
ఇంతింత పల్లేసుకొని ఇంట్లో ఉన్న బొమ్మలను కరకర నమిలేస్తున్నాయి రిమోట్ బొమ్మలు. కల చెదిరి ఉలిక్కిపడి లేచాడు పదేళ్ల బుడ్డోడు. ఈ కల ఎందుకొచ్చింది? బ్రౌన్ కలర్ జుట్టు గొక్కున్నాడు. ''నిన్న సాయంత్రం స్కూల్ అయ్యాక పెయింటింగ్ షాప్ కాడికి వెల్లా కదా, అండుకే వచ్చి ఉంటుంది.'' అనుకోగానే నాన్న మీద కోపమొచ్చింది. అప్పుడేమైందంటే, ''రేరు, ఇంక నువ్వు నా షాప్ కాడికి రావద్దు, రంగు వాసన పిల్లోల్లకి పడదు'' అన్నాడు నాన్న, బుడ్డోడి గుండె డుబిల్లుమని జారింది.
జారదూ మరి! పొద్దున లేచింది మొదలు నాన్న షాప్‌లో రంగులు చూసి కళ్ళు జిగేల్మనిపించుకోవడం వాడికి నాన్నని కావలించుకున్నంత ఇష్టం. నాన్న ఆ రంగులన్నిటినీ తన చేతుల్లో తిప్పి అబ్రకదబ్రా అనకుండానే అన్నంత పనీ చేసి ఒక బొమ్మను సృష్టిస్తాడు. భలే నాన్న కదూ! అని ఆయన బుగ్గమీద ముద్దు పెట్టుకుంటాడు బుడ్డోడు. నాన్న కూడా తెలీకుండా నవ్వుతాడు. అలాంటి చిత్రకార్ నాన్నని మిత్రులకి చూపించి వాళ్లు కుళ్లుకునేలా చేయడం వాడికి మాత్రమే దక్కిన హీరోయిజం.
గోడ మీద బొగ్గుతో ఏదేదో గీశాడు. నాన్న గోడ పాడైంది అంటాడని భయపడ్డ అలా జరగలేదు. మర్నాడు బ్రష్ పట్టుకొని ఇదేదో గీశాడు, రంగులు కాజేసి కూస్తున్నాడు. దూరంగా ఉన్నప్పుడు ఆరాటపడ్డ వాడు, ఇప్పుడు ఏం గీయాలో అర్ధం కాక ఇల్లు, చెరువు, రెండు తాటి చెట్లు, మేఘాల్లో గుండ్రంగా లేని సూర్యుడు... గీశాడు.
నాన్న వాసు ఆర్ట్స్ అంటే కిక్కులేదని 'చిత్రకార్ ఆర్ట్స్' అయ్యాడు ఆ ఊర్లో. ఇక్కడ కమర్షియల్ పెయింటింగ్ ఆర్టిస్టులకు కాన్వాసు, అక్రిలిక్, ఫ్యాబ్రిక్ పెయింట్స్ తెలీదు... అంతా ఎనామిల్ పెయింటే. బొమ్మలు కిరసనాయిలు వాసనతో నిండి అదో మత్తు, గమ్మత్తు బుడ్డోడి నాసికకి.
నిన్న వెళ్ళేటప్పటికి నాన్న షాపు గోడల్ని దిగులుగా నిమురుతున్నాడు.
''ఇన్ని రోజులు లేనిది ఈరోజు ఏమిటి!'' ఆ ప్రవర్తన వింతగా చూశాడు బుడ్డోడు.
''వాసూ'' కేకేశాడు షట్టర్ ఓనర్ చంద్ర శేఖర్, అరవై ఉంటాయి. ''ఐదు నెలలు అద్దె ఆగింది. ఆరో నెల కూడా వస్తుంది. ఎంత లేదన్నా యాభై వేలు అవుతుంది. ఇక నాక్కూడా కారణాలు వినే ఓపిక పోయిందయ్యా'' కుర్చీ వేసినా కూర్చోకుండా అన్నాడు.
''జనం ఈ డిజిటల్ యుగానికి తగ్గట్టే వ్యాపార మార్గాలు అన్వేషిస్తున్నారు. కాలం మారేకొద్దీ అవసరాలు మారుతుంటాయి. దానికి తగ్గట్టే తెలివైన వ్యాపారి వ్యాపారాన్ని ఎంచుకుంటాడు''
''నిజమే, కానీ నేను కళాకారున్ని సార్, వ్యాపారిని కాదుగా'' వాసు.
