Oct 31,2023 20:32

కురుపాం : వర్ధంతి సభలో మాట్లాడుతున్న సిపిఎం సీనియర్‌ నాయకులు కృష్ణమూర్తి

కురుపాం: కోరన్న, మంగన్న స్ఫూర్తితో గిరిజన హక్కులకు కాపాడుకునేందుకు ఐక్యమై ఉద్యమించాలని సిపిఎం సీనియర్‌ నాయకులు ఎం.కృష్ణమూర్తి పిలుపునిచ్చారు. మండలంలోని నీలకంఠపురం పంచాయతీ మామిడిమానుగూడలో కోరన్న, మంగన్న 56వ వర్ధంతి మంగళవారం జరిగింది. సభలో ఎం.కృష్ణమూర్తి మాట్లాడుతూ 1960లో ఇక్కడున్న గిరిజనులచే భూస్వాములు, జమీందారులు వెట్టిచాకిరీ చేయిస్తుంటే గిరిజనుల హక్కుల కోసం భూస్వాములకు, జమీందారులకు, పెత్తందార్లకు వ్యతిరేకంగా జరిగిన గిరిజన రైతాంగ ఉద్యమంలో కోరన్న, మంగన్న అమరులయ్యారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నూతన అటవీ విధానం పేరుతో గిరిజనులను అడవుల నుంచి తరిమివేయడానికి ప్రయత్నిస్తోందని, దీనిపట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. వీటన్నింటికీ వ్యతిరేకంగా పోరాటానికి గిరిజనులంతా ఏకతాటికి వచ్చి కమ్యూనిస్టు పార్టీలకే పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి కె.అవినాష్‌ మాట్లాడుతూ కేబిజెపి ప్రభుత్వం 1/70 చట్టాన్ని ఎత్తి వేయడానికి ప్రయత్నిస్తుందని, గిరిజనులు భూములన్నీ పెత్తందార్లు చేతుల్లోకి వెళ్లాయని ఈ ప్రాంతాన్ని కూడా అలా చేయడానికి చూస్తున్నారని అన్నారు. కావున కోరన్న, మంగన్న స్ఫూర్తితో ఈ ప్రభుత్వాల విధానాలకు నిరసనగా పోరాడాలని పిలుపు నిచ్చారు. చెముడుగూడ ఎంపిటిసి సభ్యులు ఎం.రమణ మాట్లాడుతూ గిరిజనులకు రిజర్వేషన్‌ లేకుండా చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చూస్తున్నాయని విమర్శించారు. వీటన్నింటికీ వ్యతిరేకంగా గిరిజన హక్కుల కోసం కోరన్న, మంగన్న స్ఫూర్తితో పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎం.తిరుపతిరావు, కుక్కిడి సర్పంచ్‌ బిడ్డక రాజారావు, కురుపాం సిపిఎం మండల కార్యదర్శి ఎం. శ్రీనివాసరావు, నాయకులు బిడ్డకి శంకర్రావు, ఎం.సన్యాసిరావు, బిడ్డిక వెంకట్రావు, గుమ్మలక్ష్మీపురం సిఐటియు నాయకులు కె.గౌరీశ్వరరావు, గిరిజనులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
గుమ్మలక్ష్మీపురం: అమరవీరుల ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సిపిఎం సీనియర్‌ నాయకులు ఎం.కృష్ణమూర్తి పిలుపునిచ్చారు. కోరన్న, మంగన్న సందర్భంగా గుమ్మలక్ష్మీ పురంలో ఉన్న ఎర్రజెండా స్థూపం వద్ద నివాళ్లు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజనుల సమస్యలపై పోరాటం చేసినప్పుడే పరిష్కారమవుతాయని అన్నారు. కార్యక్రమంలో సిపిఎం మండల నాయకులు కోలక అవినాష్‌, మండంగి రమణ, శంకర్రావు, సన్యాసిరావు, మోహన్‌ రావు, సిఐటియు మండల కార్యదర్శి కె.గౌరీశ్వరరావు తదితరులు ఉన్నారు.
పార్వతీపురం టౌన్‌ : స్థానిక గిరిజన భవన్‌ వద్ద రైతు కూలీ సంఘం (ఆం.ప్ర) ఆధ్వర్యంలో జిల్లా సహాయ కార్యదర్శి పాపల శ్రీను నాయుడు అధ్యక్షతన సభ నిర్వహించారు. సభ అనంతరం ఆర్టీసీ కాంప్లెక్స్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు కూలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎస్‌. ఝాన్సీ, రాష్ట్ర సహాయ కార్యదర్శి దంతులూరి వర్మ, రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షులు ఊయక ముత్యాలు, ఉపాధ్యక్షులు పీడిక ఆసిరి, కండ్రక వెంకటస్వామి, రైతు కూలీ సంఘం నాయకులు మౌనంగి భాష, సిరివరపు విశ్వేశ్వరరావు ప్రసంగించారు. కార్యక్రమంలో రైతులు, గిరిజనులు, మహిళలు పాల్గొన్నారు.
పార్వతీపురం రూరల్‌ : కోరన్న, మంగన్న లాంటి వారి పోరాటాలతో, ప్రాణ త్యాగాలతో సాధించుకున్న హక్కుల రక్షణ కోసం మరో పోరాటానికి సిద్ధం కావాలని గిరిజన సంక్షేమ సంఘం ఉత్తరాంధ్ర ప్రధాన కార్యదర్శి పాలక రంజిత్‌ కుమార్‌ అన్నారు. కోరన్న, మంగన్న ల వర్ధంతి సభ మండలంలోని లిడికివలసలో నిర్వహించారు. సంఘం జిల్లా అధ్యక్షులు తాడంగి సాయిబాబు అధ్యక్షతన జరిగిన సభలో ఎంపిటిసి సభ్యులు ఓటక సుందరరావు, ఉర్లక నాగార్జున, సురేష్‌, ప్రభాకర రావు, దేసీ తదిత రులు పాల్గొన్నారు. అంతకు ముందు గిరిజన మహిళలు థింసా, కోలాటం, సాంప్ర దాయం నృత్యాలు చేశారు.
కొమరాడ : శ్రీకాకుళ గిరిజన రైతాంగ సాయుధ పోరాట యోధులు కోరన్న, మంగన్నల పోరాట స్ఫూర్తితో దోపిడీ, పీడనల విముక్తి కోసం పోరాడాలని ఎఐటిఎఫ్‌ జాతీయ కమిటీ సభ్యులు సంబుడు జయలక్ష్మి అన్నారు. అఖిల భారత రైతు-కూలీ సంఘం (ఏ.ఐ.కె.ఎం.ఎస్‌), అఖిల భారత ఆదివాసీ వేదిక (ఏ.ఐ.టి.ఎఫ్‌)ల ఆధ్వర్యంలో మండలంలోని చినకేర్జల పంచాయితీ గ్రామంలో నివాళి కార్యక్రమం చేపట్టారు. శ్రీకాకుళ సాయుధ పోరులో అమరులైన వీరుల బాటలో పయనించి, నేటి కేంద్ర, రాష్ట్ర పాలకులు అనుసరిస్తున్న ఆదివాసీ, ప్రజా వ్యతిరేక విధానాలను ఎదిరిస్తామని ఆదివాసీలు ప్రతినబూనారు. కార్యక్రమంలో ఎఐకెఎంఎస్‌ జిల్లా కమిటీ సభ్యులు పీడక చిరంజీవులు, పి.ఓ.డబ్ల్యూ జిల్లా కమిటీ సభ్యురాలు నూకమ్మ మరియు ఆదివాసీలు పాల్గొన్నారు.