Oct 04,2023 00:44

వేడుకల్లో పాల్గొన్న ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే మహేష్‌రెడ్డి

ప్రజాశక్తి-పిడుగురాళ్ల : సచివాలయ వ్యవస్థ 4వ ఆవిర్భావ దినోత్సవాలను ఆంధ్రప్రదేశ్‌ గ్రామ, వార్డు సచివాలయ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో మండలంలోని కోనంకిలో మంగళవారం నిర్వహించారు. సంఘం రాష్ట్ర అధ్యక్షులు షేక్‌ అబ్దుల్‌ రజాక్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి హాజరై కేక్‌ను కట్‌ చేశారు. ఎంపీ మాట్లాడుతూ గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్య స్థాపన లక్ష్యంగా సచివాలయ వ్యవస్థను జగన్‌మోహన్‌రెడ్డి తెచ్చారన్నారు. ఇప్పటికీ నాలుగు కోట్లకు పైగా సర్వీసులు ప్రజలకు అందించిందని, మున్ముందు మరింత మందికి సేవ చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలోని సచివాలయ వ్యవస్థ నేడు దేశానికి ఆదర్శమైందని, ఇతర రాష్ట్రాలోనూ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. కరోనా కాలంలోనూ సచివాలయ ఉద్యోగులు చేసిన కృషి మరువలేనిదన్నారు. షేక్‌ అబ్దుల్‌ రజాక్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి లక్ష 30 వేల మందికి పైగా శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించారని తెలిపారు. రాబోయే రోజుల్లో సచివాలయ వ్యవస్థ మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో మండల అభివృద్ధి కమిటీ చైర్మన్‌ ఎం.వెంకటేశ్వరరెడ్డి, మాజీ జెడ్‌పిటిసి వి.రామిరెడ్డి, నాయకులు, ప్రజాప్రతినిధులు జి.పవన్‌రెడ్డి, మహేష్‌, ప్రభాకర్‌, అశోక్‌, గురవయ్య, రాజశేఖర్‌, ఉమమహేష్‌, అయప్పరెడ్డి, లక్ష్మణ, నాగభూషణం, వెంకటరెడ్డి, మల్లేశ్వరి, ఉషారాణి, వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.