Oct 10,2022 00:09

కోరమండల్‌ గేటు వద్ద ధర్నానుద్దేశించి మాట్లాడుతున్న లక్ష్మణమూర్తి

ప్రజాశక్తి -ములగాడ : కోరమండల్‌ కంపెనీ విషవాయువుల విడుదలను వ్యతిరేకిస్తూ అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా), గ్రామ సంఘం ఆధ్వర్యాన కోరమండల్‌ గేటు వద్ద ఆదివారం నిరసన తెలిపారు. ఈ సరదర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ, శనివారం రాత్రి కోరమండల్‌ కంపెనీ ఒక్కసారి విషవాయువులు వదిలేయడంతో కళ్ల మంటలు, గొంతునొప్పి, శ్వాసపీల్చుకోలేకపోవడం తదితర సమస్యలతో ఇబ్బందులు పడ్డారని తెలిపారు. వృద్దులు, గర్భిణులు ఇబ్బందులకు గురయ్యారని పేర్కొన్నారు. గ్రామ సంఘం, ఐద్వా మహిళా సంఘ సభ్యులు కోరమండల్‌ యాజమాన్యానికి పోన్‌ చేస్తే వస్తామని చెప్పి రాలేదని తెలిపారు. దీంతో గుల్లలపాలెం, రజకవీధి, కుంచమ్మకాలనీ ప్రజలు కోరమండల్‌ గేట్‌ వద్ద ఐద్వా గుల్లలపాలెం కమిటీ, గ్రామ సంఘం, యువకులు ధర్నా నిర్వహించారు. కోరమండల్‌ నుంచి వస్తున్న విషవాయువులు అరికట్టాలి, 'ప్రజల ప్రాణాలాకు రక్షణ కల్పించాలి', యువకులకు ఉపాధి కల్పించాలి. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడోద్దు కోరమండల్‌ కాలుష్యం నుంచి ప్రజలకు రక్షణ కల్పించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ఐద్వా నాయుకులు బి.మమత, గుల్లలపాలెం గ్రామ కార్యదర్శి అంగ గంటారావు, కారాడ రాము, పి.వర్మ, సునీల్‌ మాట్లాడుతూ, కోరమండల్‌ నుంచి వెలువడుతున్న విషవాయువులు వల్ల ప్రజలు అనారోగ్యాల పాలవుతున్నారని తెలిపారు. తక్షణమే కోరమండల్‌ యాజమాన్యం విషవాయువులను అరికట్టాలని, అనారోగ్యాలపాలైన వారికి వైద్యం చేయించాలని, నిరుద్యోగ యువకులకు ఉపాధి కల్పించాలని తదితర డిమాండ్లను యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన కోరమండల్‌ యాజమాన్యం తరుపున శ్రీకాంత్‌, సెప్టీ అధికారి నాగరాజు మాట్లాడుతూ, వారం రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని మల్కాపురం సిఐ లూధర్‌బాబు సమక్షంలో తెలిపారు. గుల్లలపాలెం గ్రామ పెద్దలు, మహిళా సంఘం ఆధ్వర్యాన కుర్చోని పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. ఈ ధర్నాలో బర్రి రాజు గురునాధరావు, పి.శ్రీధర్‌, దున్నా ప్రతాప్‌, ఐద్వా నాయుకులు నిర్మల, కృష్ణవేణి, బి.విజయ, తిరుమల, వరలక్ష్మి, వి.సుజాత, ఈశ్వరమ్మ, పోలమ్మ పాల్గొన్నారు.