Jan 31,2023 22:48

నేడు పార్లమెంట్‌లో కేంద్ర బడ్జెట్‌
'పోలవరం'కు నిధులిస్తేనే నిర్వాసితులకు మేలు
రైల్వేలైన్లకు నిధుల కేటాయింపులు సంగతేమిటో
కష్టాల కడలిలో ఆక్వా, వ్యవసాయ సాగు
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి

కర్షకుల కన్నీటి వ్యథలు.. వేతన జీవులకు ఆదాయపు పన్ను కష్టాలు.. నిధుల్లేక పోలవరం నిర్వాసితుల పరిహారపు వెతలతోపాటు జిల్లాలోని కేంద్ర విద్యాసంస్థ నిట్‌కు, కొవ్వూరు-భద్రాచలం, కోటిపల్లి-నరసాపురం రైల్వేలైన్లకు నిధుల కేటాయింపునకు సంబంధించి నేడు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్‌లో మోక్షం కలిగేనా అనే టెన్షన్‌ అందరినీ వెంటాడుతోంది. మోడీ సర్కార్‌ ఎనిమిదేళ్లుగా జిల్లాలోని కేంద్ర ప్రాజెక్టులను పట్టించుకోకపోవడంతో పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు తయారయ్యాయి.
పోలవరం నిర్వాసితుల గోడు కేంద్ర ప్రభుత్వానికి ఏమాత్రం పట్టడం లేదు. కేంద్రం ఆధ్వర్యంలో నడిచే పోలవరం ప్రాజెక్టు జిల్లాలోనే నిర్మితమవుతోంది. దీనికి పూర్తిస్థాయిలో నిధులు కేంద్రమే ఇస్తుందని రాష్ట్రవిభజన చట్టంలో సైతం పొందుపర్చారు. కేంద్రం మాత్రం పోలవరం ప్రాజెక్టుకు పూర్తిస్థాయిలో నిధులు ఇవ్వకుండా ముప్పుతిప్పలు పెడుతోంది. దీంతో నిర్వాసితుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కారణంగా జిల్లాలో పోలవరం, కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోని దాదాపు 126 గ్రామాలను ఖాళీ చేయించాల్సి ఉంది. దీంతో 25,600కుపైగా కుటుంబాలను తరలించాలి. నిర్వాసితులందరికీ ఇళ్లు, భూమికిభూమి, యువతకు పరిహారం, పునరావాస ప్యాకేజీ వంటివి ఇవ్వాల్సి ఉంది. దీంతో పోలవరం నిర్మాణానికి మొత్తం రూ.52 వేల కోట్లు వరకూ ఖర్చు కానున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపించింది. ఇప్పటికీ ప్రతిపాదనలకు ఆమోదం తెలపలేదు. రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన ఖర్చులో ఇంకా రూ.2,400 కోట్లు కేంద్రం నుంచి రాని పరిస్థితి ఏర్పడింది. గడిచిన వర్షాకాలంలో విరుచుకుపడిన గోదావరి వరదలకు ముంపు గ్రామాలన్నీ జలమయమయ్యాయి. నెలలు తరబడి పునరావాస శిబిరాల్లో నిర్వాసితులు తలదాచుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. 45.75 కాంటూరు పరిధి వరకూ నిర్వాసితులకు పరిహారం ఇవ్వాలంటే కేంద్రం నిధులిస్తేనే సాధ్యమని రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. నిర్వాసితులకు పూర్తిస్థాయిలో పరిహారం ఇవ్వాలంటే రూ.30 వేల కోట్లు వరకూ ఖర్చవుతుందని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. బుధవారం పార్టమెంట్‌లో ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్‌లో పోలవరానికి పూర్తిస్థాయిలో నిధులు కేటాయిస్తేనే నిర్వాసితులకు న్యాయం జరుగుతుంది. అంతేకాకుండా వరదల కారణంగా డయాఫ్రం వాల్‌ కోతకు గురై దెబ్బతింది. దీంతో ప్రాజెక్టు పనులు సైతం పడకేశాయి. కేంద్రం పూర్తిస్థాయిలో నిధులు కేటాయించి నిర్వాసితులకు న్యాయం చేయడంతోపాటు ప్రాజెక్టు పూర్తి చేయాల్సి ఉంది. డయాఫ్రంవాల్‌ దెబ్బతినడాన్ని బూచిగా చూపి నిధుల కేటాయింపు నుంచి కేంద్రం తప్పించుకునే అవకాశం ఉందనే వాదనతో సర్వత్రా టెన్షన్‌ నెలకొంది.
