ప్రజాశక్తి - భట్టిప్రోలు
చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ స్థానిక పెట్రోల్ బంకు సమీపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శిబిరంలో నిరాహార దీక్ష చేశారు. బీసీ, రైతు విభాగాల ఆధ్వర్యంలో గురువారం జరిగిన దీక్షకు పెద్ద ఎత్తున కార్యకర్తలు, మహిళలు హాజరయ్యారు. దీక్షా శిభిరం వద్ద నలుపు, పసుపు రంగులతో దద్దరిల్లింది. మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, టిడిపి రాష్ట్ర కార్యదర్శి తూనుగుంట్ల సాయిబాబా మాట్లాడారు. అవినీతితో అక్రమాస్తులు కూడబెట్టిన సిఎం జగన్‌రెడ్డి తనపై ఉన్న కేసులను మాఫీ చేసుకోవడానికి, రాను ఎన్నికలలో ఓడిపోతామనే భయంతోనే అవినీతి మచ్చలేని చంద్రబాబును అక్రమ కేసులతో అరెస్టు చేయించారని ఆరోపించారు. ఎన్ని కుట్రలు చేసినా టిడిపి విజయాన్ని ఆపలేరని అన్నారు. చంద్రబాబు అరెస్టును ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలు, మేధావులు, ఆయా దేశాధినేతలు సైతం ఖండిస్తున్నారని అన్నారు. అక్రమాస్తుల కేసులో జగన్‌ను అరెస్ట్ చేసినప్పుడు తల్లి, చెల్లి తప్ప ఎవ్వరూ సపోర్ట్ చేయలేదని అన్నారు. నేడు చంద్రబాబుకు వస్తున్న ప్రజాస్పందనే ఆయన నిజాయితీకి నిదర్శనమని అన్నారు. కార్యక్రమంలో రేపల్లె మాజీ ఎంఎల్‌ఎ ముమ్మనేని వెంకటసుబ్బయ్య, బట్టు మల్లికార్జునరావు, సిరాజుద్దీన్, కనపర్తి సుందర్రావు, వాకా శేషుబాబు, నాయకులు మైనేని మురళీకృష్ణ, జొన్నలగడ్డ విజయబాబు, కనగాల మధుసూదన్ ప్రసాద్, నూతక్కి దినకర బాబు, మాచర్ల నాగరాజు, చందోలు పృథ్విలత, మాజీ ఎంపీపీ వాకా సుధ పాల్గొన్నారు.










