ప్రజాశక్తి-కలెక్టరేట్(కృష్ణా)
సంక్రాంతి పండుగను సాంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని, కోడి పందేలు, జూదక్రీడలు నిర్వహించే వారిపట్ల కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా అన్నారు. సోమవారం తన చాంబర్ లో సంక్రాంతి పండుగ సందర్భంగా చట్టవిరుద్ధంగా నిర్వహించే కోడి పందేలు, జూద క్రీడల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ఆయన జిల్లా ఎస్పీ పి. జాషువాతో కలసి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కోడి పందేలు, జూద క్రీడలు నిర్వహించకుండా డివిజన్, మండల, గ్రామ స్థాయి కమిటీలను ఏర్పాటు చేసి చర్యలు తీసుకోవాలన్నారు. కోడి పందేలు నిర్వహించుట, పాల్గొనుట చట్టరీత్యా నేరమని, నిబంధనలు ఉల్లంఘిం చిన వారిపై సెక్షన్ 10 ఆంధ్రప్రదేశ్ గేమింగ్ యాక్ట్ 1974, సెక్షన్ 34 జంతుహింస నివారణా చట్టం 1960 ప్రకారం క్రిమినల్ చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. వీటిపై ప్రజల్లో అవగాహన కల్పించాలని, గతంలో కోడి పందేలు నిర్వహించే వారిని, కత్తులు కట్టే వారిపై బైండోవర్ కేసులు నమోను చేయాలని ఆయన అధికారులకు సూచించారు. కోడి పందేలు జరుగుతున్నా యన్న సమాచారం అందిన వెంటనే అక్కడకు వెళ్లి బరిలను ధ్వంసం చేసి తగు చర్యలు తీసుకోవాలన్నారు. కోడిపందేలు నిర్వహిం చుట, పాల్గొనుట చట్టరీత్యా నేరం పోస్టర్లను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో డిఆర్వో ఎం. వెంకటేశ్వర్లు, బందరు డిఎస్పీ మాసూం బాషా, జడ్ పి సిఇఓ శ్రీనివాసరావు, పశుసంవర్ధక శాఖ జేడి కె.చంద్ర శేఖర్, మచిలీపట్నం, గుడివాడ, ఉయ్యూరు రెవెన్యూ డివిజన్ల ఆర్డీఓలు ఐ. కిషోర్, పి.పద్మావతి, విజరు కుమార్, డిఎల్ ఒ డి.సుబ్బారావు, స్థానిక గోసాల నిర్వాహకులు పల్లబోతు సుబ్రహమణ్యం, మున్సిపల్ కమీషనర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.










