ప్రజాశక్తి -బుచ్చయ్యపేట
పంట పొలాలలో, గ్రామాలలో స్వైర విహారం చేస్తూ రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న కోతులను పూర్తిస్థాయిలో పట్టకపోవడంపై మండల పరిషత్తు సర్వసభ్య సమావేశంలో నిలదీశారు. మంగళవారం మండల పరిషత్తు సమావేశ మందిరంలో ఎంపిపి దాకారపు నాగేశ్వరి దేవి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో బంగారు మెట్టు పిఎసిఎస్ అధ్యక్షులు సాయం రమేష్ మాట్లాడుతూ బాధిత గ్రామపంచాయతీల నుండి రూ.8 లక్షలు చొప్పున, ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి రూ.20 లక్షలతో కోతుల గుంపులను పట్టి తరలించడానికి నిర్ణయిం చేసి, అరకొరగా కోతులను పట్టి చేతులు దులుపుకోవడంపై నిలదీశారు. పంచాయతీల నుండి రూ.8 లక్షలు వసూలు చేయాలని నిర్ణయించి, కొన్నింటిలో కేవలం రూ.3 లక్షలు మాత్రమే వసూలు చేశారని తెలిపారు. రూ.8 లక్షల వరకు కోతులు పట్టిన వారికి డబ్బులు చెల్లించకుండా నిబంధనల పేరుతో ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి చెల్లిస్తామని చెప్పారని, కాని ప్రభుత్వం నుంచి ఆ నిధులు చెల్లించలేదని తెలిపారు. పూర్తి స్థాయిలో కోతులు గుంపులను పట్టకపోవడంతో అవి రైతులకు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయని పేర్కొన్నారు.
20 రోజులకు పైగా నేతవానిపాలెంలో రోడ్డు విస్తరణలో పైపులు పగిలిపోవడంతో తాగునీటికి ప్రజల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బుచ్చయ్యపేట పిఎసిఎస్ అధ్యక్షులు సుంకర శ్రీను సభ దృష్టికి తీసుకొచ్చారు. మల్లంలో సబ్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని సర్పంచ్ బర్ల శివ కోరారు. పెదపూడిలో ఉపాధి హామీ విఆర్‌పి లేకపోవడంతో ఆ గ్రామంలో ఉపాధి పనులు జరగటం లేదని సర్పంచ్ గోకివాడ వర కృష్ణ తెలిపారు. వడ్డాది గిరిజాంబ గిరిపై ఆక్రమణలు తొలగించాలని జెడ్పిటిసి దొండ రాంబాబు డిమాండ్ చేశారు. మండలంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై ప్రజాప్రతినిధులకు కనీస సమాచారం అధికారులు ఇవ్వటం లేదని పలువురు సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సువర్ణ రాజు, తహశీల్దార్ ఎస్‌వి అంబేద్కర్, కొల్లిమల్ల అచ్చం నాయుడు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.