''అదే కదా సమస్య. అమెరికాలో మా వాడి దగ్గర ఉండి వచ్చాక, మాకూ ఏమీ తోచడం లేదు. ఏదైనా చేద్దాం అనిపిస్తుంది.''
''చాలా మంచి ఆలోచన'' కొంపదీసి తనకి ఎసరు పెడతాడా అన్నట్టు నసిగాడు వాసు.
''మ్.. ఇందులోనే ఒక ఫ్లెక్స్ ప్రింటింగ్ స్టూడియో పెడదామని'' అన్నాడు ఓనర్.
తలని ప్లాస్టిక్ కవర్తో బిగించి కట్టినట్టు గుడ్లు తేలేసాడు వాసు. ''బాగా అచ్చొచ్చిన ప్లేస్, మంచి ఏరియా. షాప్ ఊరంతా తెలుసాయే. ఇప్పుడు తీసేస్తే ఎక్కడికి పోతాం? కొత్త షాప్‌కి అడ్వాన్స్ లక్ష కట్టాలి. అయ్యే పనేనా?''
పిల్లాడు నాన్న మొహంలో రంగులు మాయం అవడం చూస్తూనే ఉన్నాడు. ఏదో జరగబోతోంది అని మాత్రం అర్థమయింది. ఓ నిశ్శబ్దం వాడికి విసుగ్గా తోచింది. గబుక్కున స్టూల్ ఎక్కి గోడకున్న క్యాలెండర్ చూసి అబ్బురపడటం మొదలుపెట్టాడు. మరే, రాజా రవివర్మ బొమ్మలవి.
ఓనర్ రాని నవ్వు తెచ్చుకొని, ''కంగారుపడకు వాసు.. ఇప్పుడు సగం ఇచ్చి వెళ్లు. మిగతావి తర్వాత ఇద్దువు, నీకూ ఇబ్బందేగా.''
తన పోర్ట్రైట్‌లా మెదలకుండా నిలబడ్డాడు వాసు. బుడ్డోడు నాన్నని ఏదైనా జోక్ వేసి నవ్విడ్డామని చోటా భీమ్‌నీ ఇమిటేట్ చేశాడు. ఆయన నవ్వలేదు. ఓనర్ తన హాస్య గ్రంథులకి అప్పుడే ఆహారం దొరికినట్టు హా.. హా.. హా అన్నాడు.
శ్రీశ్రీశ్రీ
సాయంత్రం బుడ్డోడు నాన్నతో కలిసి ఆ షాపు నుంచి వెళ్తుంటే ''నాన్నా.. నువ్వు లేకుంటే మనూరు ఏమైపోయిద్దో, ఊరినిండా నీ బొమ్మలే'' అని గర్వపడ్డాడు. వాటిని అత్తారింటికి పంపే కూతుర్ని చూసినట్టు చూసాడు వాసు.
బుడ్డోడు ఆకాశం వైపు చూసి మబ్బులు సింహాల్లా కనబడితే చిచ్చుబుడ్డిలా నవ్వాడు ఎప్పటిలా, వెంటనే తనలో తాను మాట్లాడు కోసాగాడు.
''ఏ బొమ్మలు గీస్తే బాగుంటుందో తెలియదు నాన్నకి. ఎప్పుడూ గాంధీనో, కలాంనో గీస్తాడు కానీ, నాన్న బొమ్మ నాన్న గీసుకోడు. నేను గీస్తా. ఒకరోజు కోతి బొమ్మ గీస్తే భలే వచ్చింది. ''అచ్చం అలాగే గీశావురా.. అద్దంలో చూసుకున్నావా ఏంటి?'' అని ఏడిపించింది అక్క. మరి తనకు నచ్చకపోతే ఆ బొమ్మ ఇంట్లో గోడకెందుకు అతికిస్తుంది!' తీపి గుర్తు చప్పరించాడు బుడ్డోడు.
