May 02,2023 00:33
మట్టి తోలకాలతో బురదమయంగా మారిన రహదారి

ప్రజాశక్తి-భట్టిప్రోలు: మండలంలోని కోనేటిపురం గ్రామంలో ఎలాంటి అనుమతులు లేకుండా పంచాయతీ చెరువులో అధికార పార్టీ నాయకులు అక్రమ మట్టి తవ్వకాలకు పూనుకున్నారు. సుమారు 4 ఎకరాలకు పైగా ఉన్న ఈ చెరువులో దాదాపు రెండు నుంచి మూడు మీటర్ల లోతున జేసిబిలతో మట్టి తవ్వకాలు చేపట్టి అక్రమార్జన కు పాల్పడుతున్నారు. గత మూడు రోజులు జరుగుతున్న ఈ అక్రమ తవ్వకాలతో గ్రామంలో రహదార్లు ఛిద్రమయ్యాయి. సోమవారం కురిసిన వర్షానికి గ్రామ ప్రధాన రహదారి బురదమయంగా మారి గ్రామస్థుల రాకపోకల కు తీవ్ర అంతరాయంగా మారింది. ఏమాత్రం వాహనదార్లు ఆదమరిచినా వాహనాలు జర్రునజారి కిందపడి గాయాల పాలవుతున్నా రని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మట్టి తవ్వకాలకు మైనింగ్‌, రెవెన్యూ, పంచాయతీ అనుమతి పొందాల్సివుంది. కానీ ఎలాంటి అనుమతులు లేకుండానే అధికారులకు ముడుపులు చెల్లించి యథేచ్ఛగా అక్రమ తవ్వకాలు చేస్తున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. నిత్యం ఈ చెరువులో పశువులు నీరు తాగుతూ సేదదీరుతూ ఉంటాయని, మీటర్ల కొద్దీ లోతుగా తవ్వటంతో ప్రమాదాలు పొంచి ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మట్టిని జగనన్న కాలనీకి తోలాలనే పేరుతో చెరువులో చేపట్టిన తవ్వకాలతో ఎక్కడా కాలనీకి ట్రక్కు మట్టిని తోలకుండానే దాదాపు వెయ్యి ట్రక్కులకు పైగా అక్రమంగా అమ్ముకున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ అక్రమ మట్టి తవ్వకాలలో అధికార పార్టీకి చెందిన మండల, నియోజకవర్గ స్థాయి నాయకులు తెర వెనుక ఉండి నడిపిస్తున్నట్లు అనుమానం వ్యక్తం అవుతోంది. దీని కారణంగానే యథేచ్ఛగా సాగుతున్న ఈ తవ్వకాల వైపు అటు పోలీస్‌ యంత్రాంగం కానీ, రెవెన్యూ, మైనింగ్‌ అధికారులు గాని కన్నెత్తి చూడటం లేదని గ్రామస్థుల నుంచి బలంగా వినిపిస్తుంది. ఇప్పటికయినా ఉన్నతాధికారులు స్పందించి అక్రమ తవ్వకాలపై చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.