Oct 29,2022 21:11

          కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పశ్చిమలో సుడిగాలి పర్యటన - మహిళా మంత్రి పర్యటన సాక్షిగా మహిళా నేతల నిర్బంధం
నరసాపురం కోడలు, కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతరామన్‌ పశ్చిమగోదావరి జిల్లాలో సుడిగాలి పర్యటన చేశారు. వీరవాసరం మండలం మత్స్యపురితోపాటు తన దత్తత గ్రామమైన నరసాపురం మండలం పెదమైనవానిలంకలో ఒక రోజు పర్యటించారు. కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి కావడం, నరసాపురం కోడలు కావడంతో హామీల రూపంలో కొత్త పలుకులు ఏమైనా ఆమె నోటి వెంట వెలువడతాయని అంతా ఆశగా ఎదురుచూశారు. అయితే కోడలమ్మ.. అందరినీ నిరాశ పరుస్తూ వడివడిగా తన పర్యటన ముగించుకుని వెనుదిరగడం గమనార్హం.
                 గతంలో మన రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఎన్నికైనప్పుడు కేంద్ర మంత్రిగా నిర్మలా సీతారామన్‌ నరసాపురం మండలంలో పెదమైనవానిలంకను దత్తత తీసుకున్నారు. ఆ సందర్భంగా పలు పనులకు శంకుస్థాపన చేశారు. ఆ పనులన్నింటికీ ఇటీవల ఆమె ప్రారంభోత్సవాలు చేశారు. ఆపై బహిరంగ సభ సైతం నిర్వహించారు. నాటి హామీల్లో ఒకటైన గ్రామం సముద్రపు కోతకు గురికాకుండా రక్షణ గోడ నిర్మాణ పనులకు తాజాగా శంకుస్థాపన చేశారు. కిలోమీటర్‌కు రూ.15 కోట్లు అంచనా వ్యయంతో ఈ పనులు మద్రాసు ఐఐటి సహకారంతో చేపడుతున్నట్లు ఆమె ప్రకటించారు. అయితే ఈ పనులు ఎప్పటిలోగా పూర్తి చేస్తారనే స్పష్టత ఎక్కడా లేదు. ఎందుకంటే ఇప్పటికే సమీపంలోని చినమైనవానిలంక సముద్ర గర్భంలో కలిసిపోయింది. ఆ నేపథ్యంలోనే 2015లో కేంద్ర మంత్రిగా నిర్మలా సీతారామన్‌ రక్షణ గోడ నిర్మిస్తామని సర్వేలు చేయించి ప్రతిపాదనలు తయారు చేయించారు. అయితే తర్వాత కాలంలో ఆమె రాజ్యసభ సభ్యత్వం మన రాష్ట్రం నుంచి కాకుండా వేరే రాష్ట్రం నుంచి ఎన్నిక జరగడం, మంత్రిగా ఆమె తర్వాత కాలంలో ఇక్కడకు రాకపోవడంతో అంతా అటకెక్కినట్లేనని భావించారు. అయితే నాడు శంకుస్థాపన చేసిన పనుల ప్రారంభోత్సవానికి ఏడేళ్ల తర్వాత వచ్చి నాటి హామీల్లో ఒకటైన రక్షణ గోడకు శంకుస్థాపన చేశారు. ఈ నేపథ్యంలో ఈ పనులు ఎప్పుడు ప్రారంభమవుతాయో.. ఎప్పటికి పూర్తయ్యి సముద్రపు కోత నుంచి తమ గ్రామానికి రక్షణ ఏర్పడుతుందోనని గ్రామస్తులు తర్జనభర్జనలు పడుతున్నారు. ఈ సందర్భంగా గ్రామంలో జరిగిన సభలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ గురించి పెద్దఎత్తున ఉపన్యసించారు. అయితే ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉన్న ఆక్వా సాగుకు ఊతం, వ్యవసాయాధారిత పరిశ్రమల స్థాపన, కోటిపల్లి-నరసాపురం రైల్వే లైన్‌, సాగరమాల ప్రాజెక్టులో చేరుస్తామన్న సఖినేటిపల్లి-నరసాపురం నడుమ గోదావరిపై వంతెన నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల అంశం, జాతీయ రహదారుల అభివృద్ధి వంటి పలు అంశాల్లో ఏ ఒక్కటిపైనా కోడలమ్మ కనీస ప్రస్తావన చేయకపోవడం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లావాసులను తీవ్ర నిరాశకు గురి చేసింది. కనీసం మత్స్యకారుల అభ్యున్నతికి ఏమైనా ప్రకటిస్తారని చూసిన ఆ గ్రామస్తులకూ నిరాశే మిగిలింది.
