ప్రజాశక్తి -ఆనందపురం : కో-ఆపరేటివ్ బ్యాంకుల ద్వారా రైతులకు, ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించడానికి వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నట్లు డిసిసిబి చైర్మన్ కోలా గురువులు పేర్కొన్నారు. ఆనందపురం మండలానికి నూతనంగా మంజూరైన కో-ఆపరేటివ్ బ్యాంకు ఏర్పాటుకు శనివారం బిల్డింగ్ పరిశీలన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల అవసరాలకు సంబంధించి అన్ని రకాలు రుణాలను తక్కువ వడ్డీ రేట్లకే అందిస్తామన్నారు. మూడు జిల్లాలలో 98 పిఎసిఎస్ బ్యాంకుల ద్వారా రుణాలను అందిస్తున్నట్లు తెలిపారు. మండలానికి ఒక కో-ఆపరేటివ్ బ్యాంకు చొప్పున 13 జిల్లాలలో ఏర్పాటు చేస్తున్నామన్నారు. అందులో భాగంగా ఆనందపురం, పద్మనాభ మండలాల్లో బ్యాంకు ఏర్పాటుకు స్థల పరిశీలన చేస్తున్నట్లు చెప్పారు. అనంతరం మండలంలో రైతులకు రుణాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సిఇఒ డివిఎస్.వర్మ, డిసిఎంఎస్ డైరెక్టర్ పాండ్రంకి అప్పారావు, పద్మనాభం, వెములవలస, ఆనందపురం పిఎసిఎస్ సెక్రటరీలు కోటేశ్వరరావు, దశావతారం, పంచముఖేశ్వరరావు, నోడల్ ఆఫీసర్ రామకృష్ణ, పిఎసిఎస్ డైరెక్టర్ లింగం వెంకట్రావు, సూపర్‌వైజర్ వేణుగోపాల్, సిబ్బంది ఎస్ నారాయణరావు పాల్గొన్నారు.










