ కన్నా రెండో దశ లో పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయనీ తెలుసు. మన దేశంలో సీరో పాజిటివిటీ (కరోనాను ఎదుర్కునే యాంటీ బాడీస్‌ శరీరంలో ఏర్పడడం) 21.7 శాతం మాత్రమేనని, రెండో దశ గనుక మొదలైతే తక్కిన 78.3 శాతం ప్రజలంతా ప్రమాదంలో పడతారని కూడా టాస్క్‌ ఫోర్స్‌ కి తెలుసు. బ్రిటన్‌ లో వచ్చిన రెండో దశ కరోనా వైరస్‌ తరహా వైరస్‌ అప్పటికే మన దేశంలోనూ బైట పడిన వైనమూ తెలుసు. అన్నీ తెలిసి కూడా టాస్క్‌ ఫోర్స్‌ ఏం చేసింది? ఏ సలహాలు, సూచనలు ఇచ్చింది? ఏమీ లేదు.
   జనవరి 8వ తేదీన ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి హరిద్వార్‌ వద్ద మహా కుంభమేళాను నిర్వహిస్తామని ప్రకటించారు. నిజానికి 2022లో జరగవలసిన ఆ కుంభమేళాను రాజకీయ లబ్ధి పొందడం కోసం ముందుకి జరిపారు (2022లో యు.పి ఎన్నికలు ఉన్నాయి). ఒక పక్క రెండో దశ కరోనాకు సంబంధించిన హెచ్చరికలు డబ్ల్యు.హెచ్‌.ఓ నుండి నిరంతరం వస్తున్నా, కుంభమేళా వలన కరోనా శరవేగంగా విస్తరించే పెనుప్రమాదం ఉందని తెలిసినా, తమ రాజకీయ ప్రయోజనాలకే బిజెపి ప్రాధాన్యతనిచ్చింది. కాని శాస్త్రవేత్తలతో, వైద్యులతో కూడిన టాస్క్‌ఫోర్స్‌ కి ఏమైంది? జనవరి 11న టాస్క్‌ఫోర్స్‌ సమావేశం జరిగింది. అప్పటికే కుంభమేళా ప్రకటన వచ్చింది. కాని దాని గురించి టాస్క్‌ఫోర్స్‌ ఎటువంటి హెచ్చరికనూ చేయలేదు. ఆపే ప్రయత్నం కూడా చేయలేదు.
   జనవరి 16న దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ మొదలైంది. దేశంలో అందరికీ వ్యాక్సిన్‌ అందాలంటే రెండు సంవత్సరాలైనా పడుతుంది. అది కూడా వ్యాక్సిన్‌ ఉత్పత్తి అనుకున్నట్టు జరిగితేనే. కాని జనవరి 22నే బిజెపి కోవిడ్‌-19 పై విజయం సాధించినందుకు ప్రధాని మోడీని అభినందిస్తూ తీర్మానం చేసేసింది. ఆత్మనిర్భర భారత్‌ కు ఇదొక దృష్టాంతం అని శ్లాఘించింది. ఇక ఆ తర్వాత ప్రతీ రాష్ట్రంలోనూ బిజెపి నేతలు అదే పాటనందుకున్నారు. ఫిబ్రవరి నెల నడిమికి వచ్చేసరికి దేశంలో కరోనా వేగం మళ్ళీ పుంజుకుంది. అది చూసైనా ఆగారా అంటే లేదు. ఫిబ్రవరి 16న ''యావత్‌ ప్రపంచానికీ భారతదేశం కోవిడ్‌ ను ఓడించిన తీరు స్ఫూర్తినిస్తోంది'' అని మోడీ స్వయంగా ప్రకటించారు. ఇంత హడావుడి జరుగుతున్నా టాస్క్‌ఫోర్స్‌ ఏ మాత్రమూ నోరు మెదపలేదు. ప్రభుత్వాన్ని వారించే ప్రయత్నమూ చేయలేదు.
   ఫిబ్రవరి 26న ఎన్నికల కమిషన్‌ అయిదు రాష్ట్రాలకు మార్చి-ఏప్రిల్‌ నెలల్లో ఎన్నికలు జరుపుతామని షెడ్యూల్‌ ప్రకటించింది. ఒకసారి ఎన్నికల ప్రక్రియ మొదలైతే ఇక కోవిడ్‌-19 నివారణ జాగ్రత్తలన్నీ గాలికెగిరిపోతాయని అందరికీ తెలుసు. కాని టాస్క్‌ఫోర్స్‌ మాత్రం కిమ్మనకుండా కూచుంది.
