రాజంపేట అర్బన్ : పట్టణంలో సాయినగర్‌లో ఉన్న రంగయ్య నవోదయ, సైనిక్ కోచింగ్ సెంటర్లపై చర్యలు తీసుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ, పిడిఎస్‌యు విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. కోచింగ్ సెంటర్లపై చర్యలు చేపట్టాలని కోరుతూ శుక్రవారం మండల విద్యాశాఖ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీరామ్ పురుషోత్తం చిట్వేలి మండలంలోని జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి వచ్చిన సందర్భంగా వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎటువంటి అనుమతులు లేకుండా నవోదయ, సైనిక్, ఆర్‌ఎంఎస్ పేరుతో లక్షల రూపాయలు వసూలు చేస్తూ విద్యార్థులకు ఎటువంటి వసతులు కల్పించకుండా ఒక ఇంటి గదిలోని హాలులో దాదాపు 70 నుండి 100 మంది విద్యార్థులను కిక్కిరిసేలా కూర్చోబెట్టి దాదాపు 30 సంవత్సరాల నుండి అనుమతులు లేకుండా కోచింగ్ సెంటర్ నడుపుతున్నారని పేర్కొన్నారు. విద్యార్థులకు కనీస సౌకర్యాలు కూడా అందించకుండా ప్రభుత్వ, ప్రయివేట్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థు లను కోచింగ్ సెంటర్‌లో చేర్చుకున్నారని, వారి అడ్మిషన్లు, హాజరు ఎక్కడు న్నాయో తెలపాలన్నారు. ఎటువంటి ఫ్యాకల్టీ లేకుండా, కనీసం ప్రత్యేక బిల్డింగ్ లేకుండా, ఎమర్జెన్సీ సేఫ్టీ పరికరాలను కూడా ఉపయోగించకుండా కోచింగ్ ఇస్తున్నారని పేర్కొన్నారు. విద్యా వ్యాపారాన్ని అరికట్టాలని, అలా విద్యను వ్యాపారంగా చేస్తున్న వారిపై తక్షణమే జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీరామ్ పురు షోత్తం స్పందించి కోచింగ్ సెంటర్‌పై చర్యలు తీసుకొని వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా రంగయ్య అనే వ్యక్తి విద్యార్థులను హాస్టల్ అనుమాతులు లేకుండా ఒకే ఇంట్లో హాస్టల్ నిర్వహిస్తున్నాడని ఆరోపించారు. కోచింగ్ సెంటర్ పై చర్యలు తీసుకోని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు గౌరీశంకర్, చంగయ్య, సుమంత్, పిడిఎస్‌యు నాయకులు హరి తదితరులు పాల్గొన్నారు.