
అమ్మోనియా గ్యాస్ లీకేజీపై విచారణ
ప్రజాశక్తి - కాళ్ల
సిఎంఒ కార్యాలయం, జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి ఆదేశాల మేరకు అధికారులు హుటాహుటీన కోపల్లె గ్రామంలో అమ్మోనియా గ్యాస్ లీకైన ప్రాంతాన్ని శనివారం పరిశీలించారు. కోపల్లెలో శుక్రవారం ప్రభు ఐస్ ఫ్యాక్టరీలో అమ్మోనియా గ్యాస్ లీకై పక్కన ఉన్న ఆర్‌విఆర్ రొయ్యల ఫ్యాక్టరీలో మహిళా కార్మికులు అస్వస్థతకు గురైన విషయం విదితమే. రెవెన్యూ, కార్మిక, వైద్య, పోలీస్, పరిశ్రమలు, పొల్యూషన్ శాఖ అధికారుల బృందం శనివారం సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆర్‌డిఒ దాసి రాజు అధ్యక్షతన ఫ్యాక్టరీలో ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఐస్ ఫ్యాక్టరీ యజమాని సత్యనారాయణకు చెందిన ఫ్యాక్టరీతో పాటు ఇతర ఆస్తులు కూడా ఎన్ఫోర్స్మెంట్ ఆధీనంలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఐస్ ఫ్యాక్టరీ నాలుగేళ్లుగా సరిగ్గా పనిచేయడం లేదని, రెండేళ్ల క్రితం మూసివేశారని తెలిపారు. అయితే శుక్రవారం ఫ్యాక్టరీలో ఉన్న కంప్రెసర్‌ను తొలగిస్తుండగా అమ్మోనియా గ్యాస్ లీకై 10 మంది మహిళా కార్మికులు అస్వస్థతకు గురయ్యారని, ప్రథమ చికిత్స అందించగా వారిలో ఆరుగురు కోలుకోగా, నలుగురు చికిత్స పొందుతున్నారని తెలిపారు. మహిళా కార్మికులంతా ఒరిస్సా రాష్ట్రానికి చెందినవారని, ఐస్ ఫ్యాక్టరీ క్లోజింగ్ సర్టిఫికెట్ ఇచ్చారా లేదా అనేది పరిశీలించాల్సి ఉందని తెలిపారు. ఈ ఘటనపై పూర్తి విచారణ చేసి జిల్లా కలెక్టర్‌కు నివేదిక అందిస్తామని తెలిపారు. ఆర్‌డిఒ దాసి రాజు మాట్లాడుతూ కాళ్ల మండలంలో ఐస్ ఫ్యాక్టరీలు, రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్లు ఎక్కువగా ఉన్నాయని, యజమానులు అమ్మోనియా గ్యాస్ పరిస్థితిని పరిశీలించాలని తెలిపారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఫ్యాక్టరీ యజమానులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల తనిఖీ శాఖల అధికారి రామకృష్ణారెడ్డి, ఏలూరు ఉప కమిషనర్ ఆర్.త్రినాధరావు, జిల్లా కార్మిక శాఖ అధికారి ఎ.లక్ష్మి, డిఎస్‌పి బి.శ్రీనాథ్, కాళ్ల పిహెచ్‌సి డాక్టర్ గులాబ్ రాజ్ కుమార్ పాల్గొన్నారు.