Nov 16,2022 23:54

మాట్లాడుతున్న ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ

ప్రజాశక్తి-వడ్డాది : పంటలను కోతులు పూర్తిగా నాశనం చేస్తుండడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, అటవీశాఖ అధికారులు, కలెక్టర్‌తో మాట్లాడి వాటి నివారణకు అన్ని విధాల చర్యలు తీసుకుంటామని స్థానిక ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ అన్నారు. బుచ్చయ్యపేట మండలం బంగారుమెట్టలో బుధవారం ఆయన రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోతుల వల్ల సుమారు 14 గ్రామాల్లో రైతులు పూర్తిగా వ్యవసాయ వదిలేశారన్నారు. గతేడాది 2000 వరకు ఉన్న కోతులు, ఈ ఏడాది సుమారు 8000కి పైగా ఉన్నాయని తెలిపారు. వాటి సంతానం చాలా ఎక్కువగా పెరిగిందని, ఇలా అయితే రైతులు ఎప్పటికీ వ్యవసాయం చేయలేరని పేర్కొన్నారు. కోతుల నివారణకు సుమారు రూ.50 లక్షల ఖర్చు అవుతుందని అంచనా వేశారని, ఎంపీ నిధులు, ఎమ్మెల్యే నిధులు, అటవీశాఖ నిధులు జోడించి విశాఖ డెయిరీ సహకారంతో వాటిని దూరప్రాంత అడవుల్లో వదిలిపెట్టే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ సమావేశంలో డిపిఓ ఉషారాణి రేంజర్‌ రాజు, జెడ్పిటిసి దొండా రాంబాబు, ఎంపీపీ దాకావరపు నాగేశ్వరి దేవి, వైస్‌ ఎంపీపీ దొండా లలిత నారాయణమూర్తి ఎండిఓ సువర్ణ రాజు, తహశీల్దారు అంబేద్కర్‌, రైతు సంఘం నాయకులు తమరాన వెంకటరమణ, కో-ఆపరేటివ్‌ అధ్యక్షులు సాయం రమేష్‌, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.