ప్రజాశక్తి -యంత్రాంగం
ఉక్కునగరం: డాక్టర్ కోరెడ్ల రమాప్రభను గెలిపించాలని స్టీల్ సిఐటియు గౌరవాధ్యక్షులు జె.అయోధ్యరామ్ పిలుపునిచ్చారు. స్టీల్ సిఐటియు అధ్యక్షులు వైటి.దాస్ అధ్యక్షతన ప్లాంట్‌లోని సిఎంఎస్ గేథరింగ్ పాయింట్ వద్ద ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అయోధ్యరామ్ మాట్లాడుతూ, రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు తమ రాజకీయ అవసరాల కోసం పరిమితంగా విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాటానికి మద్దతు ఇస్తున్నాయని తెలిపారు. పోస్కోకు వ్యతిరేకంగా చలో అమరావతి పేరుతో సుమారు 2000 మంది ఉక్కు కార్మికులు ధర్నా నిర్వహిస్తే స్థానిక శాసన సభ్యులు, స్థానిక శాసనమండలి సభ్యులు పాల్గొనలేదని, పిడిఎఫ్ ఎమ్మెల్సీలు మాత్రం నేరుగా అసెంబ్లీ నుంచి విచ్చేసి తమ సంఘీభావాన్ని తెలియజేశారని గుర్తు చేశారు. కనుక స్టీల్‌ప్లాంట్‌కు కష్టం వస్తే కార్మికులతో కలిసి ఉద్యమాలతో ప్రభుత్వంపై ఒత్తిడి చేసే అభ్యర్థులను గెలిపించుకోవడం మనందరి ప్రధాన కర్తవ్యం అని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్టీల్ సిఐటియు ప్రధాన కార్యదర్శి యు రామస్వామి, వర్కింగ్ ప్రెసిడెంట్ పి.శ్రీనివాసరాజు, నాయకులు డి.కృష్ణమూర్తి, నీలకంఠం, యు.వెంకటేశ్వర్లు, కెవి.సత్యనారాయణ, మొహిద్దిన్, సూర్యనారాయణ, డి.సత్యనారాయణ, డిఎస్‌ఆర్‌సి.మూర్తి, వీరాస్వామి, రాజు, శ్రీరామచంద్రమూర్తి, డి.శ్రీనివాసరావు, వి.ప్రసాద్, ముత్యాలనాయుడు తదితరులు పాల్గొన్నారు.
ఆరిలోవ : ఉత్తరాంధ్ర సమస్యలపై మంచి పట్టు ఉండి, ప్రజా గొంతును వినిపించే డాక్టర్ కోరెడ్ల రమాప్రభను ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపించాలని కోరుతూ శనివారం సిపిఎం, ప్రజా సంఘాల నాయకులు ప్రచారం నిర్వహించారు. 13వ వార్డు పరిధి పైనాపిల్ కాలనీ, ఎస్‌ఎస్‌ఎన్ నగర్, రామకృష్ణాపురంలో పట్టభద్రుల ఓటర్ల వద్దకు వెళ్లి కరపత్రాలు అందజేస్తూ కోరెడ్ల రమాప్రభకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వి.నరేంద్రకుమార్, ఐసి.నాయుడు, వి.కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
అచ్యుతాపురం:కోరెడ్ల రమాప్రభను గెలిపించాలని కోరుతూ శనివారం అచ్యుతాపురంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఆర్. రాము, మండల కార్యదర్శి కె సోమినాయుడు ప్రమాచారం చేశారు. ఈ సందర్భంగా గ్రామాల్లో ఓటర్లకు కరపత్రాలు పంపిణీ చేశారు. కోరెడ్ల రమాప్రభకు తొలి ప్రాధాన్యత ఓట్లు వేసి గెలిపించాలని కోరారు.
ముంచింగిపుట్టు:ఉత్తరాంధ్ర పట్టభద్రుల పిడిఎఫ్ అభ్యర్థి కోరెడ్ల రమప్రభకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కె.నర్సయ్య ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. మండల కేంద్రంలో శనివారం గిరిజన సంఘం, భాష వాలంటీర్ల సంఘం నాయకులు, యువతతో కలిసి పిడిఎఫ్ అభ్యర్థి పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. అనంతరం కె.నర్సయ్య, మండల వైస్ ఎంపీపీ-1 పి.సత్యనారాయణ లు మాట్లాడుతూ, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, ప్రజా సమస్యలపై శాసన మండలిలో గొంతు వినిపించాలంటే 250 ప్రజా సంఘాలు బలపర్చిన కోరెడ్ల రమాప్రభకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో లక్ష్మిపురం సర్పంచ్ కె.త్రినాధ్, గిరిజన సంఘం నాయకులు పి.భీమరాజు, పి.రాందాస్, దోంబ్రు పాల్గొన్నారు.
మాకవరపాలెం: ఉత్తరాంధ్ర పట్టభద్రుల పీడిఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థిని కోరెడ్ల రమాప్రభకు మద్దతుగా మండలంలోని కొండల అగ్రహారంలో బహుజన ఐక్యవేదిక కన్వీనర్ బొట్టా నాగరాజు ప్రచారం చేశారు. కోరెడ్ల రమాప్రభకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల పక్షాన ప్రశ్నించే వ్యక్తినే పార్టీలకు అతీతంగా ఎన్నుకోవాలని ఈ సందర్బంగా ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అప్పలనాయుడు, చందర్రావు, ప్రసాద్ పాల్గొన్నారు.










