ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించే వరకు పోరాటం కొనసాగుతుందని యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి టి.చక్రవర్తి అన్నారు. కాకినాడ యుటిఎఫ్ హోమ్ వద్ద దీక్షలు శుక్రవారం కొనసాగాయి. ఈ సందర్భంగా చక్రవర్తి మాట్లాడుతూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లను జగన్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని ఉపాధ్యాయులకు ఆయన పిలుపునిచ్చారు. జిల్లా అధ్యక్షుడు కెవి.నగేష్ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. నిరవధిక నిరాహార దీక్షలు జరుగుతున్నా ప్రభుత్వం ఏమాత్రం స్పందించడం లేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని ఒపిఎస్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. యుటిఎఫ్ నేత ప్రభాకర్ వర్మ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ఒపిఎస్ అమలు చేసే వారికే మా ఓటు అని నినాదాలు చేశారు. గతరాత్రి అర్ధరాత్రి దాటిన తరువాత పోలీసులు నిరాహార దీక్షను భగం చేయడం దారుణం అన్నారు. ఈ దీక్షలో జె.ప్రసాద్, జి.రాజు, బి.గోవిందరావు, ఎస్.కె బాబా, కె.హరిబాబు, ప్రభాకర్ రావు, ఎస్.శ్రీనివాస్ పాల్గొన్నారు.










