ప్రజాశక్తి-బాపట్ల: ఎవరు వద్దన్నా .. ఎవరు కాదన్నా.. ఎందరు అడ్డుపడినా చీలు రోడ్డు సెంటర్‌కు కోన ప్రభాకర్‌రావు విగ్రహం ఏర్పాటు చేసి కోన ప్రభాకరరావు సర్కిల్‌గా నామకరణం చేసి తీరుతామని బాపట్ల శాసనసభ్యులు కోన రఘుపతి ఘాటుగా వ్యాఖ్యానించారు. సోమవారం దివంగత కోన ప్రభాకరరావు 107వ జయంతి సందర్భంగా బాపట్ల పాత బస్టాండ్ సెంటర్లో కోన ప్రభాకర్‌రావు విగ్రహానికి నివాళులు అర్పించిన అనంతరం ఎమ్మెల్యే కోన మాట్లాడారు. 21 యేళ్ల రాజకీయ జీవితంలో నాకు భయమంటే తెలియదు. మరొక్కసారి కోన గెలుపు బాపట్లకు చాలా అవసరం. మొక్కుకునేవారు రెండు కొబ్బరికాయలు కొట్టండి. ఒకటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కోసం, రెండు బాపట్లలో రఘుపతి గెలవాలని అన్నారు. ఏదైనా సమస్య ఎదురైన ప్పుడు ఏనాడూ వెనకడుగు వేయలేదని విగ్రహ రాజకీయా లపై ఘాటుగా స్పందించారు. మాజీ గవర్నర్, బహుముఖ ప్రజ్ఞాశాలి కోన ప్రభాకర్‌రావు విగ్రహ రాజకీయాల కోసం చిల్లర రాజకీయ చేష్టలు చేస్తున్న వారిపై నిప్పులు చెరిగారు. నేను నా వెనక నా కులం ఉందని అదిరిపడే వాడిని కాదు. డబ్బుందని ఎగసిపడేవాడిని కాదు. బాపట్ల జిల్లా చేసుకోవా లని ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చాను. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి దయవలన బాపట్ల జిల్లా అయింది. అన్ని జిల్లా కేంద్రాల కంటే మిన్నగా బాపట్లని అభివృద్ధి చేయాలని ఎంతో కష్టపడుతున్నా. రహదారుల మధ్యలో ఉన్న విగ్రహాలను తొలగించకుండా ఒక అద్భుతమైన సర్కిల్‌గా మాత్రమే ఏర్పాటు చేస్తున్నాం. 2014లో 6వేల ఓట్ల మెజార్టీతో గెలిచాను. 2019లో బాపట్ల నియోజకవర్గ ప్రజలు 16 వేల ఓట్ల మెజార్టీతో నన్ను గెలిపించారు. ఎక్కడ ఏది పెట్టాలో మిమ్మల్ని అడిగి చేయాలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 'బాపట్లకు ఏది మంచో.. ఏది చెడు నాకు బాగా తెలుసు' అని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి ఏ విధంగా పాటుపడుతున్నారో, బాపట్ల ప్రయోజనాల కోసం, అభివృద్ధి కోసం ఆయన సారథ్యంలో నేను అంతగానే పాటుపడుతున్నాను. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి సహకారంతో బాపట్ల నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుంటామని అన్నారు. కార్యక్రమంలో జోగి రాజా, చేజర్ల నారాయణరెడ్డి, అవినాష్ నాయుడు, మాల్యాద్రి, జాలిరెడ్డి, చల్లా రామయ్య పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.










