ప్రజాశక్తి - మండవల్లి
యువత కోడిపందేలు, పేకాట, గుండాటకు ఆకర్షితులై తమ ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని, వాటికి దూరంగా ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక సభ్యులు ఎల్‌ఎస్.భాస్కరరావు అన్నారు. సంక్రాంతి నేపథ్యంలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలను అడ్డుకునేలా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం తహశీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో తహశీల్దార్ జనార్ధనరావుకు ఆయన వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కైకలూరు నియోజకవర్గంలోని మండవల్లి, కైకలూరు, కలిదిండి, ముదినేపల్లి పలు మండలాల్లో సంక్రాంతిని పురస్కరించుకుని కోడిపందేలు, పేకాట, గుండాట నిర్వహిస్తున్నారన్నారు. యువత కోడిపందేల్లో సొమ్ము పోగొట్టుకుని అప్పుల్లో కూరుకుపోతున్నారని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకుని అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపి యువత పెడదోవ పెట్టకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక మండల అధ్యక్షులు అప్పారావు, రెడ్డి పాల్గొన్నారు.










