
ప్రజాశక్తి-మంగళగిరి, సత్తెనపల్లి : కోర్టుల ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని మంగళగిరి సీనియర్ సివిల్ జడ్జి నాగరాజా, సత్తెనపల్లి సీనియర్ సివిల్ జడ్జి డి.నాగవెంకటలక్ష్మి అన్నారు. ఈ మేరకు శుక్రవారం కోర్టు ప్రాంగణాల్లో స్వచ్ఛభారత్‌పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. వారు మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రత ప్రతి పౌరుని బాధ్యతన్నారు. కోర్టుల పరిధిలో ఎక్కడ పడితే అక్కడ వ్యర్ధాలు వదలడం, వాటర్ బాటిల్స్ పడవేయడం సరికాదన్నారు. శనివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ కోర్టుల ప్రాంగణంలో స్వచ్ఛభారత్ కార్యక్రమం నిర్వహిస్తామని న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, మున్సిపల్ శానిటరీ సిబ్బంది పాల్గొనాలని కోరారు. మంగళగిరని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి సిహెచ్‌వి రామకృష్ణ, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి వి.ప్రత్యూష, సత్తెనపల్లి ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి కె.ప్రశాంతి మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడరాదని, అది భూమిలో ఇంకాలంటే వందల ఏళ్లు పడుతుందని చెప్పారు. కోర్టుల ప్రాంగణంలో ఉమ్మివేసినా, వ్యర్థాలు వేసినా సంబంధిత కక్షిదారుడి నుండి జరిమానా వసూలు చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా సత్తెనపల్లిలో పోస్టర్లను అంటించారు. కార్యక్రమాల్లో మంగళగిరి బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు జె.లెనిన్‌బాబు, బి.నాయుడమ్మ, ఉపాధ్యక్షులు బాలశౌరి, టి.నరసింహారావు, మహిళా ప్రతినిధి కె.స్వరూపారాణి, టి.రాజ్యలక్ష్మి, సత్తెనపల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎం.లింగారెడ్డి న్యాయవాదులు, గుమాస్తాలు కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.