Sep 21,2023 23:57

సమావేశంలో మాట్లాడుతున్న శివనాగరాణి

ప్రజాశక్తి-తాడేపల్లి : రాష్ట్ర ప్రభుత్వానికి ఎస్సీ, ఎస్టీల పట్ల చిత్తశుద్ధి ఉంటే కోనేరు రంగారావు సిఫార్సులను అమలు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహిళా కన్వీనర్‌ వి.శివనాగరాణి డిమాండ్‌ చేశారు. వ్యవసాయ కార్మిక సంఘం, కెవిపిఎస్‌, సిఐటియు, గిరిజన సంఘం ఆధ్వర్యంలో గురువారం ప్రకాష్‌నగర్‌లోని సిఐటియు కార్యాలయంలో రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించారు. సమావేశానికి గిరిజన సంఘం నాయకులు కె.వెంకటయ్య అధ్యక్షత వహించారు. నాయకలు మాట్లాడుతూ ఎస్‌సి, ఎస్‌టి సబ్‌ప్లాన్‌ చట్టం ప్రకారం బడ్జెలో పక్కదారి పట్టించిన నిధులను తిరిగి వారికే కేటాయించాలని కోరారు. 45 ఏళ్లు దాటిన డప్పు కళాకారులు, చర్మకారులకు పెన్షన్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అర్హులైన ప్రతి దళిత కుటుంబానికి 3 సెంట్ల ఇంటి స్థలం, రెండెకరాలు సాగు భూమి, పక్కా గృహానికి రూ.5 లక్షలు కేటాయించాలని కోరారు. భూస్వాములకు అనుకూలంగా తెచ్చిన అసైన్డ్‌ చట్టాన్ని ఉపసంహరించుకోవాలన్నారు. రాయలసీమ జిల్లాల్లో శ్మశానాల్లో పని చేస్తున్న కార్మికులను నాల్గో తరగతి ఉద్యోగులుగా గుర్తించాలన్నారు. జస్టిస్‌ పున్నయ్య కమిషన్‌ సిఫార్సులను అమలు చేయాలని, ఉచిత విద్యుత్‌ను 300 యూనిట్లకు పెంచాలని కోరారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మనువాద రాజ్యాంగం అమలుకు చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలన్నారు. రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి దళిత, గిరిజనులు కదలిరావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం గుంటూరు జిల్లా కార్యదర్శి ఇ.అప్పారావు, వివిధ ప్రజా సంఘాల నాయకులు బి.వెంకటేశ్వర్లు, కె.కరుణాకరరావు, వి.దుర్గారావు, ఇ.శాస్త్రి, ఎన్‌.దుర్గారావు, ఎం.చినచెన్నయ్య, టి.వెంకటయ్య పాల్గొన్నారు.