ప్రజాశక్తి-పెదబయలు రూరల్:అంగన్వాడి కేంద్రాలకు అందిస్తున్న కోడిగుడ్ల టెండర్లను రద్దు చేయాలని గిరిజన సమాఖ్య జిల్లా కార్యదర్శి కూడ రాధాకృష్ణ, ప్రజా సంఘాల ఐక్యవేదిక కో కన్వీనర్ కుమార్ డిమాండ్ చేసారు. మండలంలో బోయా రాజులు, రాయి మామిడి, గొమంగి తదితర గ్రామాలను గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ, గర్భిణీలు, బాలింతలకు అంగన్వాడి కేంద్రాలకు సరఫరా చేస్తున్న పౌష్టికాహారం పంపిణీలో అక్రమాలు జరుగుతున్నాయన్నారు. కోడిగుడ్ల టెండర్లు యజమాన్యం, ఐసిడిఎస్ అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంగన్వాడి కేంద్రాలకు సరఫరా చేస్తున్న కోడిగుడ్లు నాణ్యత లేకుండా సరఫరా చేస్తున్నారన్నారు. ఐసిడిఎస్ అధికారులు చోద్యం చూడటం వెనకాల రహస్యం ఏమిటని ప్రశ్నించారు. నియమ నిబంధనల ప్రకారం ఒక కోడి గుడ్డు 50 గ్రాముల బరువు ఉండాలని, కానీ 25 గ్రాములు 30, 35 గ్రాములు ఉంటున్నాయన్నారు. అంగన్వాడి కేంద్రాలకు సరఫరా చేస్తున్న సరుకులు ఐసిడిఎస్ పి.డి ముందుగా పరిశీలించిన తర్వాతనే అంగన్వాడి కేంద్రాలకు సరుకులు సరఫరా చేయాలన్నారు. కుళ్ళిపోయిన కోడిగుడ్లు, విరిగిన పాలు ప్యాకెట్లు, నాసిరకమైన సరుకులు అంగన్వాడీ కేంద్రాలకు పంపిణీ చేస్తుంటే ఐసిడిఎస్ అధికారులు పట్టించుకోకుండా ఏమి చేస్తున్నారో చెప్పాలన్నారు.










