ప్రజాశక్తి -బుచ్చయ్యపేట
సంక్రాంతి పండుగను పురస్కరించుకొని కోడి పందేలకు పందెంరాయుళ్లు సిద్ధమవుతున్నారు. కోటి పందేలపై పోలీసులు ఆంక్షలు విధించినా, వాటిని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో సంక్రాంతి సందర్భంగా గ్రామాల్లో తీర్థాలు ఎక్కువగా జరిగేవి. ఈ తీర్థాలలో ఎడ్ల పరుగు పందేలు, కోడి పందేలు, రకరకాల పోటీలు నిర్వహించడం వల్ల ఉత్సాహ వాతావరణం సందడి కనిపిస్తూ ఉండేది. కొంతకాలంగా తీర్థాల నిర్వహణ తగ్గింది. కోడి పందేళ్లు తగ్గుతూ వచ్చాయి. అయితే సంక్రాంతి పండుగను పురస్కరించుకొని పందెం రాయుళ్లు కోడి పందేలకు సిద్ధమయ్యారు. మండలంలోని కోయిలాపల్లి, రాజాం, సీతయ్యపేట, చోడవరం సరిహద్దులోని కందిపూడి తదితర ప్రాంతాల్లో కోడి పందేలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. సంక్రాంతి కోడి పందేలకు కొద్దిరోజులుగా పందెం కోళ్లను తయారు చేస్తున్నారు. ప్రతిరోజు బలమైన ఆహారాన్ని ఇస్తూ కోళ్లకు సైతం సంరక్షణ చర్యలను చేపడుతున్నారు. పోలీసుల ఆంక్షలు ఉండడంతో గ్రామాల శివారు ప్రాంతాలు ఎప్పటికప్పుడు పరస్పరం సమాచారం ఇచ్చుకుని రెండు మూడు జతలను పందేలు నిర్వహించి పోయే విధంగా ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలిసింది.
పందెంకోడి ధర ఎక్కువే
పందెం కోళ్ల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. గతంలో రూ.1000 నుండి రూ.2000 వరకు ఉండే పందెం కోళ్ళు ధర ప్రస్తుతం రూ.5 వేలు నుండి రూ.7వేలు వరకు పలుకుతున్నాయి. పందేలపై ఆసక్తి కలిగిన వారు కోడిపుంజులను కొనుగోలు చేసుకుని కోడికి కత్తి కట్టడానికి సిద్ధమవుతున్నారు.










