ప్రజాశక్తి - నందవరం
చేనేత కార్మికుల కోసం వెంటనే కోడుమూరులో చేనేత బోర్డును ఏర్పాటు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి డి.గౌస్ దేశాయి డిమాండ్ చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో గద్వాల కేంద్రంగా చేనేత కార్మికులకు ఉపాధి కల్పించే అవకాశం ఉండదని, రాష్ట్రం విడిపోయిన తర్వాత కార్మికులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. బుధవారం నాగలదిన్నె గ్రామంలో చేనేత కుటుంబాల జీవన స్థితిగతుల గురించి సిపిఎం బృందం పర్యటించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో గద్వాల కేంద్ర బోర్డుపై పని చేసిన అక్కడి యాజమాన్యం బెంగళూరులో నూతన టెక్నాలజీతో మార్కెట్లలోకి చీరలను తీసుకొచ్చిందని తెలిపారు. ఎమ్మిగనూరు, కర్నూలు, కోడుమూరు, నాగలదిన్నె, గోనెగండ్లలో పని చేసే కార్మికుల పని దినాలు తగ్గి ఆర్థికంగా కుదేలయ్యారని చెప్పారు. ఒక్క నాగలదిన్నె గ్రామంలోనే 370 చేనేత కుటుంబాలు ఉన్నాయని తెలిపారు. ఆ కుటుంబాలకు సరైన సమయంలో ముడి సరుకు అందించకపోవడంతో పనులు లేక వలస వెళ్లే పరిస్థితి నెలకొందన్నారు. రోజూ కష్టపడినా కేవలం రూ.150లు మాత్రమే సంపాదించే పరిస్థితి ఉందని తెలిపారు. ఆర్థిక ఇబ్బందులతో దుర్భర జీవితాలను గడపాల్సిన పరిస్థితి నెలకొందని చెప్పారు. ప్రభుత్వాలు మారినా చేనేతల జీవితాలు మాత్రం మారడం లేదని తెలిపారు. ప్రస్తుత వైసిపి ప్రభుత్వం రూ.24 వేలు ఆర్థిక సహాయం అందించినా చేనేత కార్మికులకు ఎక్కడికి సరిపోవని, అప్పు తెచ్చుకొని జీవనం గడపాల్సిన పరిస్థితి ఉందని చెప్పారు. చేనేతలను ఆర్థికంగా ఆదుకోవడమే కాకుండా ముడి సరుకును తక్కువ ధరకు అందించి చేనేతల అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. చేనేతలకు సరైన ధర లేకపోవడంతో చేనేత వృత్తిని వదిలి, దూర ప్రాంతాలకు వలస వెళ్తున్నారన్నారు. చేనేతలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కోడుమూరు కేంద్రంగా చేనేత బోర్డును ఏర్పాటు చేసి, చేనేత కార్మికులకు నెలకు కనీస వేతనాలు అందించాలని డిమాండ్ చేశారు. సిపిఎం నాయకులు గురు శేఖర్, హనుమంతు, దేవపుత్ర, చేనేత సంఘం నాయకులు ఎల్లేష్ పాల్గొన్నారు.
40 మంది వీర జవాన్ల మృతదేహాలపై రాజకీయాలు చేసిన వారా దేశభక్తులు : సిపిఎం
2019లో పుల్వామాలో వీర జవాన్ల మృతదేహాలపై రాజకీయం చేసి లబ్ధి పొందిన బిజెపి, దేశ ప్రధాని నరేంద్ర మోడీ దేశభక్తులా అని సిపిఎం జిల్లా కార్యదర్శి డి.గౌస్ దేశాయి ప్రశ్నించారు. బిజెపి విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా వామపక్షాలు ప్రచార భేరి ఉద్యమాన్ని చేపట్టాయన్నారు. బుధవారం నందవరం మండలం నాగలదిన్నె గ్రామంలో సిపిఎం మండల నాయకులు దేవపుత్ర అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కేంద్రంలో నరేంద్ర మోడీ అనుసరిస్తున్న విధానాలపై విసిగి వేసారిన ప్రజలు బిజెపి ప్రభుత్వాన్ని గద్దె దించాలని పోరాటాలు చేస్తున్నారని తెలిపారు. పుల్వామాలో ఉగ్రవాదుల దాడిలో 40 మంది జవాన్లు చనిపోయిన తర్వాత పాకిస్తానీ బూచి చూపించి పాకిస్థాన్‌ను తరిమికొట్టాలంటే బిజెపి లాంటి పార్టీ అవసరమని ప్రజలను నమ్మించి ఎన్నికల లబ్ధి పొందిన నరేంద్ర మోడీ అసలు రంగు బయటపడిందని విమర్శించారు. ప్రస్తుతం జమ్మూకాశ్మీర్ గవర్నర్‌గా ఉన్న సత్యపాల్ మాలిక్ 'ద వైర్'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా స్పష్టంగా పుల్వామా ఘటనకు కారకులు బిజెపి ప్రభుత్వం, నరేంద్ర మోడీ అని కుండలు బద్ధలు కొట్టినట్టు స్పష్టం చేశారన్నారు. ఉగ్రవాదుల దాడులు జరుగుతాయని తెలిసి కూడా పెద్ద సంఖ్యలో సైనికులను రోడ్డు మార్గం ద్వారా పంపడం ప్రభుత్వం చేసిన నేరమని మాలిక్ తెలిపారని వివరించారు. ఆ రోజు సైనికులు విమానాలను సిద్ధం చేయాలని చెప్పినా హోం మంత్రిత్వ శాఖ నిర్ద్వంద్వంగా తిరస్కరించిందని చెప్పారు. రోడ్డు మార్గం ద్వారానే పోయేలాగా చేసి ఉగ్రవాదుల దాడుల్లో 40 మంది బలి కావడానికి కేంద్ర ప్రభుత్వం కారణమైందని విమర్శించారు. ఇలాంటి ద్రోహానికి పాల్పడిన బిజెపికి దేశంలో పరిపాలన చేసే హక్కు లేదని, బిజెపిని గద్దె దించడానికి ప్రజలు సిద్ధం కావాలని, బిజెపిని తరిమికొట్టాలని కోరారు. సత్యపాల్ మాలికే కాదు సైనిక ప్రధాన ఉన్నతాధికారిగా రిటైర్డ్ అయిన వ్యక్తి ఆ ఘటనకు కేంద్ర ప్రభుత్వమే కారణమని స్పష్టం చేశారని తెలిపారు. ఇప్పటికే కులం, మతం పేరుతో బిజెపి ప్రజలపై దాడులు చేస్తోందని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతున్న బిజెపి, కార్మికులు, రైతుల హక్కులను కాలరాస్తున్న బిజెపి, జర్నలిస్టులపైనా, రచయితలపైనా దాడులు చేస్తున్న బిజెపి దేశంలో పాలించే నైతిక హక్కు కోల్పోయిందని తెలిపారు. సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు హనుమంతు, గురుశేఖర్, స్థానిక నాయకులు ఎల్లేష్, స్వామి దాసు, పెద్దయ్య, రవి, కొండన్న, నాగేష్, సంతోష్, శ్రీరాములు, నల్లన్న పాల్గొన్నారు.
చేనేతలతో మాట్లాడుతున్న గౌస్‌దేశాయి










