Jul 27,2023 21:41

కోతకు గురైన నీలవలస - గుమ్మిడిగూడ రోడ్డు

ప్రజాశక్తి - పాచిపెంట :   మండలంలోని గుమ్మిడిగూడ పంచాయతీ నీలంవలస -గుమ్మిడిగూడ వరకు 6.8 కిలోమీటర్లు బిటి రోడ్డు నిర్మాణం ప్రధానమంత్రి సడక్‌ యోజన పథకం కింద రూ.3.76 కోట్లతో రహదారి పనులు చేపడుతున్నారు. గతేడాది అక్టోబర్‌లో రోడ్డు పనులకు సంబంధించి డిప్యూటీ సీఎం పి రాజన్న దొర భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ మేరకు 6.8 కిలోమీటర్ల పొడవున బిటి రోడ్డు పనులు పూర్తయ్యాయి. రోడ్డుకు ఇరువైపులా కల్వర్టులు నిర్మించకపోవడంతో గత కొద్ది రోజులుగా ఎడతెరిపి లేని వర్షాలతో కొండవాగు వరద నీరు ప్రవాహంతో రోడ్డు పలుచోట్ల కోతకు గురైంది. కొన్నిచోట్ల రోడ్డు పెచ్చులూడి వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయి. అలాగే మరికొన్నిచోట్ల రాళ్లు తేలాయి రహదారి పాడవ్వడంతో అటుగా ఉన్న పలు గిరిజన గ్రామాల గిరిజనులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఈ విషయమై పంచాయతీరాజ్‌శాఖ డిఇ చిన్నంనాయుడును వివరణ కోరగా, ఆగస్టు 31లోగా పనులు పూర్తికి తుది గడువని చెప్పారు. నిర్మాణ దశలో అధిక వర్షాలు కురవడంతో కొండవాగుల ప్రవాహానికి రోడ్డు కోతకు గురైందన్నారు. రోడ్డు పనులు ఇంకా పూర్తి కాలేదని పనులు కొనసాగుతున్నాయని, రోడ్డు వరద ప్రవాహానికి కోతకు గురికాకుండా అవసరమైన చోట కల్వర్టుల నిర్మాణానికి పై అధికారుల దృష్టికి తీసుకువెళ్తామని ఆయన తెలిపారు.