'నిట్‌'కు నిధులిచ్చేనా..?
రాష్ట్ర విభజన తర్వాత కేంద్ర విద్యాసంస్థ నిట్‌ (నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ)ను తాడేపల్లిగూడెంలో నిర్మించారు. నిట్‌కు సంబంధించి ఇప్పటి వరకూ ఫేజ్‌-1 పనులు మాత్రమే పూర్తయ్యాయి. ఫేజ్‌-2 పనులకు సంబంధించిన పనులకు రూ.738 కోట్లు వరకూ ఖర్చు కానున్నట్లు నిట్‌ యాజమాన్యం ప్రతిపాదనలు తయారుచేసి కేంద్రానికి పంపించింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.230 కోట్లు వరకూ పనులు చేయాల్సి ఉంది. బడ్జెట్‌లో నిధులిస్తేనే నిట్‌ విద్యాసంస్థ అభివృద్ధి ముందుకు సాగుతుంది. విద్యార్ధులకు అవసరైన సౌకర్యాలు ఏర్పడతాయి. ఈసారి బడ్జెట్‌లో నిట్‌కు నిధులు కేటాయిస్తారా లేదో చూడాలి. జిల్లాలోని ఉద్యాన యూనివర్సిటీ అభివృద్ధికి కేంద్రం నుంచి నిధుల కేటాయింపు సరిగా జరగడం లేదు. ఈసారి బడ్జెట్‌లోనైనా నిధులు విడుదల కేటాయించాల్సి ఉంది.
ఆక్వా, వ్యవసాయ రంగాలకు అండగా నిలిచేనా
జిల్లాలో దాదాపు రెండు లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు సాగుతోంది. ప్రతియేటా రూ.15 వేల కోట్లకుపైగా ఆదాయం వస్తోంది. విదేశీ మారకద్రవ్యం పెద్దఎత్తున తెచ్చిపడుతున్న వాటిలో ఆక్వా సాగు ఒకటి. అలాంటి ఆక్వారంగానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమాత్రం మద్దతు లేకుండాపోయింది. మేత ధరలు విపరీతంగా పెంచేసింది. ధర విషయంలో నిలకడ లేకపోవడంతో వంద కౌంట్‌ సైతం రూ.200లోపే అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఆక్వా పరిశ్రమకు చేయూత విచ్చేవిధంగా బడ్జెట్‌లో నిర్ణయాలు జరగాలని ఆక్వా రైతులు ఎదురుచూస్తున్నారు. జిల్లాలో 80 శాతం ప్రజానీకం వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. గడిచిన ఏడాదిలో ఎరువుల ధరల 50 కిలోల బస్తా ఏకంగా రూ.1700కుపైగా చేరిపోయింది. పురుగుమందుల ధరల పరిస్థితి అదేవిధంగా ఉంది. దీంతో పెట్టుబడులు విపరీతంగా పెరిగాయి. మద్దతు ధర లేకుండాపోతుంది. ఎరువులకు సబ్సిడీ పెంచితే రైతులకు మేలు జరుగుతుంది. పామాయిల్‌ ధర పతనంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వ్యవసాయానికి వెన్నుదన్నుగా నిలిచేలా, మద్దతు ధర కల్పించేలా బడ్జెట్‌లో చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. మన జిల్లా కోడలు నిర్మలా సీతారామన్‌ జిల్లాలో అంశాలను పట్టించుకుంటారో.. లేదో మరికొద్ది గంటల్లో తెలియనుంది.