Nov 24,2022 23:50

మాట్లాడుతున్న డిఇఇ వేణుగోపాలరావు

ప్రజాశక్తి - కొత్తకోట:భవిష్యత్తు తరాలకు రహదారి విస్తరణ దోహద పడుతుందని, ఇందుకు స్థానిక నివాసదారులు సహకరించాలని నర్సీపట్నం ఆర్‌అండ్‌ బి డివిజన్‌ డిఈఈ వేణుగోపాలరావు సూచించారు. రావికమతం మండలం కొత్తకోట పంచాయతీ కార్యాలయంలో మండల తహసిల్దార్‌ మహేశ్వరరావు తో కలిసి కొత్తకోట గ్రామంలో రహదారి విస్తరణ పై గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఈఈ వేణుగోపాలరావు మాట్లాడుతూ, నర్సీపట్నం ఆర్‌అండ్‌బి పరిధి కొత్తకోటలో సుమారు 100 అడుగుల మేర రహదారి విస్తరణకు న్యూ డెవలప్‌ మెంట్‌ బ్యాంకు ద్వారా ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తోందన్నారు. ప్రస్తుతం ఉన్న రహదారితో పాటు మరి కొంత మేర సర్వే చేసి విస్తరణ చేయాల్సి ఉందన్నారు. మార్కింగ్‌ అనంతరం సొంత యజమానులు తనంతట తామే తొలగించుకుంటే నష్టం తగ్గుతుందని పేర్కొన్నారు. రహదారి విస్తరణతో గ్రామ స్వరూపం మారుతుందని, అబివృద్ధికి నాంది పలుకుతుందని ఆయన స్పష్టం చేశారు. సమగ్ర సర్వే అనంతరం విస్తరణ పనులు చేపడతామన్నారు.
తహసిల్దార్‌ మహేశ్వరరావు మాట్లాడుతూ, గ్రామ పెద్దలు, స్థానికులు ఏకమై రహదారి విస్తరణకు సహకరించాలని కోరారు. మార్కింగ్‌ అనంతరం నోటీసులు జారీ చేస్తామని, తగు కాలంలో తొలగించాల్సి ఉందన్నారు. విస్తరణ సమయంలో ఎటువంటి తగాదాలు చోటు చేసుకోకుండా 144 సెక్షన్‌ విధిస్తామని తహసిల్దార్‌ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ కోన లోవ రాజు, ఉప సర్పంచ్‌ పందల దేవా, కొత్తకోట ఎస్సై విభూషణరావు, వైసిపి జిల్లా ప్రధాన కార్యదర్శి తలారి ఆదిమూర్తి పలువురు వార్డు సభ్యులు పాల్గొన్నారు.