ప్రజాశక్తి-విజయవాడ: స్థానిక రాజీవ్‌గాంధీ పార్కు ఎంట్రీ టికెట్ జారీ ఆలస్యం అవుతుండటంతో సందర్శకులు అసహనానికి గురవుతున్నారు. రైల్వే, ఆర్టీసి, సినిమా టికెట్స్‌ను ఆన్‌లైన్, క్యూఆర్ కోడ్ ద్వారా స్పీడ్‌గా ఇస్తున్నట్లుగానే ఇక్కడా కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని సందర్శకులు అంటున్నారు. ప్రస్తుతం కంప్యూటరీకరణ ద్వారా టికెట్స్‌ను ఇస్తున్నా పెరుగుతున్న రద్దీతో ఆలస్యం అవుతుంది. శని, ఆదివారాల్లో ఐదారు వేల మంది సందర్శకులు వస్తుంటారు. మిగిలిన రోజుల్లో కూడా సందర్శకుల తాకిడి ఉంటూనే ఉంది. బాగా రద్దీగా ఉండే శని, ఆదివారాల్లో టికెట్స్ ద్వారానే లక్ష వరకు రాబడి ఉండేదని, కానీ ప్రస్తుతం అది కాస్త సగానికి సగం పడిపోయినట్లు నిర్వాహకుల నుంచి సమాచారం అందుతుంది. కోట్లాది రూపాయల విఎంసి నిధులతో ఇటీవల పార్కును అభివృద్ధి చేసినా యువతీ యువకులు, పిల్లల అందరికీ అందుబాటులో ఉండే విధంగా పాలకులు, అధికారులు చర్యలు తీసుకుంటున్న పరిస్థితి కనిపించడం లేదు. పార్కు నిర్వహణ బాధ్యత నుంచి వైదొలగి, ఎంతో కొంత రాబడి వస్తే చాలు అన్న పద్ధతిలో విఎంసి వ్యవహరిస్తుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎంట్రీ టికెట్ పెద్దలకు రూ.20, చిన్నారులకు రూ.10, ద్విచక్రవాహనం, కారు, సభలు, సమావేశాలు, ఫొటోలు, ఇతర ఫంక్షన్లకు టికెట్ ధర నిర్ణయించి భారీ మొత్తంలో వసూలు చేస్తున్నా... ఆ రీతిలో వసతులు కల్పించలేదు. టికెట్స్ ఇవ్వడానికి సరిపోయే రీతిలో సిబ్బంది లేరు. విద్యుత్ కోత ఉన్న సమయాల్లో జనరేట్ సదుపాయం లేక పార్కు చీకటిమయం అవుతుంది. ఈ సమయంలో ఏదేని జరగరాని ఘోరం జరిగితే ఎవరు బాధ్యులు అని సందర్శకులు ప్రశ్నిస్తున్నారు. పార్కుకు పెరుగుతున్న సందర్శకుల సంఖ్యకు అనుగుణంగా టాయిలెట్స్ లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం రెండు+రెండు చొప్పున పురుషులకు, మహిళలకు టారులెట్స్ మాత్రమే ఉన్నాయి. పార్కులో బెంచీలు, పిల్లలు ఆడుకునేందుకు సరైన సదుపాయం ఏర్పాటు చేయలేదు. ఎప్పుడో పాడైపోయిన వాటర్ ఫౌంటైన్‌ను కూడా మరమ్మతులు చేపించే పరిస్థితి లేకుండా పోయింది. ఇప్పటికైనా ఎంట్రీ టికెట్స్ ఇచ్చే విధానాన్ని సులభతరం చేయడంతో పాటు పార్కులో ఇతర సదుపాయాలు కల్పించాలని సందర్శకులు కోరుతున్నారు.