ఆ వయసులో రంగులంటే తనకు ఎందుకంత ఇష్టమో బుడ్డోడు ఆలోచించలేకపోయాడు. కానీ నాన్న ఆలోచించాడు. అప్పటి నుంచి నాన్న రంగులు ముట్టుకొనివ్వట్లేదు. ఇప్పుడు షాప్‌కే రావద్దన్నాడు.. ఏమైంది నాన్నకి?'' రాత్రి ఏడుస్తూ, కలవరిస్తూ పడుకున్నాడు. వాసు నిద్ర చెదిరి కొడుకుని చూసాడు. నిజానికి తనకి కూడా అలాగే ఉంది, తన కన్నీరు బైటికి రాలేదంతే.
***
మరుసటి రోజు నాన్న వెళ్తుంటే దొంగచాటుగా వెళ్లి షాపు షట్టర్ తెరవగానే గబుక్కున దూరి లోన కూర్చున్నాడు బుడ్డోడు.
''నన్ను ఏమీ అనకు. నేనూ.. నేను బొమ్మ గీయాలి, కావాలంటే షాపు ఊడ్చి పెడతా నాన్న'' అని మూలన ఉన్న చీపురు తీసుకొని చేతకాకున్నా ఊడుస్తున్నాడు. వాసు అలాగే చూశాడు కొడుకుని.
''రేపటి నుంచి వచ్చేటప్పుడు రెండు పుస్తకాలు కూడా తెచ్చుకో'' అన్నాడు.
బుడ్డోడు బొమ్మల పుస్తకాలనుకున్నాడు.. పాపం చిక్కగా నవ్వాడు.
వాసు గంటలు తరబడి గాంధీ బొమ్మ గీస్తున్నాడు.
పిల్లాడికి విసుగొచ్చి ''ఇంతసేపా'' అని గొనుక్కున్నాడు.
''ఇంక ఇక్కడ ఇదే చివరిది కావొచ్చు'' నాన్న.
బుడ్డోడు ''అదేంటి గాంధీ తాత మొహంలో ఏడుపు''
చూసి తానూ ఆశ్చర్యపోయాడు వాసు. కొన్ని వందలసార్లు వేసిన బొమ్మ ఎందుకో కుదరలేదు. మనసు స్థిమితంగా లేదు. కొడుకు అబ్జర్వేషన్ నచ్చినా మెచ్చుకోలేదు.
వాసు ఆలోచనలో మునిగిపోయాడు. 'చిన్న చిన్న పనులు దొరికినా సగం రెంటు కట్టవచ్చు. కానీ ఇన్నాళ్లూ లేనిది ఇప్పటికిప్పుడు ఎలా దొరుకుతాయి? ఎంత అనుభవం. ఎంత కళ, ఇలా వేసారి పోయాయి' మధనంలో పడ్డాడు.
***
ఇరవై ఏళ్ల కిత్రం.. రంగుల కలలతో సిటీకి వచ్చాడు. మునిసిపాలిటీ ప్రాజెక్టులో భాగంగా రోడ్డు పక్కన గోడలకు రంగులద్దే పని జరుగుతోంది. అక్కడికి వెళ్లి బొమ్మ గీస్తున్న ఆర్టిస్ట్ ప్రకాశ్ కాళ్ళు గడ్డాలూ పట్టుకున్నాడు. ఆయన గడ్డంకన్నా కాళ్ళకి జాలి ఎక్కువేమో, బక్కగా, రేగిన చుట్టూ, పీచుగడ్డంతో ఐదున్నర అడుగుల అర్భకుడిలా ఉన్న అతన్ని కనికరించాడు. గోడకి సున్నమేసినట్టు బ్రష్ పరాపరా జాడిస్తుంటే, ''రంగులు తాగేస్తున్నావా ఏంటి?'' అని గురువు తిట్టినా, కొట్టినా తట్టుకున్నాడు. బ్రష్‌తో సున్నా చుట్టడానికి మూడునెలలు తీసుకున్నాడు. ఆ తర్వాత అదే బ్రష్‌తో పర్వతాలు నిర్మించాడు, నదీనదాలు పొంగించాడు. తెలుగు అక్షరాలకు సొగసులద్దాడు. ఆ వెలుగుకి ప్రకాశం మురిసిపోయి ఇకనుంచి జీతం ఇస్తున్నా అన్నాడు, వద్దన్నాడు వాసు.
