ప్రజాశక్తి-ఉక్కునగరం : వేతనాల్లో కోతపెట్టిన రూ.2,400 వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యాన అడ్మిన్ బిల్డింగ్ వద్ద శనివారం కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా స్టీల్‌ప్లాంట్ కాంటాక్ట్ లేబర్ యూనియన్ (సిఐటియు) అధ్యక్షులు జి.శ్రీనివాసరావు మాట్లాడుతూ, దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటుపరం చేసి కార్మికులను రోడ్డు మీద పడేయాలని చూస్తున్న మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. పోరాటాలు, త్యాగాలతో సాధించుకున్న కార్మిక హక్కులను వదులుకోవడానికి కార్మికులు సిద్ధంగా లేరన్నారు. కార్మిక నాయకుడు మంత్రి రవి మాట్లాడుతూ, స్టీల్ యాజమాన్యం, కాంట్రాక్టర్లు ఆడుతున్న డ్రామాలో కాంట్రాక్టు కార్మికులు బలవుతున్నారన్నారు. సిఐటియు నాయకులు వివి రమణ మాట్లాడుతూ, ఐఆర్, ఎస్‌ఎంఎ, ఎఎస్‌ఎంఎ చెల్లించేందుకు తగు ఏర్పాట్లుచేసి కార్మికుల మనోధైర్యం దెబ్బతీయకుండా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష కార్మిక సంఘాల నాయకులు సత్యారావు (హెచ్‌ఎంఎస్), వంశీ (ఐఎన్‌టియుసి), నమ్మి రమణ (సిఐటియు), నగిరి అప్పారావు, బొట్ట గంగరాజు, యు.అప్పారావు, డి.అప్పలనరసమ్మ, వెంకటలక్ష్మి, రాము, సత్యనారాయణ, అప్పారావు, లక్ష్మి, దేవిక, శ్రీను, పైడిరాజు పాల్గొన్నారు.










