Sep 21,2023 21:06

దీక్షా శిబిరాన్ని సందర్శిస్తున్న టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు అశోక్‌గజపతిరాజు

ప్రజాశక్తి-విజయనగరం కోట :  చంద్రబాబునాయుడు అరెస్టుకు నిరసనగా టిడిపి నాయకులు చేపట్టిన నిరసన దీక్షలు 9వ రోజుకు చేరుకున్నాయి. గురువారం జిల్లా పార్టీ కార్యాలయం (అశోక్‌బంగ్లా) వద్ద చేపట్టిన దీక్షలను పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు పి.అశోక్‌గజపతిరాజు ప్రారంభించారు. అంతకుముందు గురజాడ అప్పారావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పోస్ట్‌ కార్డు ఉద్యమంలో భాగంగా మేము సైతం చంద్రబాబుకు మద్దతు తెలుపుతూ పోస్ట్‌ కార్డుపై సంతకం చేశారు.
స్వేచ్ఛగా నినదించిన గళం
చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ ఏర్పాటు చేసిన ఫ్రీడం ఆఫ్‌ వాయిస్‌ కార్యక్రమం రాజకీయ పార్టీలకు అతీతంగా స్వేచ్ఛగా గళం వినిపించింది. హోటల్‌ మయూరలో జరిగిన ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన గణపతినీడి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రతీకగా నిలిచిన భారతదేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా మన రాష్ట్రంలో అరాచకం నెలకుందని, చంద్రబాబు అక్రమ అరెస్ట్‌ దానికి ఉదాహరణగా చెప్పుకోవచ్చని అన్నారు. టిడిపి జిల్లా పార్లమెంటరీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున, టిడిపి సీనియర్‌ నాయకులు ద్వారపురెడ్డి జగదీష్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవిపి రాజులు మాట్లాడుతూ ఎటువంటి ఆధారాలు లేకుండా రాష్ట్ర ప్రధాన ప్రతిపక్షనేత అరెస్ట్‌ అప్రజాస్వామికమని అన్నారు. లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు భీశెట్టి బాబ్జీ, సిపిఐ రాష్ట్ర నాయకులు కామేశ్వరరావు, మాజీ మంత్రి పడాల అరుణ, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్వి, ఆమ్‌ ఆద్మీ పార్టీ జిల్లా అధ్యక్షులు దయానంద్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో రాజ్యాంగేతర శక్తి పరిపాలనలో ప్రజలు నలిగిపోతున్నారని, ప్రజలలో చైతన్యం రావాలని అన్నారు.