Mar 01,2023 23:58

సంయుక్త స్కూల్‌ కరస్పాండెంట్‌ గోవిందరావును కరపత్రాన్ని ఇస్తున్న రమాప్రభ, వెంకటేశ్వరరావు

ప్రజాశక్తి-అనకాపల్లి:ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, ప్రజా సమస్యలపై అవగాహన ఉన్న, వాటి పరిష్కారానికి పోరాడుతున్న ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గం పిడిఎఫ్‌ అభ్యర్థి కోరెడ్ల రమాప్రభకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఐ.వెంకటేశ్వరరావు ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. పట్టణంలోని ఎన్టీఆర్‌ స్టేడియం, రింగ్‌ రోడ్‌, బెల్లం మార్కెట్‌ తదితర ప్రాంతాల్లో వాకర్స్‌ను కలిసి కోరెడ్ల రమాప్రభకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ఎమ్మెల్సీతో పాటు పిడిఎఫ్‌ అభ్యర్థి కోరెడ్ల రమాప్రభ, ప్రజా సంఘాల నాయకులు సంయుక్త స్కూల్‌ కరస్పాండెంట్‌ గోవిందరావును కలిశారు. పలు విద్యా సంస్థల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐ.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రంలో అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపిలు వంత పాడుతున్నాయని తెలిపారు. విశాఖ రైల్వే జోన్‌ కోసం, స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మిక, ప్రజా సంఘాలతో కలిసి పిడిఎఫ్‌ ఎమ్మెల్సీలే పోరాడుతున్నారని చెప్పారు. 250 ప్రజా సంఘాల బలపర్చుతున్న కోరెడ్ల రమాప్రభ ఉత్తరాంధ్ర ప్రజలు గొంతై ఇక్కడి సమస్యలపై గళమెత్తుతారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు బి.ఉమామహేశ్వరరావు, గంట శ్రీరామ్‌, ఎ.బాలకృష్ణ, గంట సురేష్‌, ఎస్‌ రమణ, గొర్లి తరుణ్‌ పాల్గొన్నారు.
నక్కపల్లి:పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి కోరెడ్ల రమాప్రభను గెలిపించాలని పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ ఐ వెంకటేశ్వరరావు కోరారు. మండలం లో బుధవారం పలు గ్రామాల్లో పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి రమా ప్రభను గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శాసనమండలిలో పట్టభద్రులు, నిరుద్యోగుల, ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలపైన పిడిఎఫ్‌ ఎమ్మెల్సీలు తమ గళాన్ని వినిపిస్తున్నారన్నారు.శాసనమండలి సభ్యులకు ఇచ్చిన కోట్లాది రూపాయలు విలువ చేసే ఇల్లు, స్థలాలను పిడిఎఫ్‌ శాసనమండలి సభ్యులు తిరస్కరించి, రాష్ట్రంలో ఇల్లు, స్థలాలు లేని పేదలకు ఇవ్వాలని డిమాండ్‌ చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.అప్పలరాజు, ప్రజానాట్య మండలి జిల్లా అధ్యక్షులు ఎం.రాజేష్‌, నాయకులు ఎం.మహేష్‌ బాబు, బి.అప్పలరాజు, కె.కాశీ, ఎం.జాన్‌, ఎం.బాపూజీ, అంజి, అప్పలరాజు, వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు.
తగరపువలసలో ప్రజాసంఘాల ప్రచారం
తగరపువలస : ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పిడిఎఫ్‌ అభ్యర్థి డాక్టర్‌ కోరెడ్ల రమాప్రభను గెలిపించాలని కోరుతూ బుధవారం స్థానిక ప్రజాసంఘాల ప్రతినిధులు తగరపువలసలోని పలు ప్రాంతాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. పట్టభద్రుల ఓటర్లను కలిసి, కరపత్రాలను అందజేసి, రమాప్రభకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ప్రచారంలో సిఐటియు నాయకులు రవ్వ నరసింగరావు, ఎస్‌.శ్రీనివాసవర్మ, సోమి వెంకట్‌ తదితరులు పాల్గొన్నారు.
అచ్యుతాపురం:ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గ పిడిఎఫ్‌ అభ్యర్థిగా పోటీ చేయుచున్న కోరెడ్ల రమాప్రభకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని కోరుతూ మండలంలోని హరిపాలెం గ్రామంలో బుధవారం సాయంత్రం ప్రజాసంఘాల ప్రతినిధులు ఇంటింటి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా పట్టభద్రులను కలిసి రమాప్రభకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల ప్రతినిధులు కె. రామసవాశివరావు ఎస్‌ కనుమునాయుడు, ఎం సూర్య రామ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.
అచ్యుతాపురంలో...
పిడిఎఫ్‌ అభ్యర్థి కోరెడ్ల రమాప్రభకు మద్దతుగా బుధవారం అచ్చుతాపురంలో సిఐటియు మండల కార్యదర్శి కె సోమ నాయుడు ఆధ్వర్యాన విస్తృతంగా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా వ్యాపారులను నిరుద్యోగులను ఉద్యోగులను కార్మికులను కలిశారు. పిడిఎఫ్‌ బలపరిచిన రమాప్రభకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు.
డుంబ్రిగూడ:ఉత్తరాంధ్ర పట్టబద్రుల పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి కోరెడ్ల రమాప్రభకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరుతూ గిరిజన సంఘం, సిఐటియు ఆధ్వర్యంలో బుధవారం మండలంలోని అరకు పంచాయతీలో ప్రచారం నిర్వహించారు. సిఐటియు జిల్లా అధ్యక్షుడు ఎస్‌బి పోతురాజు, గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు టి.సూర్యనారాయణ మాట్లాడుతూ, ప్రజా సమస్యలపై శాసనమండలిలో గొంతిత్తి ప్రశ్నించే పిడిఎఫ్‌ అభ్యర్థులకు ఓటేసి గెలిపించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు పి.సురేష్‌ కుమార్‌, పి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.