Jan 10,2023 22:44

ప్రజాశక్తి - ముదినేపల్లి
        జిల్లాలో శివారు మండలమైన ముదినేపల్లిలో సంక్రాంతిని పురస్కరించుకుని కోడిపందేలు జోరుగా నిర్వహించేందుకు నిర్వాహకుల సన్నద్దమవుతున్నారు. ఇప్పటికే పలుగ్రామాల్లో చెరువు గట్లపై, గ్రామాల్లో కోడిపందేలు నిర్వహిస్తున్నారు. కోడి పుంజులను ఇప్పటికే పందేలకు సిద్ధం చేశారు. ప్రతిఏటా ప్రభుత్వం హెచ్చరించడం, చివరకు పోలీసుల అదేశాలు బేఖాతార్‌ చేస్తూ పందేలకు దిగడం పరిపాటిగా మారుతోంది. ఈ ఏడాది కూడా అదే పరిస్థితి మండలంలో కనిపిస్తోంది. మండలంలోని జానకిగూడెం, బొమ్మినంపాడు, ఈడేపల్లి దేవపూడి, వడాలి, ముదినేపల్లి, అన్నవరం, పేరూరు గ్రామాల్లో కోడిపందేల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. మండలంలోని పలుగ్రామాల్లో చేపలు, రొయ్యల చెరువుల మధ్య కోడిపుంజులను ప్రత్యేకంగా పెంచుతున్నారు. ముదినేపల్లిలో ఒక్కో పుంజు ధర రూ.లక్ష నుంచి రూ.ఐదు లక్షల వరకు ధర పలుకుతుందని పందేలరాయుళ్లు చెబుతున్నారు. మండలంలో కొత్తగా గురజ, చిగురుకోట, వాడవల్లి తదితర గ్రామాల్లో బరుల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ముందుగానే బరులు సిద్ధం చేస్తే పోలీసులు వాటిని ధ్వంసం చేస్తారని, 13వ తేదీ రాత్రి బరులు సిద్ధం చేసేందుకు సిద్ధమవుతున్నారు. 14వ తేదీ భోగి పండుగ కనుక ఇబ్బంది ఉండదనే ఆలోచనలో పందేలరాయుళ్లు ఉన్నారు.