Oct 16,2023 23:25

పొలాల్లో తవ్విపోసిన మట్టిని పరిశీలిస్తున్న నాయకులు

ప్రజాశక్తి - చిలకలూరిపేట : దళితులు, వారి భూములకు రక్షణ కరువైందని, కోర్టు వివాదంలో ఉన్నా, హైకోర్టు స్టే ఇచ్చినా లెక్కచేయకుండా మురికిపూడి దళిత రైతుల పొలాల్లో ట్రంచ్‌ (గుంతలు తవ్వి ఆ మట్టిని పెద్ద గట్టుగా వేయడం) వేశారని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్‌) నాయకులు విమర్శించారు. తమ పొలాల్లో ఎంపీ అవినాష్‌రెడ్డి మామ ప్రతాపరెడ్డి కుటుంబీకులకు చెందిన వీరభద్ర మినరల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ గ్రానైట్‌ కంపెనీ వేసిందని కెవిపిఎస్‌ నాయకులుకు బాధితులు చెప్పడంతో నాయకులు సోమవారం ఆ పొలాలను పరిశీలించారు. స్థానిక ఎస్సీలు మాట్లాడుతూ 1975, 2008 సంవత్సరాల్లో 125 ఎకరాలకు బీఫారం, డికె పట్టాలను 90 మందికి ప్రభుత్వాలు ఇచ్చాయని, అయితే ఆ భూముల్లో గ్రానైట్‌ ఉందని తెలుసుకుని ఆ భూమును ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని కంపెనీలు ఆక్రమించాయని చెప్పారు. అనంతరం కెవిపిఎస్‌ పల్నాడు జిల్లా కార్యదర్శి జి.రవిబాబు మాట్లాడుతూ ఈ భూముల్లో మైనింగ్‌ కంపెనీలు గతంలో రోడ్డు వేయబోగా రైతులతో కలిసి అడ్డుకున్నామని, ఇప్పుడు మళ్లీ సుమారు 15-20 ఎకరాల్లో చుట్టూ మట్టిని రాత్రివేళల్లో పోశారని రైతులు చెప్పారన్నారు. గతంలో ఇదే గ్రామానికి చెందిన వైసిపి నాయకుడైన జమ్మలమడుగు ఆదిబాబు తన భూమిని మైనింగ్‌ కోసం ఇవ్వలేదని అదే పార్టీకి చెందిన వ్యక్తే దాడి చేయడంతోపాటు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారని, అయితే దీనిపై పోలీసులు విచారణ చేసి తప్పుడు కేసుగా కోట్టేశారని గుర్తు చేశారు. యడవల్లి దళితుల భూములకు రక్షణ కల్పిస్తానని వాగ్దానం చేసిన జగన్‌మోహన్‌రెడ్డి మాట తప్పారని, వారి భూములను తన అనుయాయులకు అప్పగించే కుట్ర చేశారని మండిపడ్డారు. పొలాల్లో ట్రంచ్‌ వేయడం కోర్టు ధిక్కరణకు పాల్పడడమేనని, దాన్ని తొలగించకుంటే వీరభద్ర మినరల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ గ్రానైట్‌ కంపెనీపై కేసు పెట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. సిఐటియు మండల కార్యదర్శి పి.వెంకటే శ్వర్లు మాట్లాడుతూ నియోజకవర్గంలో 13 గ్రామాల్లో ఎస్సీల సాగు భూములకు రక్షణ కరువైందన్నారు. మురికిపూడి భూముల విషయంలో ప్రభుత్వం సత్వరం న్యాయం చేయాలని కోరారు. పరిశీలనలో నాయకులు ఎం.విల్సన్‌, స్థానికులు జె.ఆదిబాబు, వి.ఏసుపాదం, షేక్‌ బాబావాలి, షేక్‌ నాగూర్‌వలి, పి.వినోద్‌, పి.మహేష్‌, జె.పున్నారావు పాల్గొన్నారు.