
విజయనగరం కోట, గరివిడి: రైలు ప్రమాద బాధితులకు జీవితాంతం ఉపాధి కల్పించేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మానవతా దృక్పథంతో సహాయం ప్రకటించారని, సహాయాన్ని గురువారంలోగా బాధిత కుటుంబాలకు అందజేస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. కంటకాపల్లి రైలు ప్రమాద దుర్ఘటనలో గాయపడి స్థానిక ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులకు ప్రభుత్వం ప్రకటించిన పరిహారాన్ని మంత్రి బొత్స సత్యనారాయణ బుధవారం చెక్కుల రూపంలో అందజేశారు. ఆసుపత్రిలోని వార్డుల్లో చికిత్స పొందుతున్న బాధితుల వద్దకు వెళ్లి మంత్రి బొత్స పరామర్శించారు. వారికి అందుతున్న చికిత్స వారి కుటుంబ పరిస్థితులు తెలుసుకొని వారికి ప్రభుత్వం అండగా వుంటుందని ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అందజేసిన పరిహారాన్ని చెక్కు రూపంలో అందజేసి వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆయా వార్డుల్లో చికిత్స పొందుతున్న రైలు ప్రమాద బాధితుల ఆరోగ్య పరిస్థితిపై నిరంతరం పర్యవేక్షణ చేయాలని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి ప్రకటించిన మేరకు రైలు ప్రమాద దుర్ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల వంతున 13 మంది మృతుల కుటుంబాలకు రూ.1.30 కోట్లు పరిహారంగా అందజేస్తున్నామన్నారు. ప్రమాదంలో గాయపడిన 30 మందికి రూ.1.29కోట్లు పరిహారం అందిస్తున్నట్టు మంత్రి వెల్లడించారు. ప్రమాదంలో గాయపడి, శాశ్వత అంగవైకల్యానికి గురైన వారికి రూ.10 లక్షలు సహాయం అందిస్తున్నట్టు సిఎం ప్రకటించారని, ఆ మేరకు ముగ్గురికి రూ.10 లక్షల వంతున రూ.30 లక్షలు అందజేశామన్నారు. నెలరోజులకు పైగా ఆసుపత్రిలో చికిత్స అవసరమైన వారికి రూ.5 లక్షల పరిహారం చొప్పున 15 మందికి రూ.75 లక్షలు ఇచ్చామన్నారు. నెల రోజుల్లోపల ఆసుపత్రిలో చికిత్స పూర్తిచేసుకొని డిశ్చార్చి అయ్యే వారికి రూ.2 లక్షలు చొప్పున 12 మందికి రూ.24 లక్షలు సహాయం అందించామన్నారు. గరివిడి మండలంలో మృతి చెందిన నలుగురి కుటుంబ సభ్యులకు ఆ మండల కేంద్రంలో పరిహారం అందించారు. కార్యక్రమంలో జిల్లాపరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎంపి బెల్లాన చంద్రశేఖర్, ఎంఎల్‌సి సురేష్ బాబు, జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి, జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, డిసిహెచ్‌ఎస్ బి.గౌరీశంకర్, డిఎంహెచ్‌ఒ డాక్టర్ భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.