   మార్చి7 కల్లా రోజువారీ కేసుల సంఖ్య 18,600 అయింది. ఫిబ్రవరి 9 నాటి కేసులతో పోల్చితే రెట్టింపు అయ్యాయి. కాని కేంద్ర ఆరోగ్య శాఖామాత్యులు హర్షవర్ధన్‌ ''కోవిడ్‌ ను అంతం చేసే కృషిలో చివరి ఘట్టంలో ప్రవేశించాం. రాజకీయాలకు అతీతంగా అందరూ వ్యవహరించి వ్యాక్సినేషన్‌ కార్యక్రమం జయప్రదం చేయండి'' అని ప్రకటించారు. పొంచివున్న రెండో దశ ప్రమాదం గురించి కాని, వ్యాక్సిన్‌ ల తీవ్ర కొరత గురించి కాని ఆ మంత్రి గారికి తెలిసే ఆ ప్రకటన ఇచ్చారా? అతనికి టాస్క్‌ఫోర్స్‌ వాస్తవ పరిస్థితి వివరించే ప్రయత్నం ఏమైనా చేసిందా?
   కుంభమేళా ఒక పక్క, ఎన్నికల సభలు, ప్రచార కార్యక్రమాలు ఇంకొక పక్క యథేచ్ఛగా, కరోనా ప్రమాదం అన్నదే లేనట్టుగా సాగిపోయాయి. ఏప్రిల్‌ 17న అసన్‌సోల్‌ లో జరిగిన మోడీ ఎన్నికల సభకు 2,50,000 మంది వచ్చారు. అప్పటికే దేశంలో కరోనా రెండో దశ బాగా విస్తరించింది. డిల్లీ, మహారాష్ట్ర వంటి చోట్ల తీవ్రత కొట్టవచ్చినట్టు తెలుస్తోంది. ప్రధాని అటువంటి సమయంలో ఆ ఎన్నికల సభకు వచ్చిన జనాలను చూసి ఆనందం పట్టలేక ''ఇంత పెద్ద సభను నేనింతవరకూ చూసి ఎరగను'' అని ప్రకటించారు. అంతేకాని కరోనా ప్రమాదం గురించి కనీసం హెచ్చరించలేదు. ఎంత బాధ్యతా రాహిత్యం !
   జనవరి 11 తర్వాత ఫిబ్రవరి, మార్చి నెలల్లో టాస్క్‌ఫోర్స్‌ అసలు సమావేశమే జరపలేదు! కేసులు లక్షల్లో పెరుగుతున్నప్పుడు, హడావుడిగా ఏప్రిల్‌ 15న, ఏప్రిల్‌ 21న సమావేశాలు జరిపారు.
   ''ఫిబ్రవరి నాటికే ప్రమాదం ముంచుకొస్తోందని స్పష్టంగానే కనిపించింది. ఆ విషయమే చర్చిద్దామనుకుంటే అసలు టాస్క్‌ ఫోర్స్‌ సమావేశమే జరగలేదు'' అని కారవాన్‌ పత్రికతో ఒక టాస్క్‌ఫోర్స్‌ సభ్యుడు అన్నాడు. ''ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకుంటే దానిమీద రబ్బరు స్టాంపు మాదిరిగా ఆమోదం తెలపడానికి మాత్రమే టాస్క్‌ ఫోర్స్‌ సమావేశాలు జరుగుతాయి'' అని కూడా ఆ సభ్యుడు అన్నాడు.
   కరోనా వైరస్‌ సోకిన కేసులలో కనీసం 5 శాతం నమూనాలను హోల్‌ జెనోమ్‌ సీక్వెన్సింగ్‌ (సంపూర్ణ జన్యు పరంపర అధ్యయనం) జరపాలని, దేశంలోని 10 జాతీయ పరిశోధనశాలలకూ లక్ష్యాన్ని నిర్దేశించారు. వైరస్‌ పరివర్తన చెందుతున్న క్రమాన్ని, కొత్త రకాల వైరస్‌ ల కొత్త లక్షణాలని ఎప్పటికప్పుడు తెలుసుకోడానికి, దాని ఆధారంగా తగు చర్యలు తీసుకోడానికి ఈ అధ్యయనం చాలా ముఖ్యం. కాని ఏప్రిల్‌ 30 నాటికి దేశంలో సుమారు 1,88,00,000 కరోనా కేసులు నిర్ధారణ కాగా కేవలం 19,000 -20,000 మధ్య నమూనాల అధ్యయనం మాత్రమే జరిగింది. జరగవలసినది 9,50,000 నమూనాల అధ్యయనం! జరిగిన నామమాత్రపు అధ్యయనాన్ని సైతం తక్కిన శాస్త్రవేత్తలతో ఎవరితోనూ పంచుకోడానికి నిరాకరిస్తున్నారు. ఇది ఎంత బాధ్యతా రాహిత్యం! ఎంత హానికరం! దీని పర్యవసానాలు చాలా ప్రమాదకరంగా ఉంటాయని హెచ్చరిస్తూ ఏప్రిల్‌ 29న 450 మందికి పైగా శాస్త్రవేత్తలు ప్రధాని మోడీ కి ఒక లేఖ రాశారు. దానికి ఎటువంటి స్పందనా లేకపోగా అధ్యయనం చేయడానికి ఒక్కో రాష్ట్రానికి నెలకు 300 నమూనాలను మాత్రమే పంపాలని సూచిస్తూ తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సర్క్యులర్‌ పంపింది. అంటే అధ్యయనం చేయవలసిన నమూనాల సంఖ్యను దారుణంగా కుదించివేసింది.
