Jan 11,2023 21:01

కోడిపందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు
ప్రజాశక్తి - జీలుగుమిల్లి

                రానున్న సంక్రాంతి సందర్భంగా గ్రామాల్లో కోడిపందేలు, గుండాట, పేకాట వంటి జూదాలకు దూరంగా ఉండాలని ఎంపిడిఒ మంగతాయారు తెలిపారు. మండలంలోని కామయ్యాపాలెం పంచాయతీలో బుధవారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సంక్రాంతి పండుగను కుటుంబ సభ్యులతో కలిసి మెలిసి సంప్రదాయ పద్ధతిలో జరుపుకోవాలని సూచించారు. కోడి పందేలు, గుండాట, పేకాట వంటి జూద క్రీడలు ఆడిన, ప్రోత్సహించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి దేవ ప్రియుడు, విఆర్‌ఒ అశోక్‌, మహిళ పోలీసు పాల్గొన్నారు.
గణపవరం : పండగ పేరుతో గ్రామాల్లో కోడిపందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని గణపవరం ఎస్‌ఐ వి.వెంకటేశ్వరరావు హెచ్చరించారు. మండలంలోని కాశిపాడు గ్రామ సచివాలయం వద్ద బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశానికి గ్రామ సర్పంచి కోట నాగేశ్వరరావు అధ్యక్షత వహించారు. వి.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఆనందంగా జరుపుకోవాల్సిన పండుగ రోజుల్లో కోడిపందేలు, గుండాట, పేకాట వంటి ఆటల వల్ల కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయన్నారు. యువత చెడు వ్యసనాలకు లోను కాకుండా గ్రామాల్లో ఆటల పోటీలు నిర్వహించాలని సూచించారు. పంచాయతీ కార్యదర్శి ఆర్‌డి రామారావు, ఎంపిటిసి సభ్యులు జంపన పద్మావతి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
జంగారెడ్డిగూడెం : మండలంలో కోడిపందేలు నిర్వహించకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నామని తహశీల్దార్‌ కె.స్లీవజోజి తెలిపారు. మండలంలోని టెక్కినవారిగూడెం, నిమ్మలగూడెం, అమ్మపాలెం, కట్టవ పొదలవారిగూడెం గ్రామాల్లో తహశీల్దార్‌ స్లీవజోజి ఆధ్వర్యంలో బుధవారం గ్రామసభలు నిర్వహించారు. ఈ సందర్భంగా తహశీల్దార్‌ మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సందర్భంగా గ్రామాల్లో కోడిపందేలు, పేకాట, గుండాట వంటి జూద క్రీడలు నిర్వహిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామాల్లో ఎక్కడైనా కోడిపందేలు నిర్వహించినట్లు తెలిస్తే గ్రామస్తులు పోలీసులకు రెవెన్యూ అధికారులకు సమాచారం అందించాలని కోరారు. గ్రామాల్లో ఎప్పటికప్పుడు పోలీసు, రెవెన్యూ అధికారుల పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు. ఈ గ్రామ సభల్లో ఆయా గ్రామాల , సర్పంచ్‌ లు, ఎంపిటిసి లు వార్డు సభ్యులు,సచివాలయ, రెవెన్యూ,పోలీసు సిబ్బంది ,గ్రామ వాలంటీర్లు, గ్రామస్థులు ,నాయకులు పాల్గొన్నారు.
బుట్టాయగూడెం : మండలంలోని కొమ్ముగూడెం, పైదవారిగూడెం గ్రామాల్లో తహశీల్దార్‌ ఎస్‌ఎస్‌.శాంతి, ఎస్‌ఐ జయబాబు ఆధ్వర్యంలో బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజలు అసాంఘిక కార్యక్రమాలకు దూరంగా ఉండాలని చెప్పారు. పేకాట, కోడిపందేలు వంటి జూదాల వల్ల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయన్నారు. పండుగ సమయాల్లో ఇటువంటి పరిస్థితులు తెచ్చుకోవద్దని సూచించారు. అసాంఘిక కార్యక్రమాలల్లో పాల్గొన్న వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో లక్ష్మడుగూడెం గ్రామ పంచాయతీ సర్పంచి మడకం రామలక్ష్మి, సెక్రటరీ రవి, విఆర్‌ఒ అశ, మహిళా పోలీసులు, గ్రామస్తులు, యువకులు పాల్గొన్నారు.
చింతలపూడి : మండలంలోని రాఘవపురం, లింగగూడెం గ్రామాల్లో తహశీల్దార్‌ కృష్ణజ్యోతి, ఎస్‌ఐ డి.హరికృష్ణ బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సాంప్రదాయ పద్ధతిలో చేసుకోవాలని సూచించారు. జూదాలకు దూరంగా ఉండాలని చెప్పారు. నేటి ఆధునిక యువతకు పండుగ విశిష్టత గురించి అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు.