Jul 21,2023 23:39

సమావేశంలో మాట్లాడుతున్న బొల్లా బ్రహ్మనాయుడు

వినుకొండ: ముల్పురి ఆగ్రోటెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ వద్ద నుండి తాను కొనుగోలు చేసిన భూమిలో ప్రభుత్వ భూములు లేవని, ఒక్క సెంటు భూమి ఉన్నట్లు నిరూపించిన తిరిగి ఇచ్చేస్తానని, ప్రతిపక్ష నేత జీవీ ఆంజనేయులు ఆరోపణల్లో వాస్తవాలు లేవని ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అన్నారు. స్థానిక వైసిపి కార్యాలయంలో శుక్రవారంజరిగిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాటాడుతూ టిడిపి హయాంలో అప్పటి ఎమ్మెల్యే ఆంజ నేయులు గుమ్మనంపాడు భూములను బినామీ పేర్లపై రెవిన్యూ రికా ర్డులకు ఎక్కించి ఆయన బావమరిది చేత అమ్మి సొమ్ము చేసుకున్నారని ఆరోపించారు. వినుకొండ మండలం కొప్పుకొండ ప్రభుత్వ భూములు కూడా జీవి హయాంలో ఆక్రమణలకు గురయ్యాయని, వాటిపై తాము చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. టిడిపి హయాంలో జరిగిన భూ ఆక్రమణల వివరాలన్నీ సాక్షాధారాలతో నిరూపిస్తామని జైలు శిక్ష తనకు కాదు జీవీ ఆంజనేయులుకే పడుతుందని అన్నారు. గుమ్మనంపాడులో 160 ఎకరాల భూమిని పేదలకు పంచుతున్నామని తెలిపారు. బొడి చిమ్మునువారి పాలెం వద్ద జీవీ ఆంజనేయులు నిర్మించిన గెస్ట్‌ హౌస్‌ నిర్మాణం ఎన్‌ఎస్పీ కాలవపై జరిగిందని, దానిపై సమగ్ర విచారణ చేపట్టి ఆక్రమణ ఉంటే తొలగిస్తామని చెప్పారు. ఇన్నిమెల్లలో నాలుగు ఎకరాల శ్మశానం టిడిపి హయాంలో జీవి ఆంజనేయులు బినామీలు ఆక్ర మించారని ఆరోపించారు. తన భూముల్లో ప్రభుత్వ భూములు ఉన్నట్లు నిరూపితమైతే దేనికైనా తాను సిద్ధమని అన్నారు.