ప్రజాశక్తి- టెక్కలి రూరల్: టెక్కలి మండల పరిషత్ సర్వసభ్యుల సమావేశాన్ని కోరం లేకుండా ఎంపిపి అట్లా సరోజనమ్మ అధ్యక్షతన ఆరుగురు ఎంపిటిసిలతో శనివారం నిర్వహించారు. ఎంపిటిసి గుంట రాజేష్, జనపాన జయలక్ష్మి, జన్ని మంగమ్మ, రౌతు బృందావతి, బమ్మిడి కూర్మారావు, సత్తారు ఉషారాణిలు సభలో ఉన్నారు. మిగతా ఎంపిటిసి సమావేశాన్ని బహష్కీరించారు. ఈ సందర్భంగా టెక్కలి నియోజకవర్గ ఇన్‌ఛార్జి దువ్వాడ వాణి మాట్లాడుతూ ప్రతి ఎంపిటిసికీ సమానంగా నిధులు పంపిణీ చేస్తున్నామని, అందులో వివక్షత లేదని అన్నారు. కాలువలకు రూ.60 లక్షలు మంజూరయ్యాయని, వాటిని సర్దుబాటు చేసి పనులు చేపట్టాలని ఆర్‌డబ్ల్యుఎస్ ఎఇకి సూచించారు. అలాగే విద్యుత్ స్తంభాలను లేవని గడపగడపకు తిరుగుతుంటే ప్రజలు వినతులు అందజేస్తున్నారని, స్తంభాలు మంజూరుకు ప్రతిపాదన తయారు చేయాలని విద్యుత్‌శాఖ ఎఇకి సూచించారు. వ్యవసాయ శాఖలో విత్తనాలు, ఎరువులు ఎటువంటి రైతులు ఇబ్బందులు లేకుండా పూర్తిస్థాయిలో రైతు భరోసా కేంద్రాల్లో నిల్వ చేయాలని వ్యవసాయశాఖ గోకు సూచించారు. కార్యక్రమంలో ఎంపిడిఒ హనుమంతు వెంకటరమణమూర్తి, పిఎసిఎస్ అధ్యక్షుడు సత్తారు సత్యం, సర్పంచ్‌లు పాల్గొన్నారు.
ఎంపిటిసిల బహిష్కరణ
మండల పరిషత్ సర్వసభ్య సమావేశం నుంచి వైస్ ఎంపిపి మన్నేల కిషోర్‌తో ఎంపిటిసిలు కూన పార్వతి, పీత హేమలత, పోలాకి ఫాల్గుణరావు, యర్ర సుజాత, బసవల సంధ్యారాణి, చింతాడ శ్రీలత బహిష్కరించారు. గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి పనులకు తమకు సమాచారం లేకుండా నిర్వహిస్తూ ప్రోటోకాల్ పాటించడంలేదని ఆరోపించారు. ఈ సందర్భంగా కిషోర్ మాట్లాడుతూ మండల పరిషత్ నిధులు దుర్వినియోగం జరిగాయని ఆరోపించారు. దీనిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తానని తెలిపారు. ఎంపిటిసి శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లా పరిషత్ నిధుల నుంచి నాలుగు బోర్లు మంజూరు చేయిస్తే... జెడ్‌పిటిసి దువ్వాడ వాణి వాటిని నిలుపుదల చేశారని అన్నారు. దీంతో అందరూ ప్రాదేశికలోకి వెళ్లలేకపోతున్నామని, ఎక్కడ సమస్యలు అక్కడే వెంటాడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.