''నా బొమ్మలతో మా ఊరిని అలంకరించాలి'' కల బైట పెట్టాడు. మొదట బాధపడ్డా, గురువుగా తన పని పరోక్షంగా కొత్త కళాకారుని సృష్టించడమే కదా, సరే అని చిత్రకార స్టాంప్ వేశాడు. గుంటూరు గోడలు తన బొమ్మలతో సొగసు కత్తెలా వయ్యారాలు పోతుంటే అవి చూస్తూ దూరదేశం పోయే చెలికాడిలా వీడ్కోలు పలికాడు.
***
రేపో, ఎల్లుండో షాపులో చివరి రోజు. ఎలాగో ఇరవై వేలు అప్పు ముట్టాయి. 'గెంటేసే దాకా తెచ్చుకోనక్కర లేదు. ఎన్నాళ్ళ బంధమైనా ఓనర్ ఓనరే, వర్కర్ వర్కరే' షట్టర్ తీస్తూ అదోలా నవ్వుకున్నాడు వాసు.
నాన్న ఏమీ అనలేదన్న ధైర్యంతో ఉత్సాహంగా వెళ్లి ''రంగు డబ్బాలు నేనే తెరుస్తా '' నని చూశాడు బుడ్డోడు. వాన్ని చూస్తుంటే తనని చూసుకున్నట్టు ఉంది.
డబ్బాలు ఖాళీగా ఉన్నాయి. బుడ్డోడు కళ్ళు మిటకరించాడు. కొడుకులాగే ఆశ్చర్యపోయాడు వాసు.
నిన్న గీసిన గాంధీ బొమ్మ బోర్డుపై లేదు. రంగు మరకలు మాత్రమే కనబడ్డాయి. మిగతా బోర్డులు తిప్పి చూశాడు. దేనిమీదా వేసిన బొమ్మ లేదు. తెల్లగా స్వచ్ఛంగా ఉన్నాయి, శవం మీద కప్పే వస్త్రంలా. వెతికితే ఓ మూల బ్రష్లు దొరికాయి. కానీ వాటికి కుంచెలు గాల్లో ఎగరడం కనిపిస్తోంది. దానితో ఎన్నెన్ని కళాఖండాలు చిత్రించాడు. చేతి నుంచి ఏదో అవయవం కోల్పోయినట్లు జివ్వున లాగినట్లనిపించింది, చేయి విదిలించాడు వాసు. డబ్బాల్లోని రంగులన్నీ కెరటాల్లా ఒక్కసారిగా పైకి లేచాయి. ధారగా లేచిన రంగులు విడివడి బిందువుల్లా మారి ఆవిరైపోతున్నాయి. గోడకు ఉన్న రవివర్మ బొమ్మల క్యాలెండర్ చిరిగింది. బొమ్మలు అంత బాగా వేయాలని కలగన్నాడు బుడ్డోడు. అదొక్కటే కాదు, శ్రీను హెయిర్ స్టైల్ గోడకి నాన్న గీసిన బొమ్మలు మాయం. కాలేజీ గోడమీద రైతుకూలీ సంఘం పోస్టర్ మాయం.. స్కూల్‌కి జాతీయ నాయకుల బొమ్మలు ఐదారు గీసినపుడు బుడ్డోడికి సైకిల్ కొన్నాడు. సభలకి సంఘాలకు గీసినపుడు పాడైన తన పాత ఇంటికి బాగుచేసుకున్నాడు. సామాజిక కార్యక్రమాలకి పని చేసినప్పుడు తృప్తిగా ఓ నవ్వు నవ్వుతాడు వాసు. ఇప్పుడవి మాయం.. ఫ్లెక్స్ అనబడే ప్లాస్టిక్ తొడుగు ఆ గోడలని బల్లిలా కరుచుకుంది.
బలమైన గోడలు చీల్చుకొని బైటికొచ్చింది ఆ చిత్రమైన జీవి. ఎర్రని కళ్ళు, నల్లని వొళ్లు, పొగలు కక్కుతోంది. రబ్బరులా సాగుతోంది. కాస్త డ్రాగన్లా, మరికాస్త రోబోలా ఉంది. పెద్ద శబ్దం చేస్తూ తన భీకర నోరు తెరిచింది, మంటలు ఎగసి రోడ్డుమీద షాప్‌ల సైన్ బోర్డులని మసిచేశాయి. దానికి దాహమెక్కువ. రక్తం పీల్చినట్టు రంగులు పిలుస్తోంది. జనం దీన్ని పట్టించుకోరేంటి? ఎవరికీ ఏది కనబడడం లేదా?' తనలో తానే అనుకున్నాడు బుడ్డోడు.
