ప్రజాశక్తి-బాపట్ల: జాతీయ పత్రికా రంగంలో తొలి జర్నలిస్టు సంఘాన్ని స్థాపించి తెలుగువారి సత్తా చాటిన కోటంరాజు రామారావు చిరస్మరణీయులని ప్రముఖ రచయిత్రి చిల్లర భవానీ దేవి అన్నారు. కోటంరాజు రామారావు 62వ వర్థంతి సందర్భంగా ఫోరమ్ ఫర్ బెటర్ ఆధ్వర్యంలో పట్టణంలో పటేల్ నగర్ పోస్టాఫీసు వద్దగల కోటంరాజు విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ప్రజల్లో స్వాతంత్య్ర ఉద్యమ చైతన్యం రగిలించేందుకు ఆనాటి పత్రికల్లో రాసిన సంపాదకీయాలతో ఆంగ్లేయుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు. ఆంగ్లేయుల ఆగ్రహానికి గురై జైలు శిక్ష అనుభవించారు. అక్షర సమరయోధ సంపాదకుడిగా ఖ్యాతికిక్కారు. ఎక్కడ రాజీపడని ధోరణితో, పాతిక పత్రికలలో పని చేశారు. జర్నలిస్టుల సంఘాన్ని స్థాపించి, వారి సంక్షేమం కోసం పాటుపడ్డారు. రాజ్యసభ సభ్యుడిగా, ప్రణాళికా సంఘం సలహాదారుగా దేశానికి విశిష్టమైన సేవలందించారు. కలం యోధుడు కోటంరాజు పటేల్ నగర్ బిల్డింగ్ సొసైటీలో సభ్యుడు కావడం విశేషం. కార్యక్రమంలో ఫోరమ్ కార్యదర్శి పిసి సాయిబాబు, ఆర్ట్స్ కళాశాల విశ్రాంత ప్రిన్సిపల్ డబ్ల్యుఏజికె మూర్తి, సొసైటీ కార్యదర్శి వెలగా శివరామయ్య, పటేల్ నగర్ పాఠశాల హెచ్‌ఎం సునీత, ఉపాధ్యాయులు, విశ్రాంత తహశీల్దారు విశ్వేశ్వరరావు, విద్యార్థులు పాల్గొన్నారు.










