Nov 15,2023 21:15

పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్న ఎఎంసి చైర్‌పర్సన్‌ అనంతకుమారి

ప్రజాశక్తి - సాలూరు : ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల పంటలకు మద్దతు లభిస్తుందని, కావున వీటిని వినియోగించుకోవాలని ఎఎంసి ఛైరపర్సన్‌ దండి అనంతకుమారి అన్నారు. బుధవారం స్థానిక ఎఎంసి యార్డ్‌లో కొనుగోలు కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రైతులు దళారీల బారిన పడకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం పత్తి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసిందన్నారు. ఈ కేంద్రాలకు రైతులకు తమ పంట తీసుకొచ్చి మద్దతు ధర పొందాలన్నారు.
ఇదిలా ఉండగా పత్తి కొనుగోలు కేంద్రం ఏర్పాటైతే బాగుంది కానీ విక్రయాల మరోచోట ఏర్పాటు చేయడం, పంట ఆఖరు దశలో ఏర్పాటు చేయడం తమకు ఎలాంటి ప్రయోజనం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సెప్టెంబరులోనే పత్తి పంట దిగుబడి ప్రారంభమైంది. అంటే రైతులు రెండు నెలల క్రితమే పత్తి ఏరివేసి అమ్మకానికి సిద్ధంగా ఉంచారు. కానీ ఇంతవరకు కొనుగోలు కేంద్రం ప్రారంభం కాకపోవడంతో రైతులు చాలా వరకు పత్తిని ప్రయివేటు వ్యాపారులకు అమ్మేశారు. ఈ ప్రాంతంలో పండించిన పంటలో దాదాపు 70శాతం ప్రయివేటు వ్యాపారులకు అమ్మకమైంది. నవంబరు వరకు కొనుగోలు కేంద్రం ప్రారంభం కాకపోవడంతో రైతులు ప్రయివేటు వ్యాపారులకు గత్యంతరం లేక విక్రయించారు. కొనుగొలు కేంద్రం ఇక్కడ ప్రారంభించినా సరుకు కొనుగోలు మాత్రం రామభద్రపురం మండలం బూశాయివలసలోని జిన్నింగ్‌ మిల్లులోనే చేపడతారు. ఈ విషయాన్ని మార్కెటింగ్‌ శాఖ ఆర్‌జెడి సుధాకర్‌ విలేకరులకు చెప్పారు. ప్రభుత్వం నిర్దేశించిన ధర రూ.7020కే కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. కాటన్‌ కార్పొరేషన్‌కు సంబంధించిన కొనుగోలుదారు జిన్నింగ్‌ మిల్లులోనే వుంటారు. రైతులు నేరుగా అక్కడకే పత్తిని తరలించాల్సి వుంటుంది. ఉమ్మడి జిల్లాల నుంచి కూడా పత్తిని ఈ జిన్నింగ్‌ మిల్లు కే తరలించాల్సి వుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రయివేటు జిన్నింగ్‌ మిల్లులకే పత్తి కొనుగోలు బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కంటే తక్కువ ధరకు కొనుగోలు చేస్తే వ్యాపారులపై కేసులు నమోదు చేస్తామని ఆర్‌జెడి సుధాకర్‌ చెప్పడం హాస్యాస్పదంగా ఉందని రైతులు భావిస్తున్నారు. సెప్టెంబరులో దిగుబడి అయిన పత్తిని రెండు నెలల పాటు ఇళ్లల్లో ఎలా దాచుకుంటామని రైతులు వాపోతున్నారు. 70శాతం మంది రైతులు ఇప్పటికే పత్తిని ప్రయివేటు వ్యాపారులకు విక్రయించారు. సిసిఐ, మార్కెటింగ్‌ శాఖ అధికారులు పత్తి రైతులను మభ్యపెట్టేలా ప్రకటనలు ఇవ్వడం చర్చనీయాంశమైంది. కార్యక్ర మంలో ఆర్‌డిడి ఎర్రన్న, ఎఎంసి కార్యదర్శి భారతి, వైసిపి నాయకులు డి.శ్రీనివాసరావు పాల్గొన్నారు.