ఇంత జరుగుతున్నా టాస్క్‌ఫోర్స్‌ పూర్తిగా చేతులు ముడుచుకునే మౌనంగా ఊరుకుంది!
   ఏయే ఔషధాలను ఎలా ఉపయోగించాలన్న విధివిధానాలను (క్లినికల్‌ మేనేజిమెంట్‌ ప్రోటోకాల్‌) ఎప్పటికప్పుడు తాజా సమాచారం ప్రకారం మార్చుతూ పోవాలి. అంతర్జాతీయంగా ఇందుకు సంబంధించి డబ్ల్యు.హెచ్‌.ఓ ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిస్తూ వుంటుంది. దాని ఆధారంగా రాష్ట్రాలకు ఆదేశాలు పంపాలి. జూలై 2020లో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ క్లినికల్‌ మేనేజిమెంట్‌ ప్రోటోకాల్‌ ను పంపింది. అక్టోబర్‌ 2020లో డబ్ల్యు.హెచ్‌.ఓ పంపిన వివరాల ప్రకారం రెమ్‌డెసివిర్‌, హైడ్రాక్సీ క్లోరోక్విన్‌, లొపినావిర్‌, ఇంటర్‌ఫెరాన్‌ వంటి ఔషధాలను వాడినందు వలన ఎటువంటి ప్రభావమూ కలగలేదని, అవి కరోనా నుండి రక్షించడంలో నిరుపయోగం అని తేలింది. కాని, ఆ సమాచారాన్ని మన కేంద్రం ఆరు నెలల పాటు తొక్కిపెట్టింది. చివరకు ఏప్రిల్‌ 22న కొత్త ప్రోటోకాల్‌ పంపింది. సకాలంలో గనుక పంపి వుంటే ఆ మందుల స్మగ్లింగ్‌, బ్లాక్‌ మార్కెటింగ్‌, ప్రైవేట్‌ ఆస్పత్రుల విచ్చలవిడి దోపిడీ - అన్నింటినీ నివారించి వుండేవారు కాదా? రెమ్‌డెసివిర్‌ కోసం ఎంత వేలం వెర్రిగా జనాలు కొట్టుకులాడారో చూస్తున్నాం కదా. చాలా ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే, ఆక్సిజన్‌ అందిస్తూ రెమ్‌డెసివిర్‌ వాడాలని ఇప్పుడు తాపీగా ఆరోగ్య మంత్రిత్వ శాఖ సర్క్యులర్‌ ఇచ్చింది.
ఇంత జరుగుతూ వుంటే ఈ టాస్క్‌ఫోర్స్‌ ఏం చేస్తున్నట్టు?
కనీసం ముందు నుంచీ ప్లాను చేసి ఆక్సిజన్‌ కొరతనైనా నివారించి వుండొచ్చు. కాని మరీ అన్యాయంగా టాస్క్‌ఫోర్స్‌ ఈ పని కూడా చేయడంలో విఫలమైంది.
కీలక సమయంలో ఒక కర్తవ్యం మీద కేంద్రీకరించి పని జరిగేటట్టు చూడడానికి టాస్క్‌ఫోర్స్‌ ను ఏర్పాటు చేస్తారు. కాని మోడీ హయాంలో ఆ పదం అర్ధమే మారిపోయింది. ఒక టాస్క్‌ (పని) జరగకుండా చూడడానికి ఏర్పాటు చేసిన ఫోర్స్‌ గా ఈ 'నేషనల్‌ టాస్క్‌ఫోర్స్‌ ఆన్‌ కోవిడ్‌-19' పేరు తెచ్చుకుంది!