
ప్రజాశక్తి-గొలుగొండ:మండలంలోని పలు గ్రామాల్లో కోతులు స్వైర విహారం చేయడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దిగుబడికి వచ్చిన మామిడి కాయలను పూర్తిగా నాశనం చేస్తుండటంతో రైతులు లబోదిబోమంటున్నారు. కోతులు గుంపులుగా రావడంతోతో రోడ్డుపై వెళుతున్న ద్విచక్ర వాహనదారులు, పాదాచారులు బెంబేలెత్తి పోతున్నారు. గత కొంత కాలంగా నాగపురం కృష్ణదేవి పేట, ఏఎల్ పురం, పాత మల్లంపేట, కొత్త ఎల్లవరం గ్రామాల్లో కోతుల బెడవ ఎక్కువగా ఉండటంతో పంటలతో పాటు ఇళ్ల మీదకు వచ్చి స్థానికులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేదని రైతులు తెలిపారు. నాగాపురం, కృష్ణదేవిపేట గ్రామాల్లో విద్యార్థులు, రైతులపై కోతులు దాడులు చేసిన సంఘటనలు వున్నాయి. నాగాపురంలో గ్రామానికి సమీపంలో ఉన్న వంతెన వద్ద కోతుల కారణంగా ప్రజలు ఒంటరిగా ప్రయాణం చేయడానికి భయపడుతున్నారు. ఏఎల్ పురం, కొత్త యల్లవరం గ్రామాల్లో నివాస గృహాల్లోకి చొరబడి చేతికిందని వస్తువులను కోతులు పట్టుకు పోతున్నాయి. దీంతో, ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నారు. ప్రస్తుతం మామిడి తోటలలో ఉన్న మామిడి కాయలను, కొన్నిచోట్ల కూరగాయల పంటలను కోతులు పూర్తిగా నాశనం చేస్తున్నాయని రైతులు గగ్గోలు పెడుతున్నారు. ప్రతిరోజూ మామిడి కాయలను పూర్తిగా తిని వేయడంతో రైతులు ఏమి చేయాలో అర్దంకాని పరిస్థితిలో ఉన్నారు. ఈ క్రమంలో రైతులు నల్లటి ఆకారాలు కలిగిన దిష్టిబొమ్మలను వ్యవసాయ భూముల్లో ఏర్పాటు చేస్తున్నారు. అటవీ అధికారులు స్పందించి కోతుల బెడద ఉన్న గ్రామాల్లో పంజరాలు ఏర్పాటు చేసి వాటి బారి నుంచి కాపాడాలని పలువురు కోరుతున్నారు.