మత్స్యపురిలో కొనసాగిన రాజకీయ రచ్చ
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ పర్యటన సందర్భంగానూ మత్స్యపురిలో రాజకీయ రచ్చ కొనసాగింది. స్థానిక సంస్థల ఎన్నికల నుంచి ఆ గ్రామంలో వైసిపి, జనసేన నడుమ పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. తాజాగా ఆ గ్రామంలో సీతారామన్‌ మంజూరు చేసిన నిధులతో నిర్మించిన ర్యాపిడ్‌ శాండ్‌ వాటర్‌ ఫిల్టర్‌ కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. 2015లోనే ఈ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. తర్వాత కాలంలో పనులు పూర్తయ్యి గ్రామంలో తాగునీటి సరఫరా కూడా ప్రారంభమైంది. అయితే సుమారు ఆరు గ్రామాలకు ఈ పథకాన్ని విస్తరించే అవకాశం ఉంది. అయితే నాటి టిడిపి ప్రభుత్వం, తర్వాత అధికారంలోకి వచ్చిన వైసిపి ప్రభుత్వం ఈ విస్తరణ పనుల గురించి పట్టించుకోలేదు. తాజాగా ఈ పథకం ప్రారంభోత్సవానికి వచ్చిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ పనుల్లో జాప్యంపై ఎంఎల్‌ఎ గ్రంధి శ్రీనివాస్‌పై అసహనం వ్యక్తం చేసినట్లు ప్రచారం పెద్దఎత్తున సాగింది. అలాగే రోడ్లు అధ్వానంగా ఉన్నాయని గ్రామస్తుల ఫిర్యాదుతో ఇదేమిటని ప్రశ్నించినట్లు సమాచారం. అయితే పనులు ప్రారంభించాక నాలుగేళ్లు అధికారంలో ఉన్నది టిడిపి అయితే తమను ప్రశ్నించడం ఏమిటని, జనసేన నేతలు ఇచ్చిన తప్పుడు సమాచారం ఆధారంగా మంత్రి మాట్లాడటం ఏమిటని వైసిపి శ్రేణులు, గ్రంధి అనుయాయులు మండిపడ్డారు. మొత్తానికి మంత్రి పర్యటన ఆ గ్రామంలో వైసిపి, జనసేన నడుమ నెలకొన్న వైరాన్ని మరోసారి బట్టబయలు చేసిందని చెప్పొచ్చు.
మహిళా మంత్రి పర్యటన పేరుతో మహిళా నేతల నిర్బంధం
మహిళా మంత్రి నిర్మలా సీతారామన్‌ పర్యటన నేపథ్యంలో నరసాపురం పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి ప్రజాస్వామిక విలువలను కాలరాశారు. ఐద్వా ఆధార్యన 'అత్యాచారాలు నిరోధించడం ఎలా' అనే అంశంపై స్వర్ణాంధ్ర ఇంజినీరింగ్‌ కళాశాలలో సదస్సు ఆ కళాశాల యాజమాన్య అనుమతితో ఏర్పాటు చేశారు. అదే రోజు నిర్మలా సీతారామన్‌ నరసాపురం పట్టణం మీదుగా వెళ్లి పెదమైనవానిలంకలో పర్యటించనున్నారు. మంత్రి పర్యటన సాగే మార్గానికి, సదస్సు జరిగే ప్రాంతానికి సంబంధం లేదు. సదస్సులో ప్రసంగించేందుకు ఐద్వా రాష్ట్ర కార్యదర్శి రమాదేవి, జిల్లా కార్యదర్శి పూర్ణ, మరో ఇద్దరు నేతలు ప్రజాసంఘాల కార్యాలయం నుంచి కళాశాల వద్దకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. తాము సదస్సు నిర్వహణకు వెళ్తున్నామని చెబుతున్నా వినకుండా, బేనర్‌ చూపినా పట్టించుకోకుండా సిఐ స్థాయి అధికారి కనీసం మాటామంతీ లేకుండా బలవంతంగా నేతలను పోలీసు స్టేషన్‌కు తరలించడం గమనార్హం. ఆపై కళాశాల యాజమాన్యానికి పోలీసు అధికారులు ఫోన్‌ చేసి సదస్సు రద్దు చేయించి ప్రజాస్వామిక హక్కులను కాలరాశారు. అత్యాచార నిందితులను పట్టుకునే విషయంలో తాత్సారం ప్రదర్శించే ఖాకీలు ఆ అత్యాచారాలు జరగకుండా ఎలా నిరోధించాలనే దానిపై విద్యార్థినులను చైతన్యవంతం చేసేందుకు నిర్వహిస్తున్న సదస్సును అడ్డుకోవడం 'ఫ్రెండ్లీ పోలీసు' మాట అటుంచి ఇదేమి పోలీసు అనే చర్చ జరిగే పరిస్థితికి కారణమైంది. ఏదేమైనా ఈ తీరు మారాలంటే మనువాద సిద్ధాంతాన్ని బలపర్చే బిజెపి పాలకుల విధానాలు మారాలి. ఆ దిశగా మహిళలు నడుంబిగించాలని ఈ సంఘటన చెప్పకనే చెబుతోంది.
-విఎస్‌ఎస్‌వి.ప్రసాద్‌