ప్రజాశక్తి - కోసిగి
మంత్రాలయం నియోజకవర్గంలోని కోసిగి మండలానికి ఎక్కువ నిధులు కేటాయించి అభివృద్ధికి కృషి చేస్తామని ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి తెలిపారు. సోమవారం ఎంపిడిఒ కార్యాలయంలో ఎంపిడిఒ రాజేంద్ర ప్రసాద్, తహశీల్దార్ రుద్రగౌడ్ ఆధ్వర్యంలో మండలాభివృద్ధిపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి హాజరయి మాట్లాడారు. మండలంలో తాగు, సాగునీరు, పారిశుధ్యం, సిసి రోడ్లకు ఎక్కువ నిధులు కేటాయించినట్లు తెలిపారు. సాగునీటి ప్రాజెక్టులు కడిదొడ్డి, ఐరనగల్లు లిఫ్ట్ ఇరిగేషన్ మంజూరుతో పాటు రూ.2 కోట్లతో సాగునీటి కాలువల లైనింగ్ పనులు పూర్తి చేయిస్తామని చెప్పారు. రూ.1.10 కోట్లతో ఇతర కాలువల లైనింగ్ పనులు చేపట్టేలా టెండర్లు పిలిచినట్లు తెలిపారు. తాగునీరు, పారిశుధ్యంపై రూ.15 కోట్లు పనులు, పులికనుమ రిజర్వాయర్ మిగులు నిధులు రూ.6 కోట్లతో కోసిగికి సాగు, తాగునీరు అందిస్తామని చెప్పారు. ఎంపీ సంజీవ్ కుమార్ నిధులు రూ.1.05 కోట్లు, రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య నిధులు రూ.20 లక్షలతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. డిఇలు అశ్వర్థామ, లాల్ కృష్ణయ్య, వైద్యాధికారి డాక్టర్ మనోజ్ కుమార్, ఎఇలు యుగంధర్ రెడ్డి, మల్లికార్జన రెడ్డి, వీరేష్, శేఖర్, రాజేష్, ఎఒ రాజు, ఎపిఎం సత్యమ్మ, ఇఒఆర్‌డి అరుణ్ రషీద్ పాల్గొన్నారు.
మాట్లాడుతున్న ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి










