Jul 24,2021 21:32

బ్రసీలియా : భారత్‌ బయోటెక్‌ రూపొందించిన కోవిడ్‌ వ్యాక్సిన్‌ కోవాగ్జిన్‌ క్లినికల్‌ అధ్యయనాలను బ్రెజిల్‌ నిలిపివేసింది. అక్కడ కంపెనీ భాగస్వామ్యంతో కుదిరిన ఒప్పందం కాలపరిమితి తీరడంతో ఈ చర్య తీసుకున్నట్లు బ్రెజిల్‌ ఆరోగ్య శాఖ తెలిపింది. కోవాగ్జిన్‌కు బ్రెజిల్‌ మార్కెట్‌ కోసం ప్రిసైసా మెడికేమెంటోస్‌ అండ్‌ ఎన్‌విక్సియా ఫార్మాస్యూటికల్స్‌తో కుదిరిన అవగాహనా ఒప్పందం రద్దు చేసినట్లు శుక్రవారం భారత్‌ బయోటెక్‌ ప్రకటించింది. రెండు కోట్ల డోసుల సరఫరా కోసం బ్రెజిల్‌ ప్రభుత్వంతో ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందంపై వివాదం చెలరేగడంతో ఆ దేశంలో అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఒప్పందం రద్దు ప్రకటన వెలువడింది. బ్రెజిల్‌ భారత్‌ బయోటెక్‌కు ప్రిసైసా మెడికేమెంటోస్‌ భాగస్వామి. మూడో దశ క్లినికల్‌ ట్రయల్‌లో సహకారం, మార్గదర్శకత్వం, లైసెన్స్‌, పంపిణీ, బీమా తదితరాలను అందజేసేందుకు ఒప్పందం కుదిరింది. అవినీతి ఆరోపణలు తలెత్తడంతో బ్రెజిల్‌ ప్రభుత్వం కోవాగ్జిన్‌ ఆర్డర్లను తాత్కాలికంగా నిలుపుచేసింది.