ప్రజాశక్తి - కోసిగి
కోసిగిలోని కోసిగయ్య గుడి పూజారులపై చర్యలు తీసుకోవాలని ఆలయ ధర్మకర్త మురళీ దొర కోరారు. పూజారులు గొడవలు పడుతూ ఇష్టారాజ్యాంగ వ్యవహరిస్తుండడంతో పంచాయితీ కాస్త గ్రామ పెద్దల దగ్గరకు చేరింది. ఆలయ ధర్మకర్తలు, గ్రామస్తులు, రైతులు మంగళవారం ఆలయాన్ని పరిశీలించారు. తాగి పడేసిన కర్ణాటక మద్యం టెట్రా ప్యాకెట్లు, మద్యం గ్లాసులు, వాటర్ ప్యాకెట్లు దేవాలయ ప్రాంగణంలో చూసి పూజారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గతం నుంచి పూజారులు దేవాలయంలో మద్యం సేవిస్తున్నారన్న విమర్శలు తేటతెల్లమయ్యాయని తెలిపారు. దేవాలయాన్ని అపవిత్రం చేస్తున్న పూజారులను వెంటనే తొలగించి వారి స్థానంలో బ్రాహ్మణ పూజారులను ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు. ఆంజనేయ స్వామి కోసిగయ్య గుడి దేవాలయంలో ఆలయ అభివృద్ధిపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్తలు మురళీ దొర, కొండగేని వీరారెడ్డి, హనుమయ్య, పెద్ద లవకుశ, శివారెడ్డి, మాధవరెడ్డి, ముసోడు, హుసేని మాట్లాడారు. పూజారుల పంచాయితీ రోజురోజుకు మితిమీరి పోతోందని, గతంలో కూడా పలుమార్లు ఇలాంటి పంచాయితీలు చేశామని తెలిపారు. దేవాలయం అభివృద్ధి కన్నా వారి ఆస్తిపాస్తులు, స్వామి వారికి ఇచ్చిన కానుకలపైనే శ్రద్ధ ఉందని, స్వామివారికి పూజలు చేయడంలో పూజారులకు శ్రద్ధ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవాలయాన్ని ఇంటిగా మార్చుకొని పూజారులు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. దేవాలయంలో మద్యం తాగుతూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని తెలిపారు. తేరుబజారు మైదానంలో ఉన్న కోసిగయ్య దేవాలయానికి సంబంధించిన దుకాణాల నుంచి బాడుగ రూపంలో లక్షలాది రూపాయలు వస్తున్నా ఆలయం అభివృద్ధికి నోచుకోవడం లేదన్నారు. గుడి శిథిలావస్థకు చేరిందని, వర్షాలు వస్తే లోపల తడిసి గర్భ గుడ్డిలోకి నీరు వస్తున్నాయని తెలిపారు. ఎండోమెంట్ అధికారులు సైతం ఏమీ పట్టనట్టుగా వ్యవహరించడం దారుణమన్నారు. ఎండోమెంట్ ఆధికారులు ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు.
మాట్లాడుతున్న ఆలయ ధర్మ కర్త, గ్రామస్తులు










