Apr 06,2023 23:45
చీరాల ముక్కోణపు పార్క్‌ సెంటర్లో నిరసన తెలియజేస్తున్న దళిత కులాల ఐక్యవేదిక నాయకులు

ప్రజాశక్తి-చీరాల: బాపట్ల పార్లమెంటరీ నియోజకవర్గం ఎస్సీ రిజర్వుడు స్థానం అవ్వడం దురదృష్టకరమని బాపట్ల శాసనసభ్యులు కోన రఘుపతి వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా మని దళిత కులాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు పులిపాటి రాజు అన్నారు. బాపట్లలో ఉన్న అంబేద్కర్‌ విగ్రహం కాళ్లకు మొక్కి కోన రఘుపతి దళితులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. గురువారం స్థానిక ముక్కోణం పార్కు సెంటర్‌లో దళిత కులాల ఐక్యవేదిక, వివిధ సంఘాల నాయకుల ఆధ్వర్యంలో బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి వ్యాఖ్యలను ఖండిస్తూ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దళిత ఓట్లతో గెలిచానని చెప్పుకుంటున్న వైసిపి అధికారం లోకి వచ్చినప్పటి నుంచి నేటి వరకు దళితులపై అనేక రకాలుగా భౌతికంగా, ఆర్థికంగా, మానసికంగా దాడులు చేస్తూనే ఉన్నారని అన్నారు. గెలవటానికి, పార్టీలు అధికారంలోకి రావటానికి దళితుల ఓట్లు కావాలి కానీ దళితులకు మాత్రం ప్రత్యేకంగా నియోజకవర్గాలు ఉండ టాన్ని సహించలేకపోవడం అగ్రకుల దురహంకారానికి నిదర్శనమని అన్నారు. కాబట్టి వెంటనే కోన రఘుపతి బాపట్లలో ఉన్న అంబేద్కర్‌ విగ్రహం కాళ్లకు మొక్కి దళితులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని పేర్కొన్నారు. ఎస్సీ ఎస్టీలను అవమానపరిచిన కోన రఘుపతిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో దళిత మహాసభ నాయకులు మాచవరపు జూలియన్‌, దుడ్డు విజరు, సుందర్‌, ఎస్కే మౌలాలి, ఉమా మహేష్‌, పైడి రమేష్‌, రత్నబాబు తదితరులు పాల్గొన్నారు.
బాపట్ల: బాపట్ల పార్లమెంట్‌ను ఎస్‌సి రిజర్వుడుగా చేయడం చారిత్రాత్మక తప్పిదమని అహంకారపూరిత వ్యాఖ్యలు చేసిన బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి తక్షణమే ఆ వ్యాఖ్యలను వెనక్కు తీసుకొని దళిత జాతికి క్షమాపణలు చెప్పాలని టిడిపి ఎస్సీ సెల్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్‌ ఆధ్వర్యంలో గురువారం బాపట్లలో అంబేద్కర్‌ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. బాపట్ల నియోజకవర్గంలో దళితుల ఓట్లతో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కోన రఘుపతి పదవి అహంకారంతో ఆ దళితులనే అవమానించే విధంగా మాట్లాడటం సిగ్గుచేటన్నారు. దళితులకు చట్టసభల్లో పోటీ చేసే అర్హత లేదా అని ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో దళితులే ఆ అహంకారాన్ని తుదముట్టిస్తారని గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు. దళితులకు కోన రఘుపతి వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు.
అద్దంకి: బాపట్ల పార్లమెంటును ఎస్సీ రిజర్వుడు చేయడం చారిత్రక తప్పిదమని బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి చేసిన వ్యాఖ్యలను బిఎస్‌పి అద్దంకి నియోజకవర్గ అధ్యక్షులు మంద జోసెఫ్‌ తీవ్రంగా ఖండించారు. గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. అనంతరం మంద జోసెఫ్‌ మాట్లాడుతూ దళిత ఓట్లతో గెలిచిన కోన రఘుపతి నేడు వారినే అవమానించేటట్లు మాట్లాడటం సరికాదన్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి అలా బాధ్యత లేకుండా మాట్లాడటం సరికాదన్నారు. దళిత జాతికి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. లేకపోతే పెద్దఎత్తున ఉద్యమం చేస్తామన్నారు. రాబోయే ఎన్నికల్లో కోన రఘుపతికి దళితులు తగిన బుద్ధి చెబుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.