కడప ప్రతినిధి జిల్లాలో తీవ్ర వర్షాభావం కొనసాగుతోంది. జిల్లాలోని 36 మండలాల్లో భారీగా లోటు వర్షపాతం నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. కడప జిల్లాలో ఎక్కడ సాధారణ వర్షపాతం నమోదైన దాఖలాల్లేవు. దీనికి పైపెచ్చు అక్టోబర్‌లో డ్రైస్పెల్ నమోదు కావడం రబీ సీజన్ సాగుపై నీలినీడలు కమ్ముకున్నాయని చెప్పవచ్చు. ఈలెక్కన 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఖరీఫ్, రబీ సీజన్‌లు వరుసగా తీవ్ర దుర్భిక్ష పరిస్థితులను ఎదుర్కొనడం ఆందోళన కలిగిస్తోంది. ఇటువంటి తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో 87 శాతం విస్తీర్ణంలో విత్తనం పడని పరిస్థితి కనిపిస్తోంది.
జిల్లాలో రబీ సీజన్ కథ కంచికి చేరినట్లు కనిపిస్తోంది. 2022-23 రబీలో 3,72,050 ఎకరాల్లో సాగు చేయాలనేది వ్యవసాయశాఖ లక్ష్యం. అక్టోబర్ ఒకటి నుంచి డిసెంబర్ వరకు విత్తనం వేయాల్సి ఉంది. అక్టోబర్, నవంబర్ మాసాల్లో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రబీ సాగు ప్రశ్నార్థకంగా మారనుంది. అక్టోబర్ నుంచి నేటి వరకు 7.8 శాతానికి మంచి వర్షపాతం నమోదు కాని నేపథ్యం విస్మయాన్ని కలిగిస్తోంది. రబీ సీజన్ ప్రారంభం నుంచి నేటి వరకు 48,505 ఎకరాల్లోనే విత్తనం పడినట్లు వ్యవసాయశాఖ గణాంకాలు పేర్కొనడం ఆందోళన కలిగిస్తోంది. గతేడాది ఇదేసమయానికి సుమారు 70 వేల ఎకరాల్లో విత్తనం పడినట్లు తెలుస్తోంది. ఈలెక్కన జిల్లాలో మరో 3,23,545 ఎకరాల్లో విత్తనం పడాల్సి ఉంది. ఈలెక్కన రబీ సాగు తీరుతెన్నలను పరిశీలిస్తే ఆందోళన కలిగిస్తోంది.
భయపెడుతున్న డ్రైస్పెల్స్
జిల్లాలో డ్రైస్పెల్స్ గండం పొంచి ఉంది. అక్టోబర్ మాసంలో 23.6 మి.మీ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా ఆశించిన వర్షపాతం నమోదు గాకపోవడం గమనార్హం. రబీ సీజన్ ప్రారంభ మాసమైన అక్టోబర్‌లో తొలి డ్రైస్పెల్ నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. గత ఖరీఫ్ సీజన్‌లోనూ ఇదేతరహా పరిస్థితి ఎదురైన సంగతి తెలిసిందే. డ్రైస్పెల్ నమోదైన అనంతరం 7.8 శాతం మాత్రమే వర్షపాతం నమోదు కావడం గమనార్హం. రబీ సాగులో ప్రాధాన్యత కలిగిన నవంబర్ మాసంలోనూ వర్షాభావ పరిస్థితులే కొనసాగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. నవంబర్‌లో 118 మి.మీ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, రెండవ వారంలోకి చేరుతున్న నేపథ్యంలో 7.7 మి.మీ వర్షపాతం మాత్రమే నమోదు కావడం విస్మయాన్ని కలిగిస్తోంది. డిసెంబర్ నెలాఖరు వరకు నమోదు కానున్న వర్షపాతం తీరుతెన్నులు సాగు లక్ష్యాన్ని నిర్దేశించనుంది. రబీ సీజన్ ఆందోళనకర స్థాయిలో లోటు వర్షపాతం నమోదు కావడం రైతాంగాన్ని నిరాశ ఆవరించింది. జిల్లావ్యాప్తంగా తీవ్ర దుర్భిక్ష వాతావరణ పరి స్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో రబీ సీజన్ సాగు లక్ష్యాన్ని చేరుకోవడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
పాలకులకు కనిపించని కరువు
జిల్లాలో 17 మండలాల్లో కరువు తాండవం చేస్తోంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఖరీఫ్ సీజన్ మొదలుకుని రబీ సీజన్ మధ్యస్థ దశ వరకు తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు నెలకొనడం ఆందోళన కలిగిస్తోంది. జిల్లా అధికార యంత్రాంగం జిల్లాలోని 36 మండలాల్లో 17 మండలాల్లో కరువు పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయని ప్రతిపాదనలు అందజేసింది. రాష్ట్రంలో కరువు పరిస్థితులపై ఆందోళనలు నెలకొన్న నేపథ్యంలో ప్రభుత్వం ఆలస్యంగా మేల్కొంది. కడప జిల్లాలో ఏ ఒక్క మండలాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించలేదు. రబీ సీజన్ ప్రారంభమై రెండో నెల గడుస్తున్నప్పటికీ ఖరీఫ్ తరహా దుర్భిక్ష పరిస్థితులు నెలకొనడం ఆందోళన కలిగిస్తోంది.
రబీ సాగుపై నీలినీడలు
రబీ సీజన్‌లోని 20 రకాల పంటలు సాగవుతున్న సంగతి తెలిసిందే. ఇందులో ఏఒక్కటీ పూర్తి స్థాయిలో సాగుకు నోచుకునే అవకాశాలు లేవనే సందేహం కలుగుతోంది. చివరికి వర్షాధార పంటలైన కొర్రలు, అరికెలు, సోమలు, వరిగ, ఊదలు వంటి సిరిధాన్యాలపై సందేహాలు ముప్పిరి గొన డం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. జిల్లా సాగు విస్తీర్ణమైన 3,72,505 ఎకరాల సాగు లక్ష్యంలో ప్రధాన పంటలైన వరి 26,673 ఎకరాలు, బుడ్డశనగ 2,32,360 ఎకరాల్లో సాగు కావాల్సి ఉండగా 3,352 ఎక రాల్లో మాత్రమే విత్తనం పడినట్లు తెలుస్తోంది. జొన్న 10,145 ఎకరాలు, వేరుశనగ 1755 ఎకరాలు, మినుములు 30,677 ఎకరాల్లో సాధారణ సాగుకు నోచుకోవడం గమ నార్హం. ఇందులో మినుముల సాగు మాత్రమే లక్ష్యానికి మంచి 122 శా తం సాగు కావడం గమనించాల్సిన విషయం.
రబీ లక్ష్యాన్ని అధిగమిస్తాం
రబీ లక్ష్యాన్ని అధిగమిస్తామని ఆశిస్తున్నాం. నవంబర్‌లో వర్షపాతం నమోదును బట్టి సాగు పరిస్థితిని అంచనా వేయవచ్చు. ఇప్పటికి 13.4 శాతం విస్తీర్ణంలో మాత్రమే విత్తనం పడింది. డిసెంబర్ నెలాఖరు నాటికి నిర్దేశిత లక్ష్యాన్ని అధిగమిస్తామని ధీమాను వ్యక్తం చేయడం గమనార్హం.
- నాగేశ్వరరావు, అగ్రికల్చర్ జెడి. కడప.