ట్వింకిల్ ఆర్ట్స్.. ఆ వెనకాలే వెంకట్ ఆర్ట్స్, శిల్పా ఆర్ట్స్, భాషా ఆర్ట్స్, రవి ఆర్ట్స్, బోలెడు మంది ఊరి చిత్రకారులు.. ''ఏమయ్యాయి మా రంగులన్నీ?'' అని తిరుగుతున్నారు. యంత్రం వాళ్ల నాన్నని తీసుకెళ్లి బీడువారిన భూమిలో పడేసింది. అక్కడ తనలాగే గుంపులు గుంపులుగా జనం.. మట్టికొట్టుకు పోయిన జనం..
ఉలిక్కిపడి లేచాడు బుడ్డోడు. శిశిరం కరువుని గుర్తు చేసినట్లు ఉంది ఆ విధ్వంసపు కల. ఆ రాత్రి ఇక నిద్ర పట్టలేదు.
***
గుండెలు అదురుతుంటే పొద్దున్నే పరిగెత్తుకుంటూ షాపు దగ్గరికెళ్ళాడు బుడ్డోడు. షాపు మొత్తం రోడ్డు మీద ఉంది.
''సగం డబ్బులు ఇమ్మంటే పదివేలు ఇస్తావా? బుద్ధి ఉండాల'' అంటున్నాడు ఓనర్. మిగతా డబ్బు ఇంటి అవసరాలకి ఖర్చయిందనీ చెప్పినా ఉపయోగం లేదని తెలుసు. మౌనంగా ఒక్కో పెయింటింగ్ ఏరి ఆటోలో పెడుతున్నాడు వాసు. చివరి పెయింటింగ్ కూలీ అక్కడ పడేయగానే ఒక్క దూకు దూకి తనకన్నా పెద్దగా ఉన్న దాన్ని తీసి హత్తుకున్నాడు. ఎదురుగా నాన్న, ఆయన ఎదురుగా ఓనర్ ఒకే రకంగా చూశారు.
''వాసూ.. ఇప్పటికైనా సులభమైన మార్గాలకి మనం మారాలి. నీ ఓటమికి ఈ మారలేకపోవడమే కారణం'' ఓనర్‌కి సహజంగా ఉండే సలహాలిచ్చే హక్కుతో అన్నాడు.
వాసు కళ్ళ నీళ్ళు దాచి ''యాంత్రికంగా బతికే మన ప్రపంచంలో కళ లెక్కలోకి రాదు. జనం కాస్త ఆస్వాదన పెంచుకుంటే వీటిని బతికించుకోవచ్చు.. తప్పు నాది కాదు సార్''
''అంటే జనందే అంటావా?!'' పెద్దగా నవ్వాడు పెద్దాయన.
అతనేం మాట్లాడలేదు. ఆ జనంలో తానూ ఉన్నందుకేమో ఓనర్ మొహం ఎర్రబడింది. బై చెప్పి నడిచాడు వాసు.
''ఎక్కడికి నాన్నా?'' బుడ్డోడు కేకేసాడు.
''మన ఇంటికి'' వాసు.
''హే... అయితే నేను రోజూ బొమ్మలు గీయొచ్చు'' ఎగిరి గంతేశాడు.
నాన్న ఎగిరే చిలకని చూసినట్టు లాలనగా చూసాడు. రోజులు గడిచాక తెలిసింది బుడ్డోడికి... షాపు కాదు, నాన్నే ఖాళీ అయ్యాడు అని. రంగు డబ్బాలు నిజంగానే ఖాళీ.. తను ఒక్కరోజు కూడా బొమ్మ గీయలేదు. తర్వాత అనేకసార్లు వాటి అవసరం వచ్చినా బొమ్మ గీయడం రాలేదు. అప్పటికి అర్థం అయింది, నాన్న ఎందుకు బొమ్మలు గీయొద్దు అన్నాడో. దట్స్ ది డిజైన్డ్ ఫేట్. తర్వాత ఆ ఊర్లో మరో ఆర్టిస్టు పుట్టలేదు. కాబోయే రవివర్మ ఎప్పటికీ కాలేదు.
పరిమి